ఆంధ్రప్రదేశ్‌లోని డిగ్రీ కాలేజీల్లో 2026-27 విద్యాసంవత్సరానికి గాను ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. ఉన్నత విద్య కమిషనరేట్ మొదటి విడత అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేసి… ప్రస్తుతం ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం రెండో విడత (ఫేజ్-2) కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేసింది.
రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం

రెండో విడత కౌన్సెలింగ్‌కు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్‌ను సెప్టెంబర్ 18న ఉన్నత విద్యాశాఖ జారీ చేసింది. నోటిఫికేషన్ వెలువడిన రోజు నుంచే అంటే సెప్టెంబర్ 18 నుంచే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత ఉన్న విద్యార్థులు సెప్టెంబర్ 21 వరకు ఆన్‌లైన్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవడానికి గడువు ఇచ్చారు.
అభ్యర్థుల ధృువపత్రాల పరిశీలన కోసం హెల్ప్ లైన్ సెంటర్లు (HLCs) సెప్టెంబర్ 20 నుంచి అందుబాటులోకి వచ్చాయి. ఈ ప్రాసెస్ సెప్టెంబర్ 24 వరకు కొనసాగుతుంది. రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న అభ్యర్థులు తమకు ఇష్టమైన కళాశాలలు, కోర్సులను ఎంచుకునేందుకు (వెబ్ ఆప్షన్లు నమోదు) సెప్టెంబర్ 21 నుంచి సెప్టెంబర్ 23 వరకు అవకాశం కల్పించారు. ఒకవేళ ఎంచుకున్న వెబ్ ఆప్షన్లలో మార్పులు లేదా చేర్పులు చేసుకోవాలనుకుంటే సెప్టెంబర్ 24న ఎడిట్ చేసుకోవచ్చు.
సీట్ల కేటాయింపు, కాలేజీల్లో రిపోర్టింగ్
వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ముగిసిన అనంతరం, అభ్యర్థుల మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా సెప్టెంబర్ 27న సీట్ల కేటాయింపు (అలాట్‌మెంట్) ఫలితాలను వెల్లడిస్తారు. సీటు పొందిన విద్యార్థులు సెప్టెంబర్ 28 నుంచి సెప్టెంబర్ 30 తేదీల మధ్య తమకు కేటాయించిన కళాశాలల్లో నేరుగా హాజరై, సర్టిఫికెట్లతో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు…
- విద్యార్థుల రిజిస్ట్రేషన్: సెప్టెంబర్ 21, 2026 వరకు అవకాశం ఉంటుంది.
- హెచ్‌ఎల్‌సీ ద్వారా ప్రమాణపత్రాల పరిశీలన: సెప్టెంబర్ 20 నుండి సెప్టెంబర్ 24, 2026
- వెబ్ ఆప్షన్ల నమోదు: సెప్టెంబర్ 21 నుండి సెప్టెంబర్ 23, 2026
- వెబ్ ఆప్షన్ల మార్పుకు అవకాశం: సెప్టెంబర్ 24, 2026
- సీట్ల కేటాయింపు (అలాట్‌మెంట్): సెప్టెంబర్ 27, 2026
- కళాశాలల్లో రిపోర్టింగ్: సెప్టెంబర్ 28 నుండి సెప్టెంబర్ 30, 2026
- అధికారిక వెబ్ సైట్ - https://cap.apcfss.in/