నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్‌కు స్టేట్ లెవల్ స్టీరింగ్ కమిటీ

ఏపీలో పులుల సంరక్షణకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్‌కు 'స్టేట్ లెవల్ స్టీరింగ్ కమిటీ'ని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Published on: Aug 31, 2026, 21:09:09 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడుకోవడంతో పాటు పులులు, ఇతర అరుదైన వన్యప్రాణుల సంరక్షణ కోసం కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్‌గా పేరుగాంచిన నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ అభివృద్ధి, పర్యవేక్షణ కోసం ఒక ఉన్నత స్థాయి స్టేట్ లెవల్ స్టీరింగ్ కమిటీని పునర్వ్యవస్థీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ జీవో ఎంఎస్ నంబర్ 42ను అధికారికంగా విడుదల చేసింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

కేంద్ర ప్రభుత్వ వైల్డ్‌లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, 1972 (చట్టం సెక్షన్ 38U)లోని నిబంధనలకు అనుగుణంగా ఈ ప్రత్యేక స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. దీనికి చైర్‌పర్సన్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉంటారు. వైస్ చైర్‌పర్సన్‌గా డిప్యూటీ సీఎం, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్, మెంబర్ సెక్రటరీ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (వైల్డ్‌లైఫ్) అండ్ చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ ఉంటారు.

ఈ కమిటీలో గిరిజన సంక్షేమం, పంచాయతీ రాజ్, సోషల్ జస్టిస్ తదితర కీలక శాఖల విభాగాల అధికారులు భాగస్వామ్యులుగా ఉంటారు. వీరితో పాటు వన్యప్రాణి సంరక్షణ నిపుణులు ఎన్. లక్ష్మీరాణి, మూర్తి కాంతిమహంతి, గిరిజన మండలుల ప్రతినిధులను కమిటీ సభ్యులుగా ప్రభుత్వం నియమించింది.

టైగర్ రిజర్వ్ పరిధిలో పులులు, చిరుతలు, ఇతర క్రూర మృగాల సంఖ్యను పెంచడంతో పాటు, వాటికి ప్రాథమిక ఆహారంగా ఉండే జంతువుల పరిరక్షణకు ప్రత్యేక ప్రణాళికలు అమలు చేయడం స్టీరింగ్ కమిటీ ప్రధాన లక్ష్యం. అటవీ, పోలీస్, రెవెన్యూ, పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమ శాఖల మధ్య నిరంతర సమన్వయాన్ని ఏర్పరిచి అటవీ నేరాలను అరికట్టేలా చూడనుంది. నల్లమల అటవీ ప్రాంతంలో నివసించే చెంచు తదితర గిరిజన తెగల హక్కులకు భంగం కలగకుండా, వారి సాయంతోనే అడవుల సంరక్షణ చర్యలు చేపట్టనున్నారు.

నల్లమలలో విస్తరించి ఉన్న నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్‌ భారతదేశంలోనే అత్యంత విస్తీర్ణమైన టైగర్ రిజర్వ్‌లలో ఒకటిగా నిలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల, ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో వేల చదరపు కిలోమీటర్ల మేర వ్యాపించి ఉన్న ఇక్కడ వన్యప్రాణులు నివసిస్తున్నాయి.

కృష్ణానది ఈ రిజర్వ్ గుండా ప్రవహిస్తూ జీవవైవిధ్యానికి ప్రధాన ఆధారంగా నిలుస్తోంది. వేటగాళ్ల బెడద, ఆక్రమణలు వంటి సవాళ్లను ఎదుర్కొంటున్న ఈ ప్రాంతంలో స్టీరింగ్ కమిటీ ఏర్పాటుతో వన్యప్రాణుల రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రులు నేరుగా ఈ కమిటీకి నాయకత్వం వహిస్తుండటంతో ప్రాజెక్ట్ టైగర్ నిధుల వినియోగం, సంరక్షణ చర్యలు మరింత వేగవంతం కానున్నాయి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More