Veligonda Project Phase 1 : వెలిగొండ తొలిదశ ప్రారంభం నల్లమల సాగర్‌కు కృష్ణమ్మ పరుగులు, సీఎం చంద్రబాబు భావోద్వేగం…
Veligonda Project Phase 1 Inauguration : వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. కృష్ణా జలాలకు జలహారతి ఇచ్చి, సాష్టాంగ ప్రణామం చేశారు. 30 ఏళ్ల కల నెరవేరడంతో ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో సంబరాలు అంబరాన్నంటాయి.
Veligonda Project Phase 1 Inauguration : ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల ప్రజల ముప్పై ఏళ్ల దశాబ్దాల కల నెరవేరింది. ప్రతిష్టాత్మకమైన పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. కృష్ణా జలాలు తమ ప్రాంతానికి చేరుకోవడంతో మార్కాపురం ప్రాంత ప్రజలు, నిరుపేద రైతాంగం తీవ్ర ఆనందోత్సాహాలకు లోనయ్యారు. నీటి ప్రవాహాన్ని చూసి స్థానికులు పులకించిపోయారు.

ప్రత్యేక పూజలు – కృష్ణమ్మకు జలహారతి
దోర్నాల మండలం గంటవానిపల్లి సమీపంలో వెలిగొండ ఫీడర్ కెనాల్ వద్ద నిర్వహించిన ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు స్వయంగా నీటిలోకి దిగి కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు. పసుపు, కుంకుమ, పట్టు వస్త్రాలు (చీర) సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నల్లమల కొండల్లో నిర్మించిన రెండు భారీ సొరంగాల గుండా వచ్చిన కృష్ణా జలాలు గంటవానిపల్లి ఆక్విడెక్టుకు చేరుకుని, అక్కడ నుంచి నల్లమల సాగర్ వైపు పరవళ్లు తొక్కుతూ పరుగులు తీశాయి. ఈ దృశ్యాలను సభా ప్రాంగణంలోని భారీ ఎల్ఈడీ స్క్రీన్‌ల ద్వారా తిలకించిన వేలాది మంది రైతులు, మహిళలు హర్షధ్వానాలు చేశారు.
రైతులతో కలిసి బటన్ నొక్కిన సీఎం… భావోద్వేగ ఘట్టం
కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు స్థానిక రైతులకు అత్యున్నత గౌరవం ఇచ్చారు. ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ గేట్లు ఎత్తేందుకు రైతులచేత స్వయంగా బటన్ నొక్కించారు. ఫీడర్ కెనాల్ నుంచి కృష్ణా జలాలు ఉరకలెత్తుతుండగా సీఎం చంద్రబాబు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. జలహారతి సమర్పించిన అనంతరం కెనాల్ ఒడ్డునే కృష్ణమ్మకు సాష్టాంగ ప్రణామం చేశారు. ముఖ్యమంత్రి అంతటి భక్తిప్రపత్తులతో నేలపై సాష్టాంగ నమస్కారం చేయడాన్ని చూసి అక్కడున్న రైతులు, మహిళలు బ్రహ్మరథం పట్టారు. అనంతరం ప్రాజెక్టు తొలి విడత పూర్తి చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రాజెక్టు పైలాన్‌ను సీఎం ఆవిష్కరించారు.
- వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ అందుబాటులోకి రావడంతో ప్రకాశం, నెల్లూరు మరియు కడప జిల్లాల పరిధిలోని మెట్ట ప్రాంతాలకు మహర్దశ పట్టింది.
- ఈ తొలిదశ ద్వారా సుమారు 1.19 లక్షల ఎకరాల వ్యవసాయ భూములకు పుష్కలంగా సాగునీరు అందుతుంది.
- ఫ్లోరోసిస్ బారిన పడి దశాబ్దాలుగా నరకయాతన అనుభవిస్తున్న దాదాపు 4 లక్షల మంది ప్రజలకు సురక్షితమైన తాగునీరు లభిస్తుంది.
- ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, కడప జిల్లాల పరిధిలోని 30 మండలాలకు చెందిన 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. అలాగే ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలతో సహా దాదాపు 23 లక్షల మంది ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు లభిస్తుంది.
- వెలిగొండ ప్రాజెక్టు ప్రయాణం సుదీర్ఘమైనది. 1996 మార్చి 5న నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడే ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. సరిగ్గా 30 ఏళ్ల తర్వాత, అదే చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రాజెక్టు తొలి దశను స్వయంగా ప్రారంభించి నీటిని విడుదల చేయటం విశేషం.
జలహారతి ప్రదేశానికి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు గిరిజన మహిళలు తమ సాంప్రదాయ పద్ధతిలో ఘన స్వాగతం పలికారు. వేద పండితులు శ్రీశైలం మల్లిఖార్జునస్వామి వారి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలు అందజేసి, స్వామివారి చిత్రపటాన్ని సీఎంకు బహుకరించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

