...
...
Next Story

మంగళవారం బంగాళాఖాతంలో తీవ్ర తుపాను.. గురు, శుక్రవారాల్లో ఏపీలో భారీ వర్షాలు!

బంగాళాఖాతంలో వాయుగుండం వేగంగా కదులుతున్నట్టుగా రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. మంగళవారం నాటికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని తెలిపింది.

Published on: Nov 15, 2026, 19:08:39 IST
Advertisement

బంగాళాఖాతంలోని వాయుగుండం గంటకు 15 కి.మీ వేగంతో ఉత్తర-వాయవ్య దిశగా కదులుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ప్రస్తుతం ఇది విశాఖకు 960 కి.మీ, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 1070 కి.మీ, చెన్నైకి 800 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు
ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు

సోమవారం తుపానుగా, మంగళవారం తీవ్ర తుపానుగా బలపడనుంది. గురువారానికి ఆంధ్రప్రదేశ్ తీరం వైపు కదిలే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. దీని ప్రభావంతో గురు, శుక్రవారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయి. మంగళవారం వరకు కోస్తా తీరం వెంబడి గంటకు 40-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి.

మురసు తుపాను నష్టంపై కేంద్ర బృందంతో చంద్రబాబు

మురసు తుపాను ఆంధ్రప్రదేశ్‌పై తీవ్ర ప్రభావం చూపిందని, దీనివల్ల రాష్ట్రానికి రూ. 2,484 కోట్లకు పైగా ఆస్తి, పంట నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర బృందానికి వివరించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పర్యటనను ముగించుకున్న కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి చిత్తరంజన్ దాస్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల బృందం ముఖ్యమంత్రితో వర్చువల్‌గా సమావేశమైంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని సీఎం వారికి నివేదించారు.

ఎల్‌నినో ప్రభావానికి తోడు ఒకేసారి రెండు తుపాన్లు విరుచుకుపడటంతో రాష్ట్రం కోలుకోలేని విధంగా దెబ్బతిందని చంద్రబాబు పేర్కొన్నారు. చిత్తరంజన్ దాస్ ఆధ్వర్యంలోని ఏడుగురు సభ్యులు రెండు బృందాలుగా విడిపోయి బాపట్ల, పల్నాడు, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల్లోని సుమారు 60 ప్రభావిత ప్రాంతాలను స్వయంగా సందర్శించారు. దెబ్బతిన్న పంట పొలాలు, రహదారులు, సాగునీటి కాలువలు, ఇళ్లు, విద్యుత్ వ్యవస్థలను పరిశీలించడంతో పాటు రైతులు, మత్స్యకారులతో నేరుగా మాట్లాడి వారి కష్టాలను తెలుసుకున్నారు.

తుపాను గమనాన్ని ముందస్తుగానే అంచనా వేసి యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని, తుపాను తీరం దాటిన 24 గంటల్లోనే దెబ్బతిన్న రహదారులు, విద్యుత్, మొబైల్ నెట్‌వర్క్ సేవలను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించామని చంద్రబాబు కేంద్ర బృందానికి తెలిపారు. బాధితులకు అదనపు రేషన్ పంపిణీ చేశామని, రైతులకు పంటల బీమా పరిహారం త్వరగా అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

కోస్తాంధ్ర ప్రాంతం తరచూ తుపాన్ల ముప్పును ఎదుర్కొంటోందని, అందువల్ల తక్షణ సాయంతో పాటు శాశ్వత ప్రాతిపదికన మౌలిక వసతులను పటిష్ఠం చేయాల్సిన అవసరం ఉందని సీఎం స్పష్టం చేశారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులతో సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks