ఆగస్టు 17 తర్వాత భోగాపురం ఎయిర్‌పోర్ట్ నుంచే షెడ్యూల్ విమానాలు.. విశాఖలో క్లోజ్!
Bhogapuram Airport : విజయనగరంలోని భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఆగస్టు 17వ తేదీ నుంచి షెడ్యూల్ విమానాల రాకపోకలను సాగించనుంది. విశాఖపట్నం విమానాశ్రయంలో ఈ సేవలు నిలిపివేయనున్నట్టుగా పౌరవిమానయాన శాఖ ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర ప్రాంత ప్రయాణికులకు విమానయాన రవాణాలో ఒక కొత్త శకం ప్రారంభం కాబోతోంది. విజయనగరం జిల్లా భోగాపురంలో అత్యంత వేగంగా రూపుదిద్దుకున్న నూతన విమానాశ్రయం త్వరలోనే ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. ఆగస్టు 17వ తేదీ అర్ధరాత్రి నుంచి ఈ కొత్త ఎయిర్‌పోర్ట్ ద్వారా షెడ్యూల్ విమాన సర్వీసులు షురూ కానున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర పౌర విమానయాన శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంటూ గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

జీఎమ్‌ఆర్ సంస్థ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ పద్ధతిలో అత్యాధునిక వసతులతో ఈ ఎయిర్‌పోర్ట్‌ను నిర్మించింది. ఈ విమానాశ్రయానికి మన్యం వీరుడు "అల్లూరి సీతారామరాజు" పేరును ఖరారు చేస్తూ కేంద్రం గెజిట్ ప్రకటించింది. గతేడాది 2024 సెప్టెంబర్ 18న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని రాష్ట్ర మంత్రివర్గం భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి పేరు పెట్టాలని నిర్ణయించింది. తాజాగా ఆ ప్రతిపాదనకు కేంద్ర పౌర విమానయాన శాఖ ఆమోదముద్ర వేసింది.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించనున్న తరుణంలో, ప్రస్తుతం సేవలు అందిస్తున్న విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్ (ఐఎన్‌ఎస్ డేగా - సివిల్ ఎన్‌క్లేవ్) నుంచి సాధారణ షెడ్యూల్డ్ కమర్షియల్ విమానాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. ఒప్పందం ప్రకారం రాబోయే 30 సంవత్సరాల పాటు విశాఖ విమానాశ్రయం నుంచి ఎటువంటి షెడ్యూల్డ్ వాణిజ్య విమానాలు నడపబడవు.
అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితులకు, విమానాలకు విశాఖ ఎయిర్‌పోర్ట్ వేదికగా నిలవనుంది. ఇప్పటివరకు విశాఖపట్నం విమానాశ్రయానికి చెందిన ఐఏటీఏ కోడ్ VTZను ఆగస్టు 17 అర్ధరాత్రి నుంచి కొత్తగా ప్రారంభమయ్యే అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి బదిలీ చేస్తారు.
జాతీయ అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు విశాఖ విమానాశ్రయాన్ని ఉపయోగించుకోవడానికి మినహాయింపు ఉంటుంది. భారత వైమానిక దళం, రక్షణ దళాలు, పోలీసు విమానాలు, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వ అతిథుల విమానాలు, వీఐపీ, లీజ్డ్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు విశాఖ నుంచే కార్యకలాపాలు సాగిస్తాయి.
నాన్-షెడ్యూల్డ్ ప్రాతిపదికన నడిచే వాణిజ్య, చార్టర్డ్ విమానాల సేవలు విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో యథావిధిగా కొనసాగుతాయి. విశాఖ ప్రాంత ప్రయాణికులు ఆగస్టు 17 నుంచి తమ విమాన ప్రయాణాలను భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచే ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. విశాఖ, విజయనగరం పరిసర ప్రాంతాల ఆర్థిక, పర్యాటక రంగానికి ఈ కొత్త ఎయిర్‌పోర్ట్ మరింత ఊపునిస్తుందని భావిస్తున్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


