యువ న్యాయవాదికి కస్టడీ ఘటన - ఏపీ హైకోర్టు జడ్జిపై సుప్రీంకోర్టులో పిటిషన్..! ఈనెల 15న విచారణ

Young advocate custody Incident in AP : ఏపీ హైకోర్టులో యువ న్యాయవాదిని జ్యుడీషియల్ కస్టడీకి పంపిన ఘటనపై సుప్రీంకోర్టు స్పందించింది. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ తీర్మానాన్ని పిల్ (PIL)గా స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం…. మే 15న విచారణ చేపట్టనుంది.

Published on: May 09, 2026 9:09 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Young advocate custody Incident : ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చోటుచేసుకున్న ఒక అనూహ్య ఘటన ఇప్పుడు దేశవ్యాప్త చర్చకు దారితీసింది. కోర్టు కార్యకలాపాల్లో చిన్నపాటి లోపం దొర్లిందనే కారణంతో ఒక యువ న్యాయవాదిని 24 గంటల పాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (SCBA) వ్యక్తం చేసిన ఆందోళనను పరిగణనలోకి తీసుకున్న అత్యున్నత న్యాయస్థానం…… దీనిని ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL)గా నమోదు చేసింది. సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లోని సమాచారం ప్రకారం, ఈ కేసు మే 15వ తేదీన విచారణకు వచ్చే అవకాశం ఉంది.

ఏపీ హైకోర్టు జడ్జి తీరుపై సుప్రీంకోర్టులో పిల్ దాఖలు
ఏపీ హైకోర్టు జడ్జి తీరుపై సుప్రీంకోర్టులో పిల్ దాఖలు

అసలేం జరిగింది?

మే 5వ తేదీన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జస్టిస్ తర్లాడ రాజశేఖర్ రావు ధర్మాసనం ముందు ఒక కేసు విచారణకు వచ్చింది. ఆ సమయంలో ఒక యువ న్యాయవాది ఒక నిర్దిష్ట ఉత్తర్వు కాపీని సమర్పించలేకపోయారు. ఈ చిన్న సాంకేతిక లోపానికి ఆగ్రహించిన న్యాయమూర్తి…. ఆ న్యాయవాదిని 24 గంటల పాటు కస్టడీలోకి తీసుకోవాలని ఆదేశించారు. ఈ పరిణామం న్యాయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.

ఖండించిన బార్ అసోసియేషన్

ఈ ఘటనపై సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మే 6వ తేదీన ఎస్సీబీఏ (SCBA) అధ్యక్షుడు వికాస్ సింగ్ ఆధ్వర్యంలో ఒక తీర్మానాన్ని ఆమోదించారు. "న్యాయ వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని కాపాడటంతో పాటు, బెంచ్ మరియు బార్ మధ్య సామరస్యపూర్వక సంబంధాలను కొనసాగించడానికి తక్షణమే జోక్యం చేసుకోవాలి" అని భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్య కాంత్‌ను అసోసియేషన్ కోరింది.

"న్యాయమూర్తుల శక్తి సామర్థ్యాలు భయం పుట్టించడంలో కాదు, ఓర్పు ప్రదర్శించడంలోనే కనిపిస్తాయి. ముఖ్యంగా వృత్తిని ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్న యువ న్యాయవాదుల పట్ల సహనం వహించాలి," అని అసోసియేషన్ తన తీర్మానంలో పేర్కొంది. యువ న్యాయవాదులను భయపెట్టడం లేదా అవమానించడం వల్ల న్యాయవాద వృత్తి స్వేచ్ఛ దెబ్బతింటుందని….. ఇది మొత్తం న్యాయ వితరణ వ్యవస్థకే ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేసింది.

బీసీఐ జోక్యం….

న్యాయవాదుల చట్టబద్ధమైన సంస్థ అయిన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా ఈ వ్యవహారంలో సీజేఐ జోక్యాన్ని కోరింది. ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్న వీడియోను ప్రస్తావిస్తూ బీసీఐ ఛైర్మన్ మనన్ కుమార్ మిశ్రా లేఖ రాశారు. "సదరు న్యాయవాది తన శారీరక ఇబ్బందులను వివరిస్తూ… పదేపదే క్షమించమని వేడుకున్నా న్యాయమూర్తి కనికరించలేదు" అని ఆయన లేఖలో వివరించారు.

కోర్టు హాల్ లో న్యాయవాది అనుభవాన్ని ఎగతాళి చేస్తూ…. రిజిస్ట్రార్ మరియు పోలీసులను పిలిపించి కస్టడీకి పంపడం అసంబద్ధమని బీసీఐ పేర్కొంది. న్యాయాధికారాలను చలాయించేటప్పుడు సంయమనం, మానవత్వం మరియు నిష్పాక్షికత ఉండాలని బీసీఐ గుర్తు చేసింది.

మే 15న కీలక విచారణ

అడ్వకేట్లు కోర్టులో అధికారులని…. వారి గౌరవానికి భంగం కలగకూడదని న్యాయ వర్గాలు వాదిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ అంశాన్ని పిల్ (PIL)గా స్వీకరించడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. జస్టిస్ తర్లాడ రాజశేఖర్ రావు తీసుకున్న చర్యల రికార్డులను పరిశీలించి…. తగిన పరిపాలనాపరమైన చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు కోరుతున్నారు. మే 15న జరిగే విచారణలో సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More