...
...
Next Story

AP Sadarem Certificate: జులై 8 నుంచి ఏపీ సదరం స్లాట్ బుకింగ్స్ పున:ప్రారంభం.. కొత్త రూల్స్ ఇవే!

AP Sadarem Certificate: ఆంధ్రప్రదేశ్‌లో సదరం స్లాట్ బుకింగ్స్ జులై 8 నుంచి పున:ప్రారంభం అవుతాయి. అయితే కొన్ని మార్పులు చేసింది ప్రభుత్వం.

Published on: Jul 5, 2026, 21:42:50 IST
Advertisement

ఆంధ్రప్రదేశ్‌లో దివ్యాంగుల పింఛన్లు, ఇతర ప్రభుత్వ పథకాలకు అత్యంత కీలకమైన వైకల్య ధ్రువపత్రాల (సదరం - SADAREM) జారీ ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు తీసుకొచ్చింది. ఈ సేవల్లో దళారుల దోపిడీకి అడ్డుకట్ట వేస్తూ, పారదర్శకతను పెంచేందుకు సరికొత్త సంస్కరణలు ప్రవేశపెట్టినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ వెల్లడించారు. ఈ కొత్త విధానం ద్వారా దివ్యాంగులకు ప్రయాణ భారంతో పాటు, వైద్యులపై పనిభారం కూడా గణనీయంగా తగ్గనుంది.

జులై 8 నుంచి స్లాట్ బుకింగ్స్

ఏపీ సదరం స్లాట్ బుకింగ్స్
ఏపీ సదరం స్లాట్ బుకింగ్స్

గత కొంతకాలంగా నిలిచిపోయిన సదరం స్లాట్ బుకింగ్ ప్రక్రియ జులై 8 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. అనంతరం, జులై 13 నుంచి అర్హులైన అభ్యర్థులకు వైద్యులు వైకల్య నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంతకుముందు సదరం స్లాట్ల కోసం దివ్యాంగులు ఎక్కడో దూరంగా ఉన్న జిల్లాలకు ప్రయాణించాల్సి వచ్చేది. ఈ ఇబ్బందులను తొలగిస్తూ ఏపీ ప్రభుత్వాన్ని 6 జోన్లుగా విభజించింది.

ఇకపై దివ్యాంగులు తమ సొంత జోన్ పరిధిలోని జిల్లాల్లో మాత్రమే స్లాట్ బుక్ చేసుకోవడానికి వీలుంటుంది. దీనివల్ల వందల కిలోమీటర్లు ప్రయాణించాల్సిన అవసరం లేకుండా, స్థానికంగానే పరీక్షలు ముగించుకోవచ్చు.

తప్పుడు బుకింగ్స్‌కు చెక్.. ఇవి ఉంటేనే స్లాట్

సదరం సేవల్లో అవినీతిని నిరోధించేందుకు ప్రభుత్వం కఠిన నిబంధనలను అమలు చేస్తోంది. స్లాట్ బుక్ చేసుకునే సమయంలో స్వీయ ధ్రువీకరణ పత్రం సమర్పించడం తప్పనిసరి. వైకల్య కేటగిరీ (ఉదాహరణకు: అంధత్వం, మూగ, చెవుడు, కాళ్ల వైకల్యం) పై స్పష్టత లేకపోతే, ముందస్తుగా ప్రభుత్వ డాక్టర్ ఇచ్చిన ధ్రువీకరణ పత్రం ఉండాలి. పరీక్షా కేంద్రానికి వచ్చిన తర్వాత సదరం పోర్టల్‌లో ఆన్‌లైన్ హాజరు నమోదు చేయించుకోవాలి. హాజరు నమోదైతేనే సదరం ఐడీ (SADAREM ID) యాక్టివేట్ అవుతుంది.

ఏపీ సేవా పోర్టల్ ద్వారా బుకింగ్

మీ మొబైల్‌లోనే స్లాట్ల లభ్యతను తెలుసుకునేందుకు 'మన మిత్ర' వాట్సాప్ సేవలను కూడా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. సదరం సర్టిఫికేట్ మంజూరైన తర్వాత ఆన్‌లైన్ నుండి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

సదరం సర్టిఫికేట్ల పేరుతో దళారులు ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే నమ్మవద్దని, అధికారులకు ఫిర్యాదు చేయాలని మంత్రి దివ్యాంగులను కోరారు. ఈ సరికొత్త విధానంపై క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని ఆయన అధికారులను ఆదేశించారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks