...
...
Next Story

కరెన్సీ నోట్ల తరహా భద్రత, అధికారిక 'రాజముద్ర'తో పాస్ పుస్తకాలు : చంద్రబాబు

కరెన్సీ నోట్ల తరహా భద్రతతో 'రాజముద్ర'తో పాస్ పుస్తకాలు జారీ చేయనున్నట్టుగా సీఎం చంద్రబాబు అన్నారు. రైతులకు మేలు చేసేలా రెవెన్యూ వ్యవస్థను వివాద రహితంగా తీర్చిదిద్దుతున్నట్లుగా చెప్పారు.

Published on: Jun 8, 2026, 17:38:59 IST
Advertisement

పశ్చిమగోదావరి జిల్లా సిద్ధాంతంలో జరిగిన ‘మీ భూమి- మీ హక్కు’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. "భూమి రైతులదైతే... గత పాలకులు పొలం సరిహద్దు రాళ్లు, పాస్ పుస్తకాలపై తమ సొంత బొమ్మలు ముద్రించుకున్నారు. భూతం తరహాలో రైతుల వెంటపడి, ప్రజల సొమ్ము రూ.800 కోట్లు పెట్టి గెలాక్సీ గ్రానైట్‌ రాళ్లపై బొమ్మలు వేసుకున్న దుర్మార్గుల పాలన అది.' అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు

బ్రిటిషర్ల కాలం నాటి పటిష్టమైన రెవెన్యూ రికార్డులను గత పాలకులు ల్యాండ్ టైటిలింగ్ యాక్టు పేరిట ఒక నల్ల చట్టాన్ని తెచ్చి తారుమారు చేశారని, భూములు కాజేసేందుకు ప్రయత్నించారని చంద్రబాబు మండిపడ్డారు. తాము అధికారంలోకి రాగానే ఆ నల్ల చట్టాన్ని రద్దు చేసి భూ యాజమాన్య హక్కులను రక్షించామని స్పష్టం చేశారు. ఒక వ్యక్తి చేసిన దుర్మార్గాన్ని ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వానికి మూడేళ్ల సమయం పట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు.

క్యూఆర్ కోడ్, బ్లాక్ చెయిన్ టెక్నాలజీ వంటి అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సరికొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను జారీ చేస్తున్నామని సీఎం ప్రకటించారు. కరెన్సీ నోట్లకు ఉండే అన్ని రకాల భద్రతా ఫీచర్లతో, అధికారిక 'రాజముద్ర'తో వీటిని ముద్రిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 6,688 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేసి, 26.46 లక్షల మందికి పుస్తకాలు అందజేశామని.. మిగిలిన 62.32 లక్షల మందికి కూడా నిర్దేశిత గడువులోగా పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు.

రైతులకు మేలు చేసేలా రెవెన్యూ వ్యవస్థను వివాద రహితంగా తీర్చిదిద్దుతున్నట్లు సీఎం వివరించారు. ఇప్పటికే 1836 గ్రామాల్లో తుది రికార్డ్ ఆఫ్ రైట్స్ పూర్తి చేశామన్నారు. అమ్మకం, బహుమతి, విభజన వంటి 9 లక్షల లావాదేవీలకు 100 శాతం ఆటో మ్యుటేషన్ తెచ్చామని, వాట్సాప్ ద్వారా ట్రాకింగ్ సదుపాయం కల్పించామన్నారు.

ఉమ్మడి గోదావరి జిల్లాలు దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణలని సీఎం చంద్రబాబు కొనియాడారు. గత ప్రభుత్వంలో ధాన్యం అమ్ముకోవడానికి రైతులు ఇబ్బంది పడేవారని, ఆరు నెలలైనా డబ్బులు వచ్చేవి కావని.. కానీ నేడు కూటమి ప్రభుత్వంలో 24 గంటల్లోనే ధాన్యం డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని తెలిపారు. అన్నదాత సుఖీభవ కింద కేంద్రంతో కలిపి ఏడాదికి రూ.20 వేలు ఇస్తూ, ఇప్పటికే 46 లక్షల మంది రైతులకు రూ.8,985 కోట్లు జమ చేశామన్నారు.

పశ్చిమాసియా యుద్ధం వల్ల ఆక్వా రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని, దాణా రేట్లు పెరగడంతో సోయాబీన్ మీల్ దిగుమతులపై సుంకాలు తగ్గించాలని కేంద్రాన్ని కోరామని, త్వరలోనే నిర్ణయం వస్తుందని చంద్రబాబు తెలిపారు. ఆక్వా జోన్ పరిధిలోని చెరువులకు రూ.1.50 కే యూనిట్ విద్యుత్ అందిస్తున్నట్లు ప్రకటించారు. వ్యర్థాల నుంచి న్యూట్రాసిటికల్ ఔషధాలు తయారు చేసేలా పరిశ్రమలను ప్రోత్సహిస్తామన్నారు.

ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విజయవంతంగా రెండేళ్ల పాలన పూర్తి చేసుకుందని, అభివృద్ధి-సంక్షేమం-సుపరిపాలనే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని సీఎం చెప్పారు. గత ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల అప్పులు మిగిల్చిందని దుయ్యబట్టారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe