తిరుపతి : శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు - శాస్త్రోక్తంగా చక్రస్నానం
తిరుపతిలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు చివరి దశకు చేరాయి. చివరి రోజు సందర్భంగా శాస్త్రోక్తంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి చక్రస్నానం నిర్వహించారు. ఇవాళ సాయంత్రం 6 నుంచి రాత్రి 7 గంటలకు ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన సోమవారం ఉదయం చక్రస్నానం శాస్త్రోక్తంగా జరిగింది. అర్చకులు, అధికారులు, భక్తులు పెద్ద ఎత్తున స్నానాలు ఆచరించారు.

వైభవంగా తిరుమంజనం…
అంతకుముందు ఉదయం 6.30 నుండి 7.30 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు పల్లకీ ఉత్సవం నిర్వహించారు. ఉదయం 9 నుండి 9.55 గంటల వరకు పుష్కరిణి ఎదురుగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వస్వామివారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. అనంతరం ఉదయం 9.55 గంటలకు చక్రస్నానం ఘనంగా జరిగింది.
ముందుగా కంకణ బట్టార్ శ్రీ బాలాజీ రంగాచార్యులు ఆధ్వర్యంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వస్వామివారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపనతిరుమంజనం వైభవంగా నిర్వహించారు. అనంతరం చక్రస్నానం జరిగింది.
ఇందులో విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం, ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, రాజోపచారం నిర్వహించారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా పాలు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు. వీటిని శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభధారణలతో వైఖానస ఆగమోక్తంగా స్నపనం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉపనిషత్తులు , దశశాంతి మంత్రాలు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, విష్ణుసూక్తం వంటి పంచసూక్త మంత్రాలు, దివ్యప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానం చేసే వేదాలను టీటీడీ వేదపారాయణదారులు పారాయణం చేశారు. ఈ వేడుకలో ఒక్కో క్రతువులో ఒక్కో రకమైన ఉత్తమ జాతి పుష్ప మాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు.
తొమ్మిది రోజుల ఉత్సవాలలో జరిగిన అన్ని సేవలూ సఫలమై, లోకం క్షేమంగా ఉండడానికి , భక్తులు సుఖశాంతులతో ఉండడానికి చక్రస్నానం నిర్వహించారు. ఎవరైతే బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకుంటారో వారు సమస్త పాపవిముక్తులై, ధనధాన్య సమృద్ధితో తులతూగుతారు. సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంటలకు ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
బ్రహ్మోత్సవాల విశేషాలు :
- ఆలయంలోని పోటులో శ్రీ వంశీస్వామి, శ్రీ శేషుస్వామి ఆధ్వర్యంలో రోజుకు దాదాపు 20 వేల మంది భక్తులకు పది రకాల ప్రసాదాలు తయారుచేసి పంపిణీ చేశారు.
- గరుడ సేవ, రథోత్సవం , చక్రస్నానం వంటి పర్వదినాలలో 25 వేల నుండి 30 వేల మందికి ప్రసాదాలు అందించారు.
- ప్రజాసంబంధాల విభాగం ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాల విశేషాలను మీడియా ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు అందజేశారు. రోజుకు 100 మంది చొప్పున శ్రీవారి సేవకులు భక్తులకు సేవలందించారు.
- బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ వైద్య విభాగం ఆధ్వర్యంలో వెయ్యి మందికి, ఎస్వీ ఆయుర్వేద ఆసుపత్రి ఆధ్వర్యంలో 1500 మందికి వైద్యసేవలందించారు. ఉచితంగా మందులు పంపిణీ చేశారు.
- బ్రహ్మోత్సవాల్లో సరాసరి రోజుకు 7 వేల పైచిలుకు భక్తులకు టిటిడి మరియు దాతల సహకారంతో ప్రతిరోజూ అన్నప్రసాదాలు అందించారు. గరుడసేవ రోజున విరివిగా పంపిణీ చేశారు.
- ఉద్యానవన విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో తొమ్మిది రోజులకు గాను 9 టన్నుల పుష్పాలు, 50వేలు కట్ ఫ్లవర్స్ వినియోగించారు. 60 మంది సిబ్బంది నిరంతరాయంగా సేవలందించారు. స్నపనతిరుమంజనం, వసంతోత్సవం లాంటి ప్రత్యేక సందర్భాల్లో బెంగళూరు, చెన్నై నుంచి వివిధ రకాల పుష్పాలతో రూపొందించిన మాలలు తెప్పించారు.
- బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీనివాస మంగాపురం ఆలయ వెలుపల, లోపులతో పాటు పరిసర ప్రాంతాల్లో, ప్రధాన కూడళ్లలో ఆకట్టుకునేలా రంగురంగుల ఎల్ ఈ డి విద్యుత్ దీపాలు, భక్తి భావాన్ని పెంచేలా లైటింగ్ డిజైన్లు, భక్తులకు ఆహ్వానం పలికేలా అలంకరణలు విశేషంగా ఆకట్టుకున్నాయి.
- టీటీడీ ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో ప్రతి రోజూ 75 మంది పారిశుద్ధ్య కార్మికులతో ఆలయం, పోటు, ఆలయ పరిసరాలను శుభ్రంగా ఉంచారు. గరుడసేవ, రథోత్సవం, చక్రస్నానం వంటి ప్రత్యేక దినాలలో 25 మంది అదనపు సిబ్బంది సేవలందించారు.
- టీటీడీ సెక్యూరిటీ, పోలీస్ విభాగం, ఇతర శాఖలు విశేషంగా సేవలు అందించారు.

E-Paper












