Monsoon Holiday : గోదావరి తీరంలో ఇసుక తవ్వకాలపై నిషేధం.. మన్‌సూన్ హాలిడే అమలు!

వర్షాకాలం ప్రారంభం అవుతున్న కారణంగా నదుల్లో ఇసుక తవ్వకాలపై నిషేధం అమల్లోకి వచ్చింది. అక్టోబర్ 15వ తేదీ వరకు ఈ నిషేధం అమలులో ఉంటుంది.

Published on: Jun 1, 2026, 12:27:41 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో వర్షాకాలం దృష్ట్యా జూన్ 1 నుంచి అక్టోబరు 15 వరకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనల మేరకు ఇసుక తవ్వకాలపై నిషేధం అమలు జరుగుతోంది. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం.. గోదావరి తీరంలో ఏటా విధించే ‘మన్‌సూన్ హాలిడే’ (వర్షాకాల విరామం) నేటి నుంచి (జూన్ 1) అమలులోకి వచ్చింది. నదుల పర్యావరణ సమతుల్యతను కాపాడటానికి, వర్షాకాలంలో వరదల ముప్పును దృష్టిలో ఉంచుకుని ఈ వార్షిక నిషేధాన్ని విధిస్తారు.

ఇసుక తవ్వకాలపై నిషేధం
ఇసుక తవ్వకాలపై నిషేధం

మైన్స్ అండ్ జియాలజీ డిప్యూటీ డైరెక్టర్ డి. ఫణిభూషణ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నిషేధాజ్ఞలు సుదీర్ఘ కాలం పాటు కొనసాగనున్నాయి. జూన్ 1 నుంచి ప్రారంభమై.. అక్టోబర్ 15 వరకు అమల్లో ఉంటుంది. గోదావరి తీరంలోని సెమీ-మెకనైజ్డ్ రీచ్‌లు (యంత్రాల ద్వారా ఇసుక తీసే ప్రాంతాలు), పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలు, సేకరణను పూర్తిగా బ్యాన్ చేశారు.

వర్షాకాలంలో నదుల్లో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటం, వరదలు వచ్చే అవకాశం ఉండటంతో ఇసుక తవ్వకాలు జరపడం ప్రమాదకరం. అలాగే ఈ సమయంలో నదీ జీవజాలం, పర్యావరణ పునరుజ్జీవనానికి ఈ విరామం ఎంతో అవసరం.

నిషేధ కాలంలో భవన నిర్మాణ పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా, ఇసుక కొరత రాకుండా ప్రభుత్వ యంత్రాంగం ముందుస్తు చర్యలు చేపట్టింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని 43 ఇసుక రీచ్‌లలో కలిపి సుమారు 14.57 లక్షల మెట్రిక్ టన్నుల గోదావరి ఇసుకను ముందే సేకరించి స్టాక్ పాయింట్లలో భద్రపరిచారు.

ప్రధాన రీచ్‌లు ఇవే

కొవ్వూరు, పేరవలి, నిడదవోలు, సీతానగరం, రాజమహేంద్రవరం, తాళ్లపూడి తదితర ప్రాంతాల్లోని స్టాక్ యార్డుల ద్వారా వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఇసుకను సరఫరా చేయనున్నారు.

నదిలో తవ్వకాలు నిలిచిపోయిన నేపథ్యంలో.. కొందరు అక్రమార్కులు రాత్రి సమయాల్లో ఇసుకను తరలించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అందుకే అక్రమ ఇసుక రవాణా, తవ్వకాలను అడ్డుకోవడానికి ప్రభుత్వం ప్రత్యేక నిఘా బృందాలను రంగంలోకి దించింది. మైన్స్ అండ్ జియాలజీ (గనులు), రెవెన్యూ, జలవనరుల శాఖ, పోలీస్ మరియు రవాణా శాఖలు సంయుక్తంగా గోదావరి తీరప్రాంతాల్లో గస్తీ కాయనున్నాయి. నిబంధనలు ఉల్లంఘించి ఇసుకను అక్రమంగా తరలిస్తే వాహనాలను సీజ్ చేయడంతో పాటు, భారీ జరిమానాలు, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More