జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సంజీవని ప్రాజెక్టు అమలు చేయాలి : సీఎం చంచద్రబాబు

జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సంజీవని ప్రాజెక్టును అమలు చేయాలని సీఎం చంద్రబాబు అన్నారు. కుప్పం, చిత్తూరు ఫలితాలతో పక్కాగా కార్యాచరణ రూపొందించాలన్నారు. ఏఐ ఆధారిత ఆరోగ్య సేవలకు అత్యధిక ప్రాధాన్యమివ్వాలన్నారు.

Published on: Aug 26, 2026, 17:55:11 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

వైద్యారోగ్య సేవలు మరింత మెరుగ్గా అందించేందుకు చేపట్టిన సంజీవని ప్రాజెక్టును జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. డిజిటల్ హెల్త్ రికార్డులతో సంజీవని ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అమలైతే వైద్య సేవల్లో అనూహ్య మార్పులు సాధించవచ్చన్నారు. వైద్య సేవల్లో ఏపీని ఇతర రాష్ట్రాలు అనుసరించేలా సంజీవని ప్రాజెక్టును విజయవంతం చేయాలని సీఎం సూచించారు. క్యాంపు కార్యాలయంలో సంజీవని ప్రాజెక్ట్‌పై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్షించారు.

సీఎం చంద్రబాబు రివ్యూ
సీఎం చంద్రబాబు రివ్యూ

కుప్పం నియోజకవర్గం, చిత్తూరు జిల్లాల్లో ఇప్పటికే సంజీవని ప్రాజెక్ట్ అమలుతో ఉత్తమ ఫలితాలు వస్తున్నాయని, వీటిని రాష్ట్రమంతటా అమలు చేసేలా చూడాలన్నారు చంద్రబాబు. రాష్ట్రంలో ప్రతీ కుటుంబం విద్యకు, వైద్యానికే అత్యధికంగా ఖర్చు పెట్టాల్సి వస్తోందని... ఈ వ్యయాన్ని తగ్గించేలా చూసేందుకు సంజీవని వంటి కార్యక్రమాలను తీసుకువస్తున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు. సంజీవని ప్రాజెక్టులో అధికారిక భాగస్వామిగా ఉన్న టాటా ఎండీ సంస్థ వైద్యారోగ్య రంగంలో సరికొత్త ఆవిష్కరణలకు కృషి చేయాలని నిర్దేశించారు.

సంజీవని కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు 90 రోజుల ప్రణాళిక సిద్ధం చేసినట్టు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. బేస్‌లైన్ అధ్యయనం, డిజిటల్ మౌలిక వసతుల ఏర్పాటు, శిక్షణ, సర్టిఫికేషన్, జాతీయ, రాష్ట్ర పోర్టల్స్‌తో ఇంటిగ్రేషన్ వంటి చర్యలు 90 రోజుల ప్రణాళికలో ఉన్నాయని వెల్లడించారు. 28 జిల్లాల్లో వైద్య సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నట్టు వివరించారు.

'ప్రిడెక్టివ్, ప్రివెంటివ్, క్యూరేటివ్, కాస్ట్ ఎఫెక్టివ్‌గా వైద్యసేవలు అందించాలి. వైద్య సేవలు అందించడంతో పాటు ఆహారపు అలవాట్లు, ఆలోచనా విధానం మారేలా చూడాలి. హోమియోపతి, ఆయుర్వేద, యోగా, ప్రాణాయామం, ఇంకా అత్యాధునిక వైద్య విజ్ఞానాన్ని వినియోగించుకోవాలి. ఏఐ డాక్టర్ కూడా విస్తృతంగా వినియోగంలోకి తీసుకురావాలి. డేటాను భద్రపరచడం, గోప్యంగా ఉంచడంతోపాటు... డ్యాష్ బోర్డు సిద్ధం చేయాలి. ఆస్పత్రుల్లో శానిటేషన్ సహా వివిధ ఔట్ సోర్సింగ్ సేవల విషయంలో దృష్టి పెట్టాలి. సమర్థవంతంగా వైద్య సేవలు అందించని ఔట్ సోర్సింగ్ సర్వీస్ ప్రొవైడర్లను తొలిగించేలా ఒక విధానం తీసుకురావాలి. విశ్వాసం పెంచేలా వైద్య సేవలు ఉండాలి. ప్రజల మొబైళ్లకు నేరుగా హెల్త్ అప్డేట్స్ పంపించేలా వ్యవస్థను తీర్చిదిద్దాలి.' అని చంద్రబాబు చెప్పారు.

కుప్పం, చిత్తూరు ప్రాంతాల్లో సంజీవని కార్యక్రమం అమలుతో వచ్చిన ఫలితాలను సమీక్షలో ముఖ్యమంత్రి పరిశీలించారు. ప్రాజెక్టు అమలుతో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నట్టు అధికారులు వివరించారు. చిత్తూరులో నమోదైన ఫలితాల ప్రకారం... హైపర్‌టెన్షన్ కేసుల్లో 56 శాతం కేసులు నియంత్రణలోకి వచ్చినట్టు తేలిందన్నారు. డయాబెటిస్ కేసుల్లో 16 శాతం కేసుల తీవ్రత తగ్గిందన్నారు. అలాగే ప్రైమరీ హెల్త్‌కేర్ సేవల వినియోగంలోనూ గణనీయమైన పెరుగుదల నమోదైనట్టు వెల్లడించారు. సంజీవని సేవలపై పౌరుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు నిర్వహించిన సర్వేలో 91 శాతం మంది సంజీవని సేవల అనంతరం తమ ఆరోగ్యంపై అవగాహన పెరిగిందని చెప్పారు.

స్క్రీనింగ్ నుంచి చికిత్స, ఫాలోఅప్ వరకు ఏఐ ఆధారిత ఆరోగ్య వ్యవస్థను తీర్చిదిద్దుతున్నట్టు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. సమీక్షలో మంత్రి సత్యకుమార్ యాదవ్, వైద్యారోగ్య శాఖ కార్యదర్శి వీరపాండియన్, సంయుక్త కార్యదర్శి రోణంకి గోపాలకృష్ణ, టాటా ఎండీ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More