ఇందిరమ్మ కోడలిగానే తెలుగు ప్రజలకు దగ్గరయ్యా.. ఆత్మకథలో సోనియా గాంధీ జ్ఞాపకాలు

ఏఐసీసీ నాయకురాలు సోనియా గాంధీ తన ఆత్మకథ 'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్'లో తెలుగు ప్రజలతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. 2004లో హైదరాబాద్-విజయవాడ యాత్ర, లంబాడీ మహిళలతో అనుబంధం, నీలం సంజీవరెడ్డిపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

Published on: Nov 12, 2026, 17:05:50 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలతో తనకున్న అనుబంధం రాజీవ్ గాంధీ భార్యగానో లేదా కేవలం సోనియా గాంధీగానో కాకుండా, మాజీ ప్రధాని ఇందిరమ్మ కోడలిగా మాత్రమే బలపడిందని ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ పేర్కొన్నారు. ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ (Belonging: A Journey of Love) అనే ఆత్మకథలో తెలుగు రాష్ట్రాలతో తనకున్న భావోద్వేగ అనుబంధాన్ని, 2004 నాటి ఎన్నికల ప్రచార అనుభవాలను, నాటి రాజకీయ పరిణామాలను గుర్తుచేసుకున్నారు.

సోనియా గాంధీ 'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్'
సోనియా గాంధీ 'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్'

2004 సార్వత్రిక ఎన్నికలకు ముందు కర్ణాటకలో జన సంపర్క్ యాత్ర పూర్తి చేసుకుని తాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టానని సోనియా గాంధీ తన పుస్తకంలో వివరించారు. రాష్ట్రంలో తన తొలి జ్ఞాపకం హైదరాబాద్ అని, అక్కడ పార్టీ ప్రధాన కార్యాలయమైన గాంధీ భవన్‌ను సందర్శించానని తెలిపారు. 1950లో సర్దార్ వల్లభాయ్ పటేల్ శంకుస్థాపన చేసి, నాటి రాష్ట్రపతి డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించిన ఈ చారిత్రక భవనాన్ని ఆమె ఒక అద్భుతమైన పురాతన కట్టడంగా అభివర్ణించారు.

అనంతరం హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు సాగిన తన యాత్రలో అడుగడుగునా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి, ఇందిరా గాంధీకి జైకొడుతూ ఘనస్వాగతం పలికారని గుర్తుచేసుకున్నారు. తెలుగు ప్రజలు దివంగత ఇందిరా గాంధీని ఎంతో ఆప్యాయంగా ఇందిరమ్మ అని పిలుచుకునేవారని ఆమె రాసుకొచ్చారు.

విజయవాడ పర్యటన సందర్భంగా రోడ్డు పక్కన నిలబడి ఉన్న బంజారామహిళలతో జరిగిన ఒక సమావేశం తన హృదయాన్ని హత్తుకుందని సోనియా గాంధీ పేర్కొన్నారు. తమ వాహనాలు నెమ్మదిగా వెళ్తుండగా, సంప్రదాయ దుస్తుల్లో ఉన్న బంజారా మహిళలను చూసి తాను కాన్వాయ్ ఆపి వారిని కలిశానని తెలిపారు. ఎరుపు, నీలం రంగుల లెహంగాలు, ఎంబ్రాయిడరీ బ్లౌజులు, అద్దాలు పొదిగిన ఓణీలతో ఉన్న వారి వస్త్రధారణ తనకు ఎంతో వ్యక్తిగత ఆసక్తిని కలిగించిందన్నారు. తన వివాహానికి ముందు రోజు జరిగిన మెహందీ వేడుకలో తాను కూడా సరిగ్గా అలాంటి దుస్తులనే ధరించానని ఆమె గుర్తుచేసుకున్నారు.

ఆ మహిళలు ఎంతో ప్రేమతో ఒక ఓణీని తన తలపై కప్పారని, ఆ దుస్తుల వెనుక ఉన్న తన పెళ్లి నాటి జ్ఞాపకాన్ని ఒక అనువాదకురాలి సాయంతో వారికి వివరించానని సోనియా తెలిపారు. ఆ విషయాన్ని తెలుసుకుని ఎంతో ఆనందపడిన ఆ మహిళలు అక్కడికక్కడే నృత్యం చేస్తూ, తనను కూడా వారితో పాటు కలుపుకొన్నారని రాశారు.

"నువ్వు మా ఇందిరమ్మ కోడలివి.. మా ఓటు నీకే, కాంగ్రెస్ పార్టీకే" అంటూ ఆ మహిళలు, చుట్టుపక్కల ప్రజలు నినాదాలు చేశారని సోనియా గాంధీ తెలిపారు. యువకులు, వృద్ధులు అనే తేడా లేకుండా ప్రజలందరిలో ఒక స్పష్టమైన మార్పు కనిపించిందని, ఆ ప్రజా స్పందనే తన రాజకీయ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఉత్సాహాన్ని ఇచ్చిందని ఆమె పేర్కొన్నారు.

తన ఆత్మకథలో 1969, 1975 నాటి కీలక రాజకీయ ఘట్టాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నేతల పాత్రను కూడా సోనియా గాంధీ ప్రస్తావించారు. 1969 మే నెలలో రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ మరణానంతరం, కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేతల కూటమి (సిండికేట్) ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నీలం సంజీవరెడ్డిని రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టింది. అప్పటికే ఇందిరా గాంధీకి సంజీవరెడ్డి తీవ్ర వ్యతిరేకిగా ఉండేవారు. ఆ సమయంలో ఇందిరా గాంధీ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన ఉపరాష్ట్రపతి వి.వి. గిరికి మద్దతు ఇచ్చి, 'అంతరాత్మ ప్రబోధం' మేరకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఆ ఎన్నికల్లో వి.వి. గిరి విజయం సాధించడం కాంగ్రెస్ పార్టీపై ఇందిరా గాంధీ పట్టు సాధించడంలో ఒక మైలురాయిగా నిలిచిందని సోనియా గాంధీ తన ఆత్మకథలో విశ్లేషించారు.

జూన్ 1975లో ఇందిరా గాంధీ ఎన్నిక చెల్లదంటూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత తలెత్తిన రాజకీయ సంక్షోభాన్ని కూడా ఆమె గుర్తుచేసుకున్నారు. ఇందిరా గాంధీని పదవి నుంచి దించేందుకు మద్దతు కోరుతూ జయప్రకాశ్ నారాయణ్ (జేపీ) నాడు నీలం సంజీవరెడ్డికి పంపిన సందేశాన్ని అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి (జలగం వెంగళరావు అడ్డుకున్నారని సోనియా రాశారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More