Nellore Airport : నెల్లూరు నుంచి విమానం ఎగిరేది ఎప్పుడో? భూసేకరణపై రావాల్సిన క్లారిటీ!

Nellore Airport : నెల్లూరు జిల్లాలో విమానాశ్రయం కోసం భూసేకరణ ఇంకా కొలిక్కి రాలేదు. మరోసారి గ్రామ సభలు జరుగుతున్నాయి. కుటుంబాల్లో వివాదాలు కూడా భూసేకరణకు అడ్డుగా మారాయి.

Published on: May 3, 2026, 14:43:56 IST
By , Nellore
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నెల్లూరు జిల్లా దగదర్తి గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్టు పట్టాలెక్కడానికి సిద్ధమవుతుందనుకున్న సమయంలో భూసేకరణ గురించి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మరోసారి గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. ప్రక్రియ నత్తనడకన సాగుతుండటంతో అటు అధికారులు, ఇటు రైతులు అయోమయంలో ఉన్నారు.

ప్రతీకాత్మక చిత్రం (Unsplash)
ప్రతీకాత్మక చిత్రం (Unsplash)

విమానాశ్రయం కోసం మొత్తం 1379.71 ఎకరాలు అవసరం కాగా, అధికారులు ఇప్పటివరకు సగం దూరం మాత్రమే పూర్తి చేయగలిగారు. 689.71 ఎకరాల సేకరణ పూర్తయి, పరిహారం కూడా పంపిణీ చేశారు. మిగిలిన 690 ఎకరాల సేకరణ ఇప్పుడు అత్యంత క్లిష్టంగా మారింది.

దామవరం పరిధిలోని సర్వే నంబర్ల చుట్టూ ఇప్పుడు వివాదం ముదురుతోంది. సర్వే నంబర్ 1-1: ఇక్కడ 176 మంది రైతులకు సంబంధించి 431.36 ఎకరాల శాశ్వత లీజు భూములు ఉన్నాయి. గతంలో జరిగిన అవకతవకల వల్ల రైతులు, పారిశ్రామికవేత్తల మధ్య వివాదం కోర్టు మెట్లెక్కింది.

సర్వే నంబరు 238 నుంచి 258 వరకు ఉన్న 136.76 ఎకరాల డీకేటీ భూముల సేకరణ అధికారులకు సవాలుగా మారింది. గతంలో జరిగిన తప్పులు నేడు మా పాలిట శాపంగా మారాయని కొందరు అంటున్నారు. ఎనిమిది సార్లు గ్రామసభలు జరిగినా ఒరిగిందేమీ లేదని చెబుతున్నారు.

ఇప్పటికే 8 సార్లు నిర్వహించిన గ్రామసభలు ఎలాంటి పరిష్కారాన్ని చూపలేదు. కేవలం శాశ్వత లీజు భూముల కోసమే 5 సార్లు ప్రయత్నించినా ఫలితం శూన్యం. ఈ నేపథ్యంలో శనివారం నుంచి ప్రారంభమయ్యే గ్రామసభల సందర్భంగా కూడా వివాదాలు తలెత్తాయి.

తాజాగా నెల్లూరు విమానాశ్రయ భూసేకరణ ప్రక్రియ మరోసారి రసాభాసగా మారింది. శనివారం ఆర్డీవో ఎలీషా ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామసభలు ఆశాజనకంగా ప్రారంభమైనప్పటికీ, క్షేత్రస్థాయిలో విభేదాలు భగ్గుమనడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రధానంగా దామవరం, కౌరుగుంట గ్రామాల్లో పరిహారం పంపిణీ విషయంలో అధికారులకు చుక్కెదురైంది.

దామవరంలోని సర్వే నంబర్ 1-1 పరిధిలో 36 మంది రైతులకు సంబంధించిన 86 ఎకరాలకు పరిహారం ఇచ్చేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి వివాదాలు, వాదోపవాదాలు తలెత్తడంతో 21 మందికి చెందిన 52 ఎకరాల పంపిణీని అధికారులు తక్షణమే నిలిపివేశారు.

కేవలం 15 మంది రైతులు మాత్రమే ఏకాభిప్రాయానికి రావడంతో, వారికి సంబంధించిన 34 ఎకరాలకు పరిహారం అందించేందుకు అంగీకారం కుదిరింది. కౌరుగుంటలో పరిస్థితి మరింత భిన్నంగా ఉంది. ఇక్కడ 9 మందికి పరిహారం ఇవ్వాలని అధికారులు భావించగా, గ్రామస్థులు గట్టిగా అడ్డుతగిలారు. గతంలో పట్టాలు రద్దు చేసిన నలుగురు వ్యక్తులకు ఎలా పరిహారం ఇస్తారని గ్రామస్థులు అధికారులను నిలదీశారు. దీనితో ఆ నలుగురి పేర్లను అధికారులు పక్కన పెట్టక తప్పలేదు. మరొకరి పేరులో తప్పులు దొర్లడంతో ఆ ఫైల్‌ను కూడా పెండింగ్‌లో పెట్టారు. చివరికి వివాదాలు లేని కేవలం నలుగురికి మాత్రమే పరిహారం ఇచ్చేందుకు మార్గం సుగమమైంది.

కుటుంబ తగాదాల వల్ల సుమారు 47 ఎకరాల పరిహారం పంపిణీ సందిగ్ధంలో పడింది. దీనిపై ఆర్డీవో ఎలీషా స్పందిస్తూ.. కుటుంబ సభ్యులందరూ ఒకే మాట మీద ఉండి, ఏకాభిప్రాయానికి వస్తేనే పరిహారం అందిస్తాం. వివాదాలు ఉన్న చోట నిధుల పంపిణీ సాధ్యం కాదని స్పష్టం చేశారు. నెల్లూరు నుంచి విమానం ఎగరాలంటే ముందు ఈ భూ సేకరణ చిక్కులు విడాలి. గ్రామసభలతోనే ఈ విషయంపై క్లారిటీ రానుంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More