ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు ఆదివారం ఉదయం వటపత్రశాయి అలంకారంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 7.30 గంటల నుండి స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగింది.
కోలాహలంగా ఊరేగింపు…

భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
పురాణాల ప్రకారం.. జలప్రళయం సంభవించినపుడు శ్రీమహావిష్ణువు మర్రి ఆకుపై తేలియాడుతూ చిన్న శిశువుగా దర్శనమిస్తారు. కుడికాలి బొటనవేలిని నోటిలో పెట్టుకుని ఆస్వాదిస్తుంటారు. ఈ ఘట్టాన్ని గుర్తుచేస్తూ శ్రీమహావిష్ణువు అవతారమైన శ్రీరాముడు భక్తులకు కనువిందు చేశారు.
భక్తుల కష్టాలను కడతేర్చేందుకు ఎప్పుడూ ముందుంటానని స్వామివారు ఈ అలంకారం ద్వారా తెలియజేస్తున్నారు. వటపత్రశాయి మహిమను అన్నమయ్య తన సంకీర్తనల్లో చక్కగా వర్ణించారు. ఈ వాహన సేవలో అధికారులతో భక్తులు భారీగా హాజరయ్యారు.
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు శనివారం రాత్రి 7 గంటల నుండి హంస వాహనంపై శ్రీ సీతారామలక్ష్మణులు భక్తులను కటాక్షించారు. భక్తజన బృందాల చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహనసేవ కోలాహలంగా జరిగింది.
ఆత్మానాత్మ వివేకం కలవానికి భగవదనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. హంస వాహనంలోని పరమార్థం ఇదే. హంసలో పాలను, నీళ్లను వేరుచేసే సామర్థ్యం ఉంది. భక్తులలో అహంభావం తొలగించి ‘దాసోహం’ అనే భావం కలిగించడానికే పరమహంస రూపానికి ప్రతీక అయిన హంసవాహనాన్ని స్వామివారు అధిరోహిస్తారు.
- 29.03.2026 : ఉదయం – వటపత్రశాయి అలంకారము, రాత్రి – సింహ వాహనం
- 30.03.2026: ఉదయం – నవనీత కృష్ణాలంకారము, రాత్రి – హనుమంత వాహనం
- 31.03.2026 : ఉదయం – మోహినీ అలంకారము, రాత్రి – గరుడసేవ
- 01-04-2026 : ఉదయం – శివధనుర్భాణ అలంకరణ, మద్యాహ్నం 03.15 గం.లకు కాంత కోరిక, ఎదుర్కోలు ఉత్సవం సాయంత్రం 06.30 గం.ల నుండి 08.30 గం.ల వరకు శ్రీ సీతారామ కల్యాణోత్సవం. రాత్రి గజవాహన సేవ నిర్వహిస్తారు.
- 02-04-2026 : ఉదయం రథోత్సవం
- 03-04-2026 : ఉదయం – కాళీయమర్ధనాలంకారము, రాత్రి – అశ్వవాహనం
- 04-04-2026 : ఉదయం – చక్రస్నానం, రాత్రి – ధ్వజావరోహణం.
- ఏప్రిల్ 05వ తేదీ సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల వరకు పుష్పయాగం ఉంటుంది.