విజయవాడ దుర్గమ్మ భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ 22 నుంచి ఘాట్ రోడ్డు క్లోజ్.. పార్కింగ్, ఉచిత బస్సుల వివరాలు!

దసరా పండుగను దృష్టిలో ఉంచుకుని విజయవాడ కనకదుర్గ ఆలయం రోడ్డు మరమ్మతు, నిర్వహణ పనులు చేపడుతున్నారు. దీంతో ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డు సెప్టెంబర్ 22 నుంచి వారం రోజుల పాటు మూసివేస్తున్నారు.

Published on: Sep 22, 2026, 17:31:29 IST
By , Vijayawada
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దసరా పండుగ సందర్భంగా ఇంద్రకీలాద్రిపైకి భక్తుల రద్దీ భారీగా పెరిగే అవకాశం ఉండటంతో, ఆలయ అధికారులు ముందస్తు భద్రతా చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 22 నుంచి వారం రోజుల పాటు (సెప్టెంబర్ 28 వరకు) ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డును పూర్తిగా మూసివేస్తున్నట్లు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి.కె. సీనా నాయక్ వెల్లడించారు.

విజయవాడ కనకదుర్గ ఆలయం
విజయవాడ కనకదుర్గ ఆలయం

ఘాట్ రోడ్డు మరమ్మతులు, కొండ చరియలు విరిగిపడకుండా భద్రతా చర్యలు, వార్షిక నిర్వహణ పనుల నిమిత్తం వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఘాట్ రోడ్డు బంద్ ఉన్న సమయంలో భక్తులు, వాహనదారులు కింద తెలిపిన ప్రత్యామ్నాయ మార్గాలను పాటించాలని దుర్గగుడి ఈవో సీనా నాయక్ విజ్ఞప్తి చేశారు.

ఘాట్ రోడ్డు గుండా ఎలాంటి ద్విచక్ర వాహనాలు, కార్లు లేదా ప్రైవేట్ వాహనాలను కొండపైకి అనుమతించరు. కాలినడకన, వాహనాల్లో వచ్చే భక్తులందరూ శ్రీ కనకదుర్గ నగర్ గుండా మాత్రమే ఇంద్రకీలాద్రిపైకి చేరుకోవాల్సి ఉంటుంది.

దసరా ఉత్సవాల దృష్ట్యా విజయవాడ నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా, ఇతర జిల్లాల, రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల కోసం ట్రాఫిక్ పోలీసులు, దేవస్థానం అధికారులు సమగ్ర పార్కింగ్ ప్రణాళికను రూపొందించారు.

హైదరాబాద్ మార్గం నుంచి వచ్చే భక్తులకు

హైదరాబాద్, సూర్యాపేట, నందిగామ మార్గాల నుంచి వచ్చే భక్తుల వాహనాల కోసం పున్నమి ఘాట్ వద్ద విస్తృత పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. పున్నమి ఘాట్ నుంచి భక్తుల కోసం దుర్గగుడి దేవస్థానం ఉచిత బస్సు సౌకర్యాన్ని అందిస్తుంది.

విశాఖపట్నం, చెన్నై, గుంటూరు మార్గాల భక్తులకు

విశాఖపట్నం, ఏలూరు, రాజమండ్రి, చెన్నై, గుంటూరు ప్రాంతాల నుంచి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ రోడ్డు మీదుగా వచ్చే వాహనాలను సీతమ్మవారి పాదాలు, కృష్ణా నదీ తీర ప్రాంత పార్కింగ్ స్థలాల్లో నిలపాల్సి ఉంటుంది. ఇక్కడి నుంచి కూడా ఆలయ సమీప ప్రాంతం వరకు ఉచిత బస్సులను నడుపనున్నారు.

'విశాఖపట్నం, చెన్నై, ఇతర ప్రాంతాల నుండి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ మార్గం ద్వారా వచ్చే భక్తులు తమ వాహనాలను సీతమ్మ వారి పాదాల వద్ద నిలపాలి. పార్కింగ్ ప్రాంతం నుండి ఆలయం వరకు ఉచిత బస్సు సర్వీసులు అందుబాటులో ఉంటాయి.' అని ఈవో సీనా నాయక్ చెప్పారు.

ఈ సందర్భంగా ఈవో సీనా నాయక్ మాట్లాడుతూ.. 'దసరా ఉత్సవాల సమయంలో లక్షలాది మంది భక్తులు అమ్మవారి దర్శనానికి విచ్చేస్తారు. ఘాట్ రోడ్డు ప్రయాణం భక్తుల రక్షణ దృష్ట్యా అత్యంత కీలకమైనది. కాబట్టి ఎక్కడా ప్రమాదాలు జరగకుండా, ప్రయాణం సురక్షితంగా ఉండేందుకు రోడ్డు రక్షణ గోడల బలోపేతం, కొండచరియల నెట్ అమరిక, ప్యాచ్ వర్క్స్ పూర్తి చేస్తున్నాం. భక్తులు ట్రాఫిక్ నిబంధనలను పాటించి, కేటాయించిన పార్కింగ్ స్థలాల వద్దే వాహనాలు నిలిపి, ఉచిత బస్సు సేవలను వినియోగించుకోవాలి.' అని ఈవో కోరారు.

భక్తులకు తాగునీరు, నీడ, క్యూలైన్లలో ఇబ్బందులు కలగకుండా దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోందని, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా అమ్మవారి దర్శనం సజావుగా సాగేలా చర్యలు తీసుకుంటున్నామని ఈవో సీనా నాయక్ వివరించారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More