Visakhapatnam Kirandul Passenger Train Updates : రైలు ప్రయాణికులకు సౌత్ కోస్ట్ రైల్వే కీలక అలర్ట్ ఇచ్చింది. కమ్లూర్ – భాన్సీ రైల్వే సెక్షన్ పరిధిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా సాగుతున్న రైల్వే లైన్ డబ్లింగ్ (రెండో లైన్) పనుల కోసం భారీ ట్రాఫిక్ బ్లాక్‌ను విధించారు. ఈ పనుల నిర్వహణ కారణంగా విశాఖపట్నం – కిరండూల్ మధ్య నడిచే ప్యాసింజర్ రైళ్ల సర్వీసులలో తాత్కాలిక మార్పులు చేసినట్లు వెల్లడించింది. కొన్ని రైళ్లను గమ్యస్థానానికి ముందే నిలిపివేయడం (షార్ట్ టెర్మినేట్), మరికొన్ని రైళ్లను మధ్యలోనే ప్రారంభించడం (షార్ట్ ఒరిజినేట్) చేస్తున్నట్లు పేర్కొంది.
డబ్లింగ్ పనులు - ఈ రైళ్లపై ప్రభావం
- విశాఖపట్నం – కిరండూల్ ప్యాసింజర్ (రైలు నంబర్ 58501): ఈ రైలును 2026 జూన్ 22వ తేదీ నుండి జూన్ 25వ తేదీ వరకు దంతేవాడ స్టేషన్ లోనే నిలిపివేస్తారు. అంటే ఈ నాలుగు రోజుల పాటు ఈ రైలు విశాఖపట్నం నుండి దంతేవాడ వరకు మాత్రమే నడుస్తుంది. దంతెవాడ – కిరండూల్ మధ్య ఈ రైలు సేవలను పాక్షికంగా రద్దు చేశారు.
- కిరండూల్ – విశాఖపట్నం ప్యాసింజర్ (రైలు నంబర్ 58502): తిరుగు ప్రయాణంలో ఈ రైలు 2026 జూన్ 23వ తేదీ నుండి జూన్ 26వ తేదీ వరకు కిరండూల్‌కు బదులుగా దంతెవాడ స్టేషన్ నుంచే తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. ఈ నాలుగు రోజుల పాటు కిరండూల్ – దంతేవాడ మధ్య ఈ రైలు సర్వీసు అందుబాటులో ఉండదు.

రైల్వే లైన్ సామర్థ్యాన్ని పెంచేందుకు, ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు ఈ డబ్లింగ్ పనులు చేపట్టారు. ప్రయాణికులు ఈ తాత్కాలిక మార్పులను గమనించి, అందుకు అనుగుణంగా తమ ప్రయాణ ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని అధికారులు ఓ ప్రకటన ద్వారా కోరారు.