AP Fire Services : ఏపీ ఫైర్ సర్వీసెస్‌లో 147 డ్రైవర్ ఆపరేటర్ పోస్టులు - నోటిఫికేషన్ జారీ, ఈసారి కొత్త రూల్స్
AP Fire Services Driver Operator Notification : ఆంధ్రప్రదేశ్ విపత్తులు, అగ్నిమాపక శాఖలో 147 డ్రైవర్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి ఏపీ పోలీస్ నియామక మండలి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈసారి ఎంపిక ప్రక్రియలో కొన్ని కీలక మార్పులు చేసి దేహదారుఢ్య (పీఈటీ), రాత పరీక్షలను తప్పనిసరి చేశారు.
AP Fire Department Driver Operator Posts : ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక శాఖలో 147 డ్రైవర్ ఆపరేటర్ పోస్టుల భర్తీ కోసం పోలీసు నియామక మండలి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించనున్నారు. దరఖాస్తుల ప్రక్రియ, ప్రాథమిక రాత పరీక్ష తేదీలు , ఇతర ముఖ్యమైన వివరాలతో కూడిన పూర్తి షెడ్యూల్‌ను త్వరలోనే వెల్లడించనున్నారు.

గతంలో కూటమి హయాంలో 2018 నవంబరులో ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రాగా…. 8 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ ఇప్పుడు పోస్టుల భర్తీకి రిక్రూట్ మెంట్ బోర్డు చర్యలు చేపట్టింది. అయితే… ఈసారి ఎంపిక ప్రక్రియలో కొన్ని కీలక మార్పులు చేసి దేహదారుఢ్య (పీఈటీ), రాత పరీక్షలను తప్పనిసరి చేశారు.
ఎంపిక విధానంలో కీలక మార్పులు…
గతంలో ఈ పోస్టులకు కేవలం శారీరక కొలతల పరీక్షలు (PMT) నిర్వహించి, డ్రైవింగ్ టెస్ట్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేసేవారు. కానీ ఈసారి నియామక నిబంధనల్లో మార్పులు చేశారు. కొత్త విధానం ప్రకారం ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో సాగుతుంది.
1. శారీరక కొలతల పరీక్ష - దేహదారుఢ్య పరీక్ష : ముందుగా ఎత్తు, ఛాతీ కొలతలను డిజిటల్ విధానంలో కొలుస్తారు. ఇందులో అర్హత సాధించిన వారికి 1600 మీటర్ల (1 మైలు) పరుగు పందెం ఉంటుంది. అభ్యర్థులు ఈ పరుగును 10 నిమిషాలు లేదా అంతకంటే తక్కువ సమయంలో పూర్తి చేయాలి. ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే.
2. డ్రైవింగ్ టెస్ట్ : పరుగు పందెంలో అర్హత సాధించిన అభ్యర్థులకు నిపుణుల కమిటీ సమక్షంలో 100 మార్కులకు డ్రైవింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. వాహనం స్టార్ట్ చేయడం, గేర్లు మార్చడం, రోడ్డు నిబంధనలు, బ్రేకుల వినియోగం, రివర్సింగ్, మైగ్రేషన్ లోపాలు సరిచేయడం వంటి 8 అంశాలపై పరిశీలిస్తారు. ఇందులో కనీసం 50 మార్కులు సాధించి క్వాలిఫై కావాల్సి ఉంటుంది.
3. రాత పరీక్ష: మొదటి రెండు దశల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు 100 మార్కులకు ఆబ్జెక్టివ్ తరహా రాత పరీక్ష నిర్వహిస్తారు. మోటార్ వాహన మెకానిజం, ట్రాఫిక్ రూల్స్, రోడ్డు భద్రత వంటి అంశాలపై 3 గంటల వ్యవధిలో ఈ పరీక్ష ఉంటుంది. ఈ రాత పరీక్షలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగానే అభ్యర్థుల తుది ఎంపికను చేపడతారు.
జూలై 1 నాటికి ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యార్హత సాధించి ఉండాలి.నోటిఫికేషన్ తేదీ నాటికి కనీసం 2 సంవత్సరాల చెల్లుబాటు వ్యవధి ఉన్న హెవీ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఈడబ్ల్యూఎస్, బీసీ , ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితిలో 5 సంవత్సరాల సడలింపు ఉంటుంది. మాజీ సైనికోద్యోగులకు ఆర్మీ సర్వీస్ ఆధారంగా మినహాయింపు లభిస్తుంది.
ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ.300 గాను, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.150 గాను నిర్ణయించారు. పూర్తి వివరాలు, జిల్లాల వారీగా ఉన్న ఖాళీల జాబితా కోసం అభ్యర్థులు slprb.ap.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

