ఇరిగేషన్‌ భూముల్లో సోలార్ ప్లాంట్లు.. వాటర్ రెగ్యులేటరీ కమిషన్ దిశగా అడుగులు!

ఇరిగేషన్‌ భూముల్లో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు అన్నారు. మరోవైపు వాటర్ రెగ్యులేటరీ కమిషన్ మీద కూడా మాట్లాడారు.

Published on: Nov 11, 2026, 15:59:51 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్‌ను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా జలవనరుల శాఖ కార్యకలాపాల్లో ఊహించని విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాల మనుగడ, పర్యవేక్షణపై సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతోపాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాగునీటి రంగంలో పారదర్శకత, స్వయంసమృద్ధి పెంచేందుకు సీఎం చంద్రబాబు పలు కీలక నిర్ణయాలు ప్రకటించారు.

సోలార్ ప్లాంటు
సోలార్ ప్లాంటు

సాగునీటి శాఖ పరిధిలో వృథాగా ఉన్న వేలాది ఎకరాల భూములను ఆదాయ వనరుగా, పునరుత్పాదక ఇంధన కేంద్రాలుగా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇరిగేషన్ శాఖకు చెందిన ప్రతి ఎకరా స్థలాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సీఎం సూచించారు. ప్రాజెక్టుల పరివాహక ప్రాంతాలు, కాలువల గట్లు, ఖాళీ స్థలాల్లో సౌర విద్యుత్తు ప్లాంట్లను నిర్మించే సాధ్యాసాధ్యాలపై సమగ్ర ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. దీనివల్ల ఎత్తిపోతల పథకాల నిర్వహణకు అవసరమయ్యే విద్యుత్ భారాన్ని తగ్గించుకునే అవకాశం లభిస్తుంది.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎత్తిపోతల పథకాల పునరుద్ధరణ, నిరంతర నిర్వహణ, మరమ్మతుల బాధ్యతను జలహారతి కార్పొరేషన్‌కు అప్పగించాలని సీఎం నిర్ణయించారు. రైతులకు సాగునీరు అందించడంలో కీలకమైన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌లు నిరుపయోగంగా మారకుండా, సాంకేతిక లోపాలు త్యాగం కాకుండా నిరంతరం పర్యవేక్షించేలా ప్రత్యేక వ్యవస్థను ఈ కార్పొరేషన్ ద్వారా రూపొందిస్తున్నారు.

రాష్ట్రంలో నీటి వినియోగం, కేటాయింపులు, ప్రాజెక్టుల పర్యవేక్షణలో జవాబుదారీతనం కోసం నూతన కమిషన్‌ను అందుబాటులోకి తెచ్చే ఆలోచన చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి తరహాలోనే నీటి రంగానికి కూడా వాటర్ రెగ్యులేటరీ కమిషన్‌ను తీసుకురావాలని సీఎం చంద్రబాబు ప్రతిపాదించారు.

నీటి పంపిణీలో పారదర్శకత, ప్రాజెక్టుల నిర్వహణ నిధుల కేటాయింపు, వివాదాల పరిష్కారాన్ని సులభతరం చేయడంపై ఈ కమిషన్ దృష్టి సారిస్తుంది. ఈ అంశంపై తక్షణమే నివేదిక ఇవ్వాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలో కోట్లాది ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత కలిగిన 36 సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు, పెండింగ్ పనులను జాబితా చేసిందన్నారు. ఈ 36 ప్రాజెక్టులను రాబోయే రెండున్నరేళ్ల వ్యవధిలోనే పూర్తి చేసి ఆయకట్టుకు నీరు అందించాలని సీఎం ఆదేశించారు.

ప్రాజెక్టుల పూర్తికి ఎలాంటి నిధుల కొరత రానివ్వబోమని, పనుల ప్రగతిని ఎప్పటికప్పుడు తానే స్వయంగా సమీక్షిస్తానని సీఎం స్పష్టం చేశారు. పాడైపోయిన ఎత్తిపోతల పథకాలకు రూ.600 కోట్లకు పైగా అంచనాతో మరమ్మతులు చేపట్టి, వ్యవసాయ సీజన్ నాటికి సిద్ధం చేయడం ద్వారా గరిష్ఠ ఆయకట్టుకు నీరందించాలని ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఒకవైపు పెండింగ్ ప్రాజెక్టుల వేగవంతం, మరొకవైపు ఇరిగేషన్ భూముల్లో ఇంధన ఉత్పత్తి ద్వారా ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More