6 నెలల్లో మార్పు కనిపించేలా గోదావరి కాలుష్య నివారణకు టాస్క్ ఫోర్స్.. రూ.100 కోట్ల బడ్జెట్
జీవ నదులను మన చేతులారా చంపేస్తున్నామని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. నదులను మృత నదులుగా మారిస్తే భవిష్యత్తు ఉండదని హెచ్చరించారు. గోదావరి కాలుష్య నివారణకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్టుగా తెలిపారు.
రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయంలో గోదావరి నది కాలుష్యం, పుష్కరాల సన్నద్ధతపై పీసీబీ, అటవీ-పర్యావరణ శాఖ, పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు, జిల్లా అధికారులతో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిoచారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ పాల్గొన్నారు.

‘మన దాహం తీర్చి, మనకు జీవితాన్ని ఇచ్చే పవిత్రమైన జీవ నదులను మనమే చేతులారా చంపేస్తూ, వాటిని మృత నదులుగా మారుస్తున్నాం’ అని ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ, అటవీ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. నదుల పట్ల మనకున్న నిర్లక్ష్యం ఇలాగే కొనసాగితే భవిష్యత్తు తరాలకు తాగు నీరు దొరకడమే చాలా కష్టమవుతుందని హెచ్చరించారు. భగవంతుడు ప్రసాదించిన నీటిని ఇష్టారాజ్యంగా కలుషితం చేస్తూ, మళ్లీ అదే తాగునీటి కోసం జలజీవన్ మిషన్ అంటూ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే విచిత్ర పరిస్థితికి స్వస్తి చెప్పాలన్నారు.
గోదావరి పరివాహక ప్రాంతాల్లోని కాలుష్యాన్ని నివారించడానికి ప్రత్యేకంగా అంతర్ జిల్లా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని అధికారులను పవన్ ఆదేశించారు. క్షేత్రస్థాయి సమస్యలను గుర్తించి, వాటికి శాశ్వత పరిష్కారాలను సూచించే విధంగా ఈ టాస్క్ ఫోర్స్ పని చేయాలని సూచించారు. టాస్క్ ఫోర్స్ ఇచ్చే నివేదికలు, సూచనలు క్షేత్ర స్థాయిలో వేగంగా అమలు జరిగేలా పర్యవేక్షణ కమిటీ ఉండాలని స్పష్టం చేశారు. నదుల రక్షణకు ఇవాళ్టి నుంచే యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని, వచ్చే ఆరు నెలల్లో నదుల్లో స్పష్టమైన మార్పు కనిపించాలని ఆదేశించారు.
నది తీవ్రంగా కలుషితమవుతున్న ప్రధాన కేంద్రాలను గుర్తించి, అక్కడ తక్షణమే ‘పొల్యూషన్ ఆడిట్’ నిర్వహించాలని పవన్ కళ్యాణ్ అన్నారు. నదిలోకి మురుగు నీరు, రసాయనాలు చేరుతున్న కీలక ప్రాంతాల నుంచి నీటి నమూనాలను సేకరించి ల్యాబొరేటరీ పరీక్షలకు పంపాలన్నారు. నదీ తీరాలను, మన జీవ నదులను కాపాడుకోకపోతే భవిష్యత్తు తరాలకు మనుగడే ఉండదని హెచ్చరించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మిషన్ ఫర్ క్లీన్ గోదావరి’ వంటి పథకాలు కేవలం ఆర్బాటాలకే పరిమితమయ్యాయి అనిపిస్తోందని, క్షేత్రస్థాయిలో సరైన విధానం లేకపోవడం వల్లే ఆశించిన ప్రయోజనం దక్కడం లేదన్నారు.
'భక్తులు ఎంతో పవిత్ర భావంతో పుష్కర స్నానానికి వస్తారు. ఘాట్లకు వచ్చి వెళ్లాక.. మేము మురికి నీళ్లలో స్నానం చేసి వెళ్లాం అనే మాట ఎవరి నోటి వెంబడైనా వస్తే అది మన ప్రభుత్వానికే అవమానం. అందుకే మిషన్ ఫర్ క్లీన్ గోదావరి కేవలం బోర్డులకే పరిమితం కాకూడదు. గోదావరి నదుల్లోకి మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలు కలవకుండా పటిష్టమైన దీర్ఘకాలిక ప్రణాళికలు అమలు చేయాలి.' అని పవన్ కళ్యాణ్ అన్నారు.
గోదావరి పుష్కరాలు అంటే కేవలం రాజమండ్రే అనే భావన నుంచి బయటకు వచ్చి... గోదావరి ప్రవహిస్తున్న ఆరు జిల్లాలకు సంబంధించిన అన్ని పంచాయతీలను భాగస్వాములు చేయాలన్నారు డిప్యూటీ సీఎం. గత పుష్కరాలకు 4.6 కోట్ల మంది భక్తులు వస్తే, ఈసారి ఆ రద్దీ రెట్టింపై దాదాపు 10 కోట్ల మంది వస్తారని అంచనా ఉందన్నారు. రాజమండ్రిలోనే కాకుండా గోదావరి ప్రవహించే ఆరు జిల్లాలలో ఏడాదిపాటు ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలన్నారు పవన్ కళ్యాణ్. పుష్కరాల నాటికి నదీ తీరాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అన్నదే కనిపించకూడదన్నారు.
గోదావరి ప్రవహించే ఆరు జిల్లాల పరిధిలో కాలుష్య నియంత్రణ చర్యల కోసం పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ద్వారా రూ.100 కోట్ల ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయిస్తున్నామని డిప్యూటీ సీఎం వెల్లడించారు. కాలుష్యాన్ని అరికట్టడానికి పీసీబీ ఆధ్వర్యంలో ఒక పటిష్టమైన అంతర్ శాఖల (జిల్లా) టాస్క్ ఫోర్స్ ఏర్పాటు కానుందన్నారు. ఈ ఆరు జిల్లాలకు సంబంధించిన అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు ఇందులో భాగస్వాములుగా ఉంటూ కలిసి పనిచేస్తారన్నారు. కొన్ని పరిశ్రమలకు సంబంధించిన రసాయన వ్యర్థాలు నేరుగా గోదావరి నదీపాయల్లో కలుస్తున్నాయని, దీనిపై ఈ టాస్క్ ఫోర్స్ ప్రత్యేకంగా నిఘా పెట్టి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తుందన్నారు.
'గోదావరి ప్రవహించే ఆరు జిల్లాల పరిధిలో అత్యంత ప్రాధాన్యత కలిగిన 285 గ్రామ పంచాయతీలను అధికారులు గుర్తించారు. ఈ గ్రామాల్లోని పుష్కర ఘాట్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం. ఇందుకోసం ఆయా పంచాయతీలకు ప్రత్యేకంగా నిధులను కేటాయిస్తాం. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల వసతి కోసం గ్రామాల్లోని ఇళ్లలోనే 'హోం స్టే' సౌకర్యాలను కల్పిస్తాం. పుష్కరాల పనులు, పర్యాటకుల రాక వల్ల స్థానిక ప్రజలకు ఉపాధి దొరికి, గ్రామాలు ఆర్థికంగా ఎంతో బలోపేతం అవుతాయి.' అని పవన్ కళ్యాణ్ అన్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


