Narasapur Tiruvannamalai Special Trains : రాబోయే పండగల సీజన్, కార్తీక మాసంలో ప్రయాణికులు, భక్తుల రద్దీని తట్టుకునేందుకు దక్షిణ కోస్తా రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. నరసాపురం నుంచి అరుణాచలం (తిరువణ్ణామలై) క్షేత్రానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడపాలని నిర్ణయించింది.
రైళ్ల టైమింగ్స్ - షెడ్యూల్ వివరాలు:

రైలు నంబర్ 07291 (నరసాపురం - తిరువణ్ణామలై) : ఈ ప్రత్యేక రైలు 2026 అక్టోబర్ 04 నుంచి నవంబర్ 29 వరకు ప్రతి ఆదివారం నరసాపురంలో మధ్యాహ్నం 13:00 గంటలకు (1:00 PM) బయలుదేరుతుంది. మరుసటి రోజు (సోమవారం) ఉదయం 04:55 గంటలకు తిరువణ్ణామలై చేరుకుంటుంది. ఇది మొత్తం 9 ట్రిప్పులు సేవలు అందిస్తుంది.
రైలు నంబర్ 07292 (తిరువణ్ణామలై - నరసాపురం) : తిరుగు ప్రయాణంలో ఈ ప్రత్యేక రైలు 2026 అక్టోబర్ 05 నుంచి నవంబర్ 30 వరకు ప్రతి సోమవారం రాత్రి 20:00 గంటలకు (8:00 PM) తిరువణ్ణామలైలో బయలుదేరుతుంది. మరుసటి రోజు (మంగళవారం) ఉదయం 10:45 గంటలకు నరసాపురం చేరుకుంటుంది. ఇది కూడా మొత్తం 9 ట్రిప్పులు నడుస్తుంది.
స్టాపేజీలు (ఆగే స్టేషన్లు):
ఈ ప్రత్యేక రైళ్లు ఇరువైపులా పాలకొల్లు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి, వేలూరు కంటోన్మెంట్ స్టేషన్లలో ఆగుతాయి.
ఈ ప్రత్యేక రైలులో మొత్తం 23 కోచ్‌లు ఉంటాయి. వీటిలో ఒక 2nd ఏసీ, రెండు థర్డ్ ఏసీ, 14 స్లీపర్ క్లాస్, 4 జనరల్ సెకండ్ క్లాస్ మరియు 2 సెకండ్ క్లాస్ కమ్ లగేజ్/గార్డ్ వ్యాన్లు (SLR) అందుబాటులో ఉంటాయి. అరుణాచలంలో గిరిప్రదక్షిణ చేసే భక్తులతో పాటు…. తిరుపతి క్షేత్రానికి వెళ్లేవారికి కూడా ఈ ప్రత్యేక రైళ్లు ఎంతో సౌకర్యవంతంగా ఉండనున్నాయి. ప్రయాణికులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, 'రైల్ వన్' (RailOne) యాప్ ద్వారా సేవలు పొందవచ్చని రైల్వే అధికారులు కోరారు.