ఏఈ నూకరాజు ఫ్యామిలీ సూసైడ్ కేసులో షాకింగ్ నిజాలు.. వెలుగులోకి కొత్త కోణం!
గోదావరిలో దూకి ఏఈ నూకరాజ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఒక్కొక్కటిగా షాకింగ్ నిజాలు బయటకు వస్తున్నాయి.
తూర్పు గోదావరి జిల్లాలో పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ విషాదాంతం వెనుక రైఫిల్ షూటింగ్ శిక్షకుడు సాధిక్ ఖాన్ మానసిక, ఆర్థిక వేధింపులే ప్రధాన కారణమని తెలుస్తోంది. కేసు దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు విచారణలో సంచలన విషయాలను వెలికితీశారు.

గతంలో నూకరాజు అల్లుడు జగదీశ్వరరెడ్డి అనారోగ్యంతో మరణించారని భావించినప్పటికీ, అతనిపై విష ప్రయోగం జరిగిందనే అనుమానాలు ఇప్పుడు బలపడుతున్నాయి. సాధిక్ ఖాన్ తన భర్తకు విషమిచ్చి హత్య చేశాడని సౌజన్య స్వయంగా రాసిన లేఖ లభించడంతో కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కొత్త కోణం అందరినీ షాకింగ్‌కు గురిచేస్తోంది. షూటింగ్ కోసం కార్తికేయను తీసుకెళ్లే సమయంలో సౌజన్యతో సాధిక్ ఖాన్‌కు పరిచయం ఏర్పడింది. దీనినే అతడు తనకు అనుకూలంగా చేసుకున్నాడు.
భర్త మృతికి సాధిక్ విషమివ్వడమే కారణమని స్పష్టం చేస్తూ భార్య సౌజన్య లేఖ పేర్కొనడం సంచలనంగా మారింది. మరోవైపు నూకరాజు స్వయంగా రాసి ఉంచిన సూసైడ్ నోట్ కూడా ఉంది.ప్రాణాలతో బయటపడిన చిన్నారి కార్తికేయరెడ్డి ఇచ్చిన వివరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కేసు తీవ్రతను గమనించిన రాజమహేంద్రవరం రెండో పట్టణ పోలీసులు, కాకినాడ అధికారులతో కలిసి సాధిక్ నివాసానికి వెళ్లగా, అతను అప్పటికే పరారయ్యాడు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. నూకరాజు కారులో లభించిన ఫోన్ల కాల్ డేటాను విశ్లేషిస్తున్నారు. దీని ద్వారా సాధిక్ కుట్రలు, ఈ దారుణంలో మరెవరికైనా భాగస్వామ్యం ఉందా అనే కోణాల్లో విచారణ జరుపుతున్నారు.
నూకరాజు మనుమడిని రైఫిల్ షూటింగ్ శిక్షణలో చేర్పించిన సమయంలో సౌజన్యతో సాధిక్ ఖాన్ కు పరిచయం ఏర్పడింది. నూకరాజు కుటుంబంలో అతనే ఏకైక పెద్ద దిక్కు కావడం, ఆ కుటుంబం పరువుకు ప్రాణమిచ్చే స్వభావం కలది కావడాన్ని సాధిక్ అనుకూలంగా మలుచుకున్నాడు. అల్లుడు జగదీశ్వరరెడ్డి మరణం తర్వాత సాధిక్ వేధింపులు మరీ ఎక్కువయ్యాయని తెలుస్తోంది.
నూకరాజు కుటుంబ ఆస్తులను తన పేరిట రాయించుకోవడానికి తీవ్ర ఒత్తిడి తెచ్చాడు. విషయాన్ని బయటకు పొక్కనిస్తే ప్రాణాలు తీస్తానని బెదిరింపులకు దిగాడు. ఈ ఒత్తిడి తట్టుకోలేకనే కుటుంబమంతా మరణమే శరణ్యమని భావించి గోదావరిలోకి దూకినట్లు ప్రాథమిక ఆధారాలు తెలుపుతున్నాయి.
గోదావరిలో దూకిన వారిలో నూకరాజు మృతదేహం లభించగా, ఆయన భార్య మీనా, కుమార్తె సౌజన్యల ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. ఎస్డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది, స్థానిక మత్స్యకారులు నదిలో విస్తృతంగా గాలిస్తున్నారు. పోలీసులు డ్రోన్ల సహాయంతో నదీ పరివాహక ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు.
ఇప్పటికే కుమారుడిని రోడ్డు ప్రమాదంలో కోల్పోయిన ఆ కుటుంబంలో, ఇప్పుడు అల్లుడు, నూకరాజు మృతి చెందడం, మిగిలిన ఇద్దరు గల్లంతు కావడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ దారుణ సంఘటన నుంచి 10 ఏళ్ల చిన్నారి కార్తికేయరెడ్డి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. బంధువులు, స్థానికులు సాధిక్ ఖాన్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


