తెలుగు వెండితెరపై సోనియా గాంధీ బయోపిక్ - జగ్గారెడ్డి ప్రకటన! డబ్బులు రెడీ చేసుకోవాలంటూ నేతలకు పిలుపు
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ జీవిత కథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ ఆధారంగా తెలుగులో సినిమా నిర్మించనున్నట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రకటించారు. పార్టీ నాయకులు డబ్బులు రెడీ చేసుకోవాలంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ జీవిత విశేషాలు, రాజకీయ ప్రస్థానాన్ని తెలుగు వెండితెరపై ఆవిష్కరించేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. సోనియా గాంధీ ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ (Belonging: A Journey of Love) ఆధారంగా తెలుగులో పూర్తిస్థాయి చలనచిత్రాన్ని నిర్మించనున్నట్లు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గురువారం ప్రకటించారు. సంగారెడ్డిలో జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ కీలక విషయాన్ని వెల్లడించారు.

నిర్మాణానికి భారీ విరాళం.. 50 మందితో కమిటీ
ఈ సినిమా నిర్మాణ బాధ్యతల్లో సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు భాగస్వాములు కావాలని జగ్గారెడ్డి పిలుపునిచ్చారు. ఆయన పిలుపుకు స్పందించిన నియోజకవర్గ కాంగ్రెస్ కన్వీనర్ జూలకంటి ఆంజనేయులు, సినిమా నిర్మాణం కోసం తక్షణమే రూ. 2 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. నిర్మాణ పనులను పర్యవేక్షించేందుకు 50 మంది సభ్యులతో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని జగ్గారెడ్డి సూచించారు. గాంధీ భవన్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (పీఆర్ఓ) హరిప్రసాద్ ఈ కమిటీ బాధ్యతలను పర్యవేక్షిస్తారని తెలిపారు.
"ఎన్నికల సమయంలో మీరు ఖర్చు చేస్తారు కదా….? దీన్ని కూడా అలాంటి ఒక ముఖ్యమైన ఖర్చుగానే భావించండి. అందరం కలిసి బడ్జెట్ సమకూర్చుకుని, ఒక మంచి దర్శకుడిని ఎంపిక చేద్దాం" అని జగ్గారెడ్డి కార్యకర్తలను ఉత్సాహపరిచారు. ప్రాథమిక ఏర్పాట్లు పూర్తయిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ చేతుల మీదుగా సినిమా షూటింగ్‌ను ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. అంతేకాకుండా…… సోనియా గాంధీ జీవిత అనుభవాలను లోతుగా అర్థం చేసుకునేందుకు వీలుగా ఆమె ఆత్మకథ పుస్తకాలను తెప్పించి పార్టీ కార్యకర్తలకు పంపిణీ చేస్తామని చెప్పారు.
ఈ చిత్రంలో సోనియా గాంధీ జీవితంలోని వివిధ కోణాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు జగ్గారెడ్డి వివరించారు. ఇందిరా గాంధీ కోడలిగా, రాజీవ్ గాంధీ సతీమణిగా, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల తల్లిగా ఆమె పోషించిన బాధ్యతలను ఇందులో చూపిస్తామన్నారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీల హత్యల తర్వాత ఆ కుటుంబం ఎదుర్కొన్న విషాదాలను, ఆ కష్టకాలంలో సోనియా పడిన వేదనను, పిల్లలను పెంచి పెద్ద చేసిన తీరును తెరపై ఆవిష్కరిస్తామని తెలిపారు. భిన్న మతాలు, కులాలు, భాషలు ఉన్న భారతదేశంలో సోనియా గాంధీ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకున్నారని కొనియాడారు.
సోనియా గాంధీకి ప్రధానమంత్రి పదవిపై ఏనాడూ వ్యామోహం లేదని జగ్గారెడ్డి గుర్తుచేశారు. రాజీవ్ గాంధీ హత్య తర్వాత పీవీ నరసింహారావు ప్రధాని అయిన సమయంలోనూ ఆమె ఆ పదవిని ఆశించలేదన్నారు. ఆ తర్వాత యూపీఏ కూటమి అధికారంలోకి వచ్చినప్పుడు….. కాంగ్రెస్ నేతలంతా ప్రధాని బాధ్యతలు చేపట్టాలని కోరినప్పటికీ ఆమె సున్నితంగా తిరస్కరించి మన్మోహన్ సింగ్‌కు ఆ అవకాశం ఇచ్చారని తెలిపారు. ప్రధాని పదవిని త్యాగం చేయడం ఆమె రాజకీయ జీవితంలో ఒక చారిత్రక ఘట్టమని అభివర్ణించారు.
సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీల ఆలోచనల నుంచే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) రూపుదిద్దుకుందని జగ్గారెడ్డి పేర్కొన్నారు. దేశ ప్రజలు మరోసారి గాంధీ కుటుంబం నుంచి ప్రధానమంత్రిని చూడాలని కోరుకుంటున్నారని…. రాహుల్ గాంధీ ప్రధాని కావాలన్నదే సోనియా గాంధీ ఆకాంక్ష అని వ్యాఖ్యానించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

