బిక్కవోలు-దువ్వాడ మధ్య కొత్త రైల్వే లైన్లకు టెండర్లు.. తుని, అనకాపల్లిలకు బైపాస్ స్టేషన్లు!

ఆంధ్రప్రదేశ్‌లోని బిక్కవోలు, దువ్వాడ మధ్య 151.08 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ల నిర్మాణం కోసం సౌత్ కోస్ట్ రైల్వే టెండర్లను ఆహ్వానిస్తోంది. 45 నెలల్లో వీటని పూర్తి చేసేలా ప్రణాళికలు వేస్తున్నారు.

Updated on: Nov 25, 2026, 20:44:30 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్ రైల్వే మౌలిక సదుపాయాల కల్పనలో మరో భారీ ముందడుగు పడింది. అత్యంత రద్దీగా ఉండే చెన్నై–హౌరా ప్రధాన రైల్వే మార్గంలో ప్రయాణికుల, సరుకు రవాణా రైళ్ల రాకపోకలకు ఆటంకం కలగకుండా దక్షిణ కోస్తా రైల్వే (SCoR) కీలక నిర్ణయం తీసుకుంది. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు నుంచి విశాఖపట్నం సమీపంలోని దువ్వాడ వరకు 151.08 కిలోమీటర్ల మేర 3వ, 4వ బ్రాడ్‌గేజ్ రైల్వే లైన్ల నిర్మాణానికి రూ. 4,299.12 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లను ఆహ్వానించింది.

బిక్కవోలు-దువ్వాడ మధ్య కొత్త రైల్వే లైన్(ప్రతీకాత్మక చిత్రం) (Unsplash)
బిక్కవోలు-దువ్వాడ మధ్య కొత్త రైల్వే లైన్(ప్రతీకాత్మక చిత్రం) (Unsplash)

కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఏప్రిల్ 2026లో ఆమోదించిన నిడదవోలు–దువ్వాడ రైల్వే క్వాడ్రప్లింగ్ కారిడార్ ప్రాజెక్టులో భాగంగా ఈ పనులను చేపట్టనున్నారు. ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్ అండ్ కన్‌స్ట్రక్షన్ (EPC) విధానంలో చేపట్టే ఈ ప్రాజెక్టు విజయవాడ, విశాఖపట్నం రైల్వే డివిజన్ల పరిధిలో విస్తరించి ఉంది. కేవలం రైలు పట్టాల నిర్మాణమే కాకుండా, అత్యంత ఆధునిక భద్రతా వ్యవస్థలను ఇందులో భాగం చేశారు.

ప్రస్తుతం ఉన్న మార్గంలో తుని, అనకాపల్లి రైల్వే స్టేషన్ల వద్ద రద్దీ ఏర్పడుతోంది. దీనిని అధిగమించేందుకు రైల్వే శాఖ వినూత్నంగా బైపాస్ అలైన్‌మెంట్‌లను డిజైన్ చేసింది. అన్నవరం యార్డు దాటిన తర్వాత 3, 4వ లైన్లు ప్రస్తుత మార్గం నుంచి విడిపోయి తిమ్మాపురం, హంసవరం, తుని స్టేషన్లను బైపాస్ చేస్తూ వెళ్తాయి. ఈ కొత్త మార్గంలో 'న్యూ తుని శాటిలైట్ స్టేషన్' నిర్మించనున్నారు. అనంతరం గుల్లిపాడు స్టేషన్‌కు సుమారు 3 కిలోమీటర్ల ముందు ఈ లైన్లు తిరిగి ప్రధాన కారిడార్‌తో కలుస్తాయి.

ఎలమంచిలి స్టేషన్ దాటిన 8 కిలోమీటర్ల తర్వాత కొత్త లైన్లు మళ్లి.. నర్సింగపల్లి, బయ్యవరం, కాశింకోట, అనకాపల్లి స్టేషన్లను బైపాస్ చేస్తాయి. ఇక్కడ న్యూ అనకాపల్లి శాటిలైట్ స్టేషన్‌ను నిర్మిస్తారు. తాడి స్టేషన్‌కు 1 కిలోమీటరు ముందు ఇవి తిరిగి పాత మార్గంతో అనుసంధానమై దువ్వాడ వరకు సమాంతరంగా కొనసాగుతాయి.

కొత్తగా నిర్మించబోయే అనకాపల్లి శాటిలైట్ స్టేషన్‌లో రైలు బోగీల నిర్వహణ కోసం ప్రత్యేకంగా రెండు పిట్ లైన్లు, రెండు స్టేబ్లింగ్ లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల విశాఖపట్నం రైల్వే జంక్షన్‌పై ఉన్న నిర్వహణ ఒత్తిడి భారీగా తగ్గుతుంది. అంతేకాకుండా ఈ కొత్త లైన్లకు నిర్మాణంలో ఉన్న అనకాపల్లి–కొత్తవలస నూతన బ్రాడ్‌గేజ్ మార్గంతో అనుసంధానం కల్పిస్తారు.

ప్రస్తుతం నిడదవోలు–దువ్వాడ మార్గం తన పూర్తి సామర్థ్యానికి మించి దాదాపు 130 శాతం రద్దీతో నడుస్తోంది. దీనివల్ల ప్రయాణికుల రైళ్లు ఆలస్యం కావడం, సరుకు రవాణాకు ఆటంకాలు కలగడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ నాలుగు లైన్ల కారిడార్ అందుబాటులోకి వస్తే ఏటా అదనంగా 29.04 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేసే వీలు కలుగుతుంది.

బొగ్గు, ఉక్కు, సిమెంట్, ఎరువులు, కంటైనర్ల రవాణా మరింత వేగవంతం కానుంది. విశాఖపట్నం, గంగవరం, కాకినాడ పోర్టుల నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు సరుకు రవాణా సులభతరం అవుతుంది. గూడ్స్ రైళ్లు, ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ప్రత్యేక లైన్లు అందుబాటులోకి రావడంతో రైళ్ల సగటు వేగం పెరిగి, ప్రయాణ సమయం గణనీయంగా ఆదా అవుతుంది.

ఈ భారీ ప్రాజెక్టు నిర్మాణంలో గరిష్టంగా నలుగురు సభ్యులతో కూడిన జాయింట్ వెంచర్లు, కన్సార్టియంలు పాల్గొనేందుకు రైల్వే శాఖ వెసులుబాటు కల్పించింది. టెండర్లలో పాల్గొనే సంస్థలు రూ. 85.98 కోట్లు ధరావతు సొమ్ము (EMD) చెల్లించాల్సి ఉంటుంది. ప్రీ-బిడ్ సమావేశం డిసెంబర్ 23, 2026న జరుగుతుంది. బిడ్డింగ్ ప్రారంభ తేదీ ఫిబ్రవరి 1, 2027, బిడ్ల దాఖలుకు చివరి తేదీ ఫిబ్రవరి 15, 2027గా నిర్ణయించారు. నిర్మాణ గడువు 45 నెలలుగా టార్గెట్ పెట్టారు.

ABOUT THE AUTHOR

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.