Srisailam Dam Water Level Updates : శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీటి రాక స్వల్పంగా కొనసాగుతోంది. ఇరిగేషన్ అధికారులు వెల్లడించిన నేటి ఉదయం నివేదిక ప్రకారం…. డ్యామ్‌లోకి ఇన్ ఫ్లో (వరద ప్రవాహం) 2,815 క్యూసెక్కులుగా నమోదైంది. అదే సమయంలో రిజర్వాయర్ నుంచి దిగువకు 49,090 క్యూసెక్కుల నీటిని ఔట్ ఫ్లో రూపంలో విడుదల చేస్తున్నారు.
నీటిమట్టం వివరాలు…
శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం జలాశయంలో నీటిమట్టం 869.501 అడుగులకు చేరింది. వరద ప్రవాహాలు మందగించడం, నీటి వినియోగం క్రమబద్ధీకరించడం వల్ల ప్రాజెక్టు పరిధిలోని కుడి గట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేశారు. నాగార్జునసాగర్ దిగువ అవసరాలకు అనుగుణంగా ఔట్ ఫ్లో విడుదల కొనసాగుతోంది.
- ప్రస్తుత నీటిమట్టం: 869.501 అడుగులు
- నీటి నిల్వ: 139.631 టీఎంసీలు
- ఇన్‌ఫ్లో (వచ్చే నీరు) : 2,815
- ఔట్‌ఫ్లో (వెళ్తున్న నీరు): 49,090 క్యూసెక్కులు.
కృష్ణా పరివాహక ప్రాంతంలోని ఎగువ రాష్ట్రాలలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో శ్రీశైలానికి వచ్చే నీటి శాతం భారీగా పడిపోయింది. ఎగువ నుంచి కొత్తగా వరద నీరు వచ్చి చేరితే తప్ప శ్రీశైలంలో నీటిమట్టం తిరిగి పుంజుకునే అవకాశం లేదు.
మరోవైపు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు 15,723 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుత నీటి మట్టం 535.699(పూర్తిస్థాయి నీటి మట్టం 590) అడుగులుగా నమోదు కాగా… నీటి నిల్వ 179.488(పూర్తి సామర్థ్యం 312.05 ) టీఎంసీలుగా ఉంది.
ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవటంతో కీలకమైన శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో నిండని పరిస్థితులు నెలకొన్నాయి. కేవలం ఎగువ నుంచి వచ్చిన వరద నీటిపైనే ఆధారపడాల్సి వచ్చింది. అయితే ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలను అత్యంత పొదుపుగా వాడుకునే దిశగా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికే ఆ దిశగా కార్యాచరణను సిద్ధం కూడా చేశాయి. ఇప్పటికే విద్యుత్ ఉత్పత్తి విషయంలోనూ కేఆర్ఎంబీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. తాగు నీటికే ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది.