SIR in Andhrapradesh : ఏపీలో 'సర్'కు సర్వం సిద్ధం - ఇవాళ్టి నుంచి ఇంటింటి సర్వే..! ఈ విషయాలను తెలుసుకోండి
SIR in Andhrapradesh 2026 : ఏపీలో 'సర్'కు సర్వం సిద్ధమైంది. ఇవాళ్టి నుంచి ఇంటింటి సర్వే నిర్వహించనున్నారు. జులై 14 వరకు బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌వోలు) ప్రతి ఇంటికీ నేరుగా వెళ్లి వివరాలను సేకరిస్తారు.
Special Intensive Revision in Andhrapradesh : రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రక్షాళనకు భారత ఎన్నికల సంఘం సిద్ధమైంది. రాష్ట్రంలోని నాలుగు కోట్లకు పైగా ఉన్న ఓటర్ల జాబితాను సరిచేయడానికి, సరికొత్తగా అప్‌డేట్ చేయడానికి 'ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ-2026' (Special Intensive Revision - SIR) ప్రక్రియను చేపట్టనున్నారు. జూలై 1 నాటికి 18 ఏళ్లు నిండే యువతీ యువకులు కూడా ఈ ప్రక్రియ ద్వారా తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవడానికి అర్హులవుతారు.

ఇవాళ్టి నుంచి ఇంటింటి సర్వే…
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో అత్యంత కీలకమైన ఘట్టం ప్రారంభం కానుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా సోమవారం(జూన్ 15) నుంచి నెల రోజుల పాటు ఇంటింటి సర్వే నిర్వహించనున్నారు. జులై 14 వరకూ బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌వోలు) ప్రతి ఇంటికీ నేరుగా వెళ్లి వివరాలను సేకరిస్తారు. ఈ ప్రక్రియ కోసం ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
- ఇంటింటి సర్వేలో భాగంగా ప్రతి ఓటరుకూ బీఎల్‌వోలు రెండు ఎన్యుమరేషన్ ఫాంలను అందజేస్తారు.
- ఈ ఫాంలలో ఓటరు పేరు, ఫొటో గుర్తింపు కార్డు (ఎపిక్) నంబరు, చిరునామా వివరాలతో పాటు ఓటరు పాత ఫొటో ముద్రించి ఉంటాయి.
- మిగతా ఖాళీ వివరాలను ఓటరు స్వయంగా నింపాల్సి ఉంటుంది. ఈ వివరాలు నింపడంలో బీఎల్‌వోలు ఓటర్లకు పూర్తి సహకారం అందిస్తారు.
- నింపిన ఫాంలను ఓటర్ల నుంచి బీఎల్‌వోలే స్వయంగా వచ్చి తీసుకుంటారు.
- ఈ నెల రోజుల వ్యవధిలో ఫాంలు ఇవ్వడానికి, నింపిన వాటిని తిరిగి తీసుకోవడానికి బీఎల్‌వోలు ప్రతి ఇంటికీ మూడుసార్లు వస్తారు.
- పూర్తి చేసిన ఎన్యుమరేషన్ ఫాంలను ఓటర్లు జులై 14లోగా తిరిగి బీఎల్‌వోలకు సమర్పించాలి.
- ఈ ఫాంలు వెనక్కి ఇవ్వనివారి పేర్లు జులై 21న విడుదలయ్యే ముసాయిదా జాబితాలో ఉండవు.
ఈ భారీ సర్వే కోసం కేంద్ర ఎన్నికల సంఘం మొత్తం 4.16 కోట్ల ఎన్యుమరేషన్ ఫాంలను ముద్రించింది. రాష్ట్రవ్యాప్తంగా 46,397 మంది బీఎల్‌వోలు ఈ ప్రక్రియలో పాల్గొంటుండగా, వారికి ఈసీ ఇప్పటికే ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. వీరంతా కూడా జూలై 14 వరకు నేరుగా ఓటర్ల ఇళ్ల వద్దకే వచ్చి సర్వే నిర్వహిస్తారు.
ఈ ఎన్యుమరేషన్ ప్రక్రియలో రాజకీయ పార్టీల తరఫున నియమించిన 68,868 మంది బూత్ స్థాయి ఏజెంట్లు (BLAs) కూడా బీఎల్‌వోలకు సహాయకరంగా వ్యవహరిస్తారు. నకిలీ ఓట్ల తొలగింపు, మరణించిన వారి పేర్లను తొలగించడం, కొత్త ఓటర్ల చేరికను పారదర్శకంగా చేపట్టడమే ఈ సర్వే ముఖ్య ఉద్దేశం.
ముఖ్యమైన తేదీలు :
- జూన్ 15 నుండి జూలై 14 వరకు : బీఎల్‌వోల ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే జరుగుతుంది. ఇదే సమయంలో పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ (Rationalisation) ప్రక్రియను కూడా జూలై 14 లోగా పూర్తి చేస్తారు.
- జూలై 2 1: సేకరించిన ప్రాథమిక వివరాల ఆధారంగా ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రచురిస్తారు.
- జూలై 21 నుండి ఆగస్టు 20 వరకు: ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు తెలపడానికి, కొత్తగా ఓటు హక్కు కోసం క్లెయిమ్‌లు దాఖలు చేయడానికి ఓటర్లకు అవకాశం కల్పిస్తారు.
- జూలై 21 నుండి సెప్టెంబరు 18 వరకు : వచ్చిన క్లెయిమ్‌లు, నోటీసులు మరియు అభ్యంతరాలన్నింటినీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరిస్తారు.
- సెప్టెంబరు 22 : అన్ని సవరణలు పూర్తి చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తుది ఓటర్ల జాబితానుఅధికారికంగా విడుదల చేస్తారు.
ఈ సర్వేకు 2002 నాటి ఓటర్ల జాబితాను ప్రాతిపదికగా తీసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,16,18,359 మంది ఓటర్లు ఉండగా, వారిలో 2,68,86,239 మందికి (64.6%) 2002 నాటి ఓటర్ల జాబితాతో మ్యాపింగ్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. ఇంకా 1,47,32,120 మందికి మ్యాపింగ్ కావాల్సి ఉంది. ఓటర్ల జాబితాలో పేరున్నవారు ఎన్యుమరేషన్ ఫాంతో పాటు, 2002 నాటి జాబితాలో వారి లేదా వారి కుటుంబ సభ్యుల వివరాలు అందిస్తే సరిపోతుంది, ఇతర పత్రాలేవీ అవసరం లేదు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

