సెప్టెంబరులో విశాఖ, అనకాపల్లికి గోదావరి జలాలు : సీఎం చంద్రబాబు

వచ్చే రోజుల్లో దేశంలోనే అనకాపల్లి జిల్లా నెంబర్ 1 అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అనకాపల్లి, విశాఖకు గోదావరి నీళ్లను త్వరలోనే తీసుకొస్తామని హామీ ఇచ్చారు.

Published on: Aug 22, 2026, 14:05:39 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అభివృద్ధి అంటే కేవలం భారీ పరిశ్రమలు, పెట్టుబడులు, కంపెనీల ఏర్పాటు మాత్రమే కాదని, పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించడమే నిజమైన అభివృద్ధి అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. 'స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర' కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం ఎ.కోడూరులో చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రజావేదికలో పాల్గొని పలు కీలక విషయాలను ప్రజలతో పంచుకున్నారు.

సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు

సెప్టెంబరులోనే గోదావరి జలాలు

అనకాపల్లి, విశాఖపట్నం ప్రాంతాల తాగునీటి, పారిశ్రామిక అవసరాల కోసం సెప్టెంబరు తొలివారంలోనే గోదావరి జలాలను రప్పించనున్నట్లు సీఎం ప్రకటించారు. జిల్లాలోని ప్రతి చెరువును, రిజర్వాయర్‌ను నింపే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు.

డేటా సెంటర్లపై దుష్ప్రచారం వద్దు

విశాఖ, అనకాపల్లి ప్రాంతాలు భవిష్యత్తులో నాలెడ్జ్ ఎకానమీకి ప్రధాన కేంద్రాలుగా మారబోతున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. విశాఖను మించి అనకాపల్లికి పెట్టుబడులు వస్తున్నాయని, త్వరలోనే ఇది స్టీల్ సిటీగానూ, డేటా సెంటర్ల హబ్‌గానూ రూపాంతరం చెందుతుందని తెలిపారు. సుందరమైన విశాఖకు గూగుల్ డేటా సెంటర్ వస్తోందని, దీనివల్ల లక్షలాది మంది యువతకు ఉద్యోగాలు లభించడంతో పాటు రాష్ట్ర ఆదాయం గణనీయంగా పెరుగుతుందని స్పష్టం చేశారు.

డేటా సెంటర్ ఇంకా ప్రారంభం కాకముందే నీళ్లు ఇంకిపోయాయంటూ కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, ఇటువంటి అభివృద్ధి నిరోధక వ్యాఖ్యలను ప్రజలు నమ్మవద్దని చంద్రబాబు కోరారు.

వికసిత్ భారత్ - 2047 లక్ష్యాలు

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో 2047 నాటికి భారతదేశం ప్రపంచంలోనే అగ్రదేశంగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆ సమయానికి దేశంలో తలసరి ఆదాయం రూ. 50 లక్షల వరకు పెరిగే అవకాశం ఉందన్నారు. ఆరోగ్యకరమైన జీవనానికి పరిశుభ్రత అత్యంత ఆవశ్యకమని పేర్కొంటూ మన ఊరు - మన బాధ్యత అనే సంకల్పాన్ని ప్రతి ఒక్కరూ తీసుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

గత ఐదేళ్ల పాలనలో పేరుకుపోయిన చెత్తను తొలగించే ప్రక్రియ వేగవంతమైందని, ప్రతి గ్రామాన్ని జీరో వేస్ట్ పంచాయతీగా మార్చడమే లక్ష్యమని సీఎం చెప్పారు. అందుకోసం ప్రతి గ్రామానికి స్వచ్ఛ రథాలు పంపుతున్నట్లు వెల్లడించారు. ఇంటిపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకుంటే రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా విద్యుత్ పొందే అవకాశం ఉంటుందని సూచించారు.

'చెత్త నుంచి కంపోస్ట్, కరెంట్, గ్యాస్ ఉత్పత్తి చేస్తున్నాం. ప్రతీ గ్రామం జీరో వేస్ట్ పంచాయతీగా తయారుకావాలి. ఆడబిడ్డల కోసం మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. రాబోయే రోజుల్లో మూడు గ్యాస్ సిలిండర్ల డబ్బులను 4 నెలలకోసారి జమం చేస్తాం. ఇండక్షన్ స్టవ్‌లు పెట్టుకుంటే గ్యాస్‌తో కూడా అంత పని ఉండదు.' అని చంద్రబాబు అన్నారు.

వైసీపీ అరాచకాన్ని నమ్ముకుందని సీఎం చంద్రబాబు అన్నారు. ఐదేళ్లు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని విమర్శించారు. కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలు తీశారని చెప్పారు. చాలా చోట్ల భూములు కబ్జా చేశారన్నారు. వైసీపీ తప్పులను సరిదిద్దడానికి మూడేళ్లు పట్టిందన్నారు. డీఎస్సీలో ఎటువంటి అవకతవకలు జరగలేదన్నారు.

ప్రజావేదిక కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు నారాయణ, కొల్లు రవీంద్ర, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభిరామ్ సహా పలువురు ముఖ్య నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More