తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాలు 2026 : సింహ వాహనంపై యోగ నరసింహుని రూపంలో శ్రీ మలయప్పస్వామి

Tirumala Navaratri Brahmotsavam 2026 : తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో మూడో రోజు శ్రీ మలయప్పస్వామివారు సింహ వాహనంపై యోగ నరసింహుని అలంకారంలో దర్శనమిచ్చారు. గోవింద నామస్మరణలతో తిరుమాడ వీధులు మార్మోగాయి.

Published on: Oct 14, 2026, 12:56:19 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Tirumala Navaratri Brahmotsavam 2026 : కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజైన బుధవారం(ఇవాళ) ఉదయం శ్రీ మలయప్పస్వామివారు దివ్యమైన సింహ వాహనంపై యోగ నరసింహస్వామి అలంకారంలో భక్తులకు అభయమిచ్చారు. గంభీరమైన సింహ వాహనంపై కొలువుదీరిన స్వామివారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని భక్తజనం పరవశించిపోయారు. తిరుమాడ వీధులన్నీ గోవింద నామస్మరణలతో, హరినామ సంకీర్తనలతో మారుమోగిపోయాయి.

సింహ వాహనంపై యోగ నరసింహుని రూపంలో శ్రీ మలయప్పస్వామి
సింహ వాహనంపై యోగ నరసింహుని రూపంలో శ్రీ మలయప్పస్వామి

భక్తి పారవశ్యంలో వాహనసేవ…..

మాడ వీధుల్లో సాగిన ఈ వాహనసేవ భక్తులకు కన్నులపండువగా నిలిచింది. ఊరేగింపు ముందుగా గజరాజులు గంభీరంగా నడుస్తుండగా, భక్తబృందాల భజనలు, ఉత్సాహంగా సాగిన కోలాటాలు, శ్రీవైష్ణవ జీయంగార్ల వేదఘోష, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు అత్యంత వేడుకగా సాగింది. తిరుమల పురవీధులన్నీ భక్తి చైతన్యంతో, ఆధ్యాత్మిక శోభతో పులకించిపోయాయి.

సనాతన ధర్మంలో సింహం ధైర్యం, పరాక్రమం, తేజస్సు, గంభీరతలకు ప్రతీకగా నిలుస్తుంది. దుష్టశిక్షణ, శిష్టరక్షణ సంకల్పాన్ని ప్రపంచానికి చాటిచెబుతూ శ్రీ మలయప్పస్వామివారు ఈ రాజసంతో కూడిన సింహ వాహనాన్ని అధిరోహించారు. యోగ నరసింహస్వామి అలంకారంలో స్వామివారిని దర్శించుకోవడం వల్ల భక్తులకు నిర్భయత్వం, ఆత్మవిశ్వాసం చేకూరడమే కాకుండా ధర్మమార్గంలో నడిచే సద్బుద్ధి లభిస్తుందని నమ్ముతారు. భగవంతుని అనుగ్రహం ఉంటే ధర్మమే అంతిమంగా విజయాన్ని సాధిస్తుందనే ఆధ్యాత్మిక సత్యాన్ని ఈ వాహనసేవ భక్తకోటికి స్పష్టం చేసింది.

ఈ దివ్య వాహనసేవలో తిరుమల శ్రీవారి ఆలయ పెద్ద జీయర్‌స్వామి, చిన్న జీయర్‌స్వామి, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, ధర్మకర్తల మండలి సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి, జానకిదేవి, రంగశ్రీ, శాంత రామ్, సీవీఎస్‌వో కే.వి. మురళీకృష్ణతో పాటు పలువురు అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More