టెన్త్, ఇంటర్‌ విద్యార్థులకు రాత్రి వేళల్లో ప్రత్యేక కోచింగ్ తరగతులు

రూ.6 కోట్లతో అన్ని హాస్టళ్లకూ శానిటరీ కిట్ల పంపిణీ చేస్తున్నామని మంత్రి సవిత చెప్పారు. ఒక్కో కిట్ లో 11 రకాల వస్తువులు ఉంటాయన్నారు. హాస్టళ్లలో పారిశుధ్యం మెరుగుకు 1,200 మందిని నియమించామన్నారు.

Published on: Sep 2, 2026, 21:05:36 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాష్ట్ర సమగ్రాభివృద్ధికి నిర్దేశించుకున్న విజన్–2047 లక్ష్యాలను చేరుకునే క్రమంలో భావితరాల భవిష్యత్తును తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత తెలిపారు. బీసీ విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం, మెరుగైన ఆరోగ్యం, పరిశుభ్రమైన వాతావరణం, మౌలిక వసతులు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. బీసీ హాస్టళ్లలో పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తున్నామని, ఇందుకోసం రూ.6 కోట్ల విలువైన శానిటరీ కిట్లు అందజేస్తున్నామని తెలిపారు.

విద్యార్థులతో మంత్రి సవిత
విద్యార్థులతో మంత్రి సవిత

బుధవారం విజయవాడ గుణదలలోని ప్రభుత్వ బీసీ కళాశాల బాలికల వసతి గృహంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి సవిత శానిటేషన్ మెటీరియల్‌తో కూడిన శానిటరీ కిట్లను వర్కర్లకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న బీసీ హాస్టళ్ల రూపురేఖలు మార్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుందన్నారు. గతంలో బీసీ సంక్షేమ వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలను అధిగమించేందుకు అధికారంలోకి వచ్చిన వెంటనే మరమ్మతులు చేపట్టి అవసరమైన మౌలిక వసతులను కల్పించామన్నారు. విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ఆర్‌వో ప్లాంట్లు, విద్యుత్ అంతరాయం లేకుండా ఇన్వర్టర్లు, కిటికీలకు నెట్లు, విద్యార్థుల సౌకర్యార్థం హ్యాంగింగ్ హుక్స్ వంటి వసతులను ఏర్పాటు చేశామన్నారు.

హాస్టళ్లలో పారిశుధ్యానికి అత్యధిక ప్రాధాన్యం కల్పించామన్నారు మంత్రి సవిత. వసతి గృహాల్లో పారిశుధ్య సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు సుమారు 1,100 కొత్త టాయిలెట్లను నిర్మించామని మంత్రి తెలిపారు. వాటి నిర్వహణ, పరిశుభ్రత కోసం విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1,200 మంది శానిటేషన్ వర్కర్లను నియమించినట్లు చెప్పారు. బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని హాస్టళ్లలో విద్యార్థుల సంఖ్యను బట్టి శానిటేషన్ సిబ్బందిని కేటాయించామని తెలిపారు. హాస్టళ్లలో పరిశుభ్రమైన వాతావరణాన్ని నిరంతరం కొనసాగించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసిందన్నారు.

టాయిలెట్లు, వాష్‌రూమ్‌లు, ఇతర ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచేందుకు సుమారు రూ.6 కోట్ల వ్యయంతో 11 రకాల వస్తువులతో కూడిన శానిటరీ కిట్లను ప్రభుత్వం అందిస్తోందని మంత్రి సవిత తెలిపారు. సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వంటి ప్రత్యేక సేవలను కూడా అందిస్తున్నామని చెప్పారు. టాయిలెట్లు, కారిడార్లు, తాగునీటి ట్యాంకుల పరిశుభ్రతకు సంబంధించి శానిటేషన్ సిబ్బందికి స్పష్టమైన ఎస్‌ఓపీ (SOP) జారీ చేశామని, కిట్ల నిర్వహణపై వార్డెన్లకు కూడా నిబంధనలు రూపొందించామని వివరించారు. విద్యార్థుల సంఖ్య ఆధారంగా హాస్టళ్లను 1-స్టార్ నుంచి 5-స్టార్ వరకు విభజించి, నెల, మూడు నెలలకు ఒకసారి, ఆరు నెలలకు ఒకసారి, వార్షికంగా అవసరమైన శానిటేషన్ సామగ్రిని అందించే విధానాన్ని అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.

హాస్టల్ విద్యార్థులకు ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని మంత్రి సవిత తెలిపారు. రాబోయే టెన్త్, ఇంటర్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాల సాధనకు ఇప్పటినుంచే ప్రణాళికలు అమలు చేస్తున్నామన్నారు. రాత్రి వేళల్లో ప్రత్యేక కోచింగ్ తరగతులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. ’తల్లికి వందనం’తో పాటు ఇంటర్ విద్యార్థులకు ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం’ ద్వారా ప్రభుత్వం విద్యార్థులకు పూర్తి అండగా నిలుస్తోందన్నారు. విద్యార్థులకు మరింత నాణ్యమైన, పౌష్టికాహారం అందించాలన్న ముఖ్యమంత్రి ఆలోచన మేరకు డైట్ ఛార్జీలను 10 శాతం పెంచినట్లు మంత్రి తెలిపారు. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

వసతి గృహాలకు అవసరమైన కొత్త వంట సామగ్రిని సమకూర్చడంతో పాటు, అవసరానికి అనుగుణంగా కుక్-కమ్-అటెండర్లు, కుక్స్, హెల్పర్లను కూడా నియమిస్తున్నామని మంత్రి సవిత తెలిపారు. హాస్టళ్లలో ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నెలకొల్పేందుకు ‘నెట్ జీరో హెల్తీ క్యాంపస్’ కాన్సెప్ట్ ను అమలు చేస్తున్నామని తెలిపారు. బీసీ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన, సురక్షితమైన వాతావరణాన్ని కల్పించి వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఎస్. సవిత స్పష్టం చేశారు.

రాష్ట్రంలోని అన్ని సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరం పర్యవేక్షిస్తున్నామని బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్. సత్యనారాయణ తెలిపారు. గత రెండేళ్లుగా ప్రతి 15 రోజులకు ఒకసారి హాస్టళ్ల పరిస్థితులపై సమీక్ష నిర్వహిస్తూ, అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని వివరించారు. హాస్టళ్ల పరిశుభ్రత కోసం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో శానిటేషన్ సిబ్బందిని నియమించడంతో పాటు, అవసరమైన శానిటేషన్ మెటీరియల్‌ను అందిస్తున్నామని చెప్పారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రత, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన సూచించారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More