ఇరిగేషన్ క్యాలెండర్ ప్రకారం ప్రాజెక్టుల పనులు చేయాలి : సీఎం చంద్రబాబు
ఇరిగేషన్ క్యాలెండర్ ప్రకారం ప్రాజెక్టుల పనులు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పోలవరం ఎడమ కాల్వ-చంపావతి లింక్ పై అధ్యయనం చేయాలన్నారు. 2027 ఏప్రిల్ నాటికి పోలవరం నిర్వాసితుల తరలింపు పూర్తి చేయాలని ఆదేశించారు.
ఇరిగేషన్ క్యాలెండర్ ప్రకారం ప్రాజెక్టుల నిర్మాణం, శంకుస్థాపనలు చేపట్టేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రాధాన్యతా క్రమంలో ఈ ప్రాజెక్టులను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఇటీవల జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్సులో 25 ఇరిగేషన్ ప్రాజెక్టులతో ఇరిగేషన్ క్యాలెండర్ ను సీఎం చంద్రబాబు ప్రకటించారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలో పోలవరం సహా రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించారు. దీంట్లో భాగంగా ఇరిగేషన్ క్యాలెండర్ అంశంపై చర్చించారు.

గతంలో ప్రకటించిన ప్రాజెక్టులు కాకుండా...ప్రాధాన్యత కలిగిన మరో 11 ప్రాజెక్టుల పనులు కూడా చేపట్టాలని సీఎం అధికారులకు స్పష్టం చేశారు. ఆ మేరకు ఆ 11 ప్రాజెక్టులను ఇరిగేషన్ క్యాలెండరులో చేర్చాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ, సివిల్ వర్క్స్ వంటి వాటికి ఎలాంటి నిధుల కొరత లేకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ అధికారులను సూచించారు. గతంలో ప్రకటించిన 25...సమీక్షలో ప్రకటించిన 11 ప్రాజెక్టులను ప్రాధాన్యతా ప్రాజెక్టులుగా తీసుకుని ప్రకటించిన ఇరిగేషన్ క్యాలెండర్ కు అనుగుణంగా పనులు చేపట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
సమీక్షా సమావేశం సందర్భంగా పోలవరం సహా వివిధ సాగు నీటి ప్రాజెక్టుల పనుల పురోగతిని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. పోలవరం ప్రాజెక్టులో సివిల్ వర్క్స్ 88 శాతం పూర్తి అయ్యాయని అధికారులు వెల్లడించారు. భూసేకరణ 93 శాతం పూర్తైందని.. నిర్వాసితుల తరలింపు 45 శాతం పూర్తి అయ్యిందని చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్ 2వ తేదీ నాటికి డయాఫ్రాం వాల్ నిర్మాణం పూర్తి చేశామని తెలిపారు. ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ గ్యాప్ 1, 2 పనులు 2027 మార్చి 31 నాటికి పూర్తి అవుతాయని ఇరిగేషన్ అధికారులు వెల్లడించారు.
పోలవరం కుడి కాలువను అనుసంధానించే ట్విన్ టన్నెల్స్ పనులు 85 శాతం పూర్తయ్యాయని అధికారులు ముఖ్యమంత్రికి చెప్పారు. ఎడమ కాలువ అప్రోచ్ ఛానల్, హెడ్ రెగ్యులేటర్, ఇరిగేషన్ టన్నెల్ పనులను చేపడుతున్నట్టు వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టుతో పాటు.. వివిధ ప్రాజెక్టుల పురోగతిని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. హంద్రినీవా ఫేజ్ 1 లో భాగంగా కాలువల వెడల్పు 92 శాతం పూర్తి అయ్యిందని అధికారులు చెప్పారు. ఫేజ్ 2 కుప్పం- పుంగనూరు కాలువల లైనింగ్ 85 శాతం పనులు పూర్తయ్యాయని వివరించారు.
'వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ జూలై నాటికి పూర్తి కావాలి. హెడ్ వర్క్స్, కాలువలు, డిస్ట్రిబ్యూటరీలు, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, భూసేకరణ లాంటి పనుల కోసం ఇంకా రూ. 2019 కోట్లు అవసరం. టీబీఎంను తొలగించి అడ్డంకులు లేకుండా నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి. పుంగనూరు, కుప్పం బ్రాంచ్ కెనాల్ బ్యాలెన్సు పనులు వేగంగా పూర్తి కావాలి. అడవిపల్లి, శ్రీనివాసపురం నుంచి నీవా కాలువ ద్వారా చిత్తూరుకు నీరు వెళ్లేలా చర్యలు తీసుకోవాలి. హంద్రీ నుంచి నీవా వరకూ నీళ్లు తీసుకెళ్లేలా ప్రాధాన్యతగా తీసుకుని పనులు పూర్తి కావాలి. నీళ్లు చూస్తే ప్రజల్లో ఓ నమ్మకం వస్తుంది.'అని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
ఎల్ నినో లాంటి పరిస్థితుల నేపథ్యంలో ముందస్తు అంచనాలను సిద్ధం చేసుకుంటూ పంటలు వేసేలా రైతులను సమాయత్తం చేయాలని చంద్రబాబు అన్నారు. నెల్లూరు సాగు తీరును మార్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈసారి రెయిన్ ఫాల్ మైనస్ 3 శాతంగా ఉందన్నారు. భూగర్భ నీటి నిల్వలు 9.49 మీటర్లుగా ఉన్నాయి..గతేడాదితో పోలిస్తే 0.5 మీటర్లు ఎక్కువ ఉందని చెప్పారు. ప్రస్తుత నీటి వనరుల్ని నింపేలా స్ట్రక్చర్ల నిర్మాణం జరగాలన్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


