Oh Sukumari Review: ఓ సుకుమారి రివ్యూ- భార్యను ముట్టుకుంటే కరెంట్ షాక్- ఐశ్వర్య రాజేష్, తిరువీర్ కామెడీ మూవీ ఎలా ఉందంటే?
Oh Sukumari Review And Rating In Telugu: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ జంటగా నటించిన సరికొత్త విలేజ్ కామెడీ డ్రామా 'ఓ సుకుమారి'. భార్యను ముట్టుకుంటే కరెంట్ షాక్ కొట్టే వినూత్నమైన కాన్సెప్ట్‌తో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి ఓ సుకుమారి రివ్యూలో తెలుసుకుందాం.
Oh Sukumari Movie Review In Telugu And Rating: 'మసూద' చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్లో నటుడిగా గట్టి ముద్ర వేసుకున్న తిరువీర్, సీనియర్ హీరో వెంకటేష్ సరసన 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రంతో అలరించిన ఐశ్వర్య రాజేష్ మొదటిసారి జోడీగా నటించిన చిత్రం 'ఓ..! సుకుమారి'.

భరత్ దర్శన్ దర్శకత్వంలో గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వర రెడ్డి నిర్మించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య జూలై 17, 2026న అంటే ఇవాళ థియేటర్లలోకి వచ్చింది. హీరోయిన్‌ను ముట్టుకుంటే కరెంట్ షాక్ కొడుతుందనే క్రేజీ ఐడియాతో సాగే ఈ కామెడీ డ్రామా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో నేటి ఓ సుకుమారి రివ్యూలో తెలుసుకుందాం.
అసలు కథేంటంటే?
నరాల యాదగిరి (తిరువీర్) తన సొంత పల్లెటూరిలో సర్పంచ్ అవ్వాలని ఆశపడుతాడు. అతని తాత రాసిన విచిత్రమైన వీలునామా ప్రకారం.. యాదగిరికి లేదా అతని బాబాయ్ కొడుక్కి ఎవరికైనా సరే మొదట మగబిడ్డ పుడితేనే వారి కుటుంబానికి 80 కోట్ల విలువైన ఆస్తి దక్కుతుంది. ఈ క్రమంలో ఒక పెళ్లి చూపుల దగ్గర దామిని (ఐశ్వర్య రాజేష్)ని చూసి యాదగిరి మనసు పారేసుకుంటాడు. వెంటనే పెళ్లి ప్రపోజల్ పెడతాడు.
అయితే దామినికి ఒక వింత సమస్య ఉంటుంది. ఆమెను ఎవరు తాకిన వారికి కరెంట్ షాక్ కొడుతుంది. దామిని వల్ల నిత్యం ఇబ్బందులు పడుతున్న ఆ ఊరి జనాలు ఎవరికీ నిజం చెప్పకుండా, ఎలాగోలా యాదగిరితో పెళ్లి జరిపిస్తారు. పెళ్లయి శోభనం రాత్రి యాదగిరికి ఈ షాకింగ్ నిజం తెలుస్తుంది. ఆ తర్వాత యాదగిరి ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు? సర్పంచ్ ఎలా అయ్యాడు? వారిద్దరూ ఎలా కలిసి జీవించారు? యాదగిరి తాత ఆస్తిని దక్కించుకున్నాడా? అనే ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ.
విశ్లేషణ:
ఇలాంటి స్టోరీ ఇప్పటివరకు తెలుగులో ఎప్పుడు రాలేదని చెప్పాలి. ముట్టుకుంటే కరెంట్ షాక్ కొట్టడం, అలాంటి అమ్మాయితో పెళ్లి, వివాహం బంధం, పిల్లలు కనడం వంటి విషయాలు ఎలా సాధ్యం అవుతాయ్ అనే విషయాలు ప్రతి ఒక్కరికి ఇంట్రెస్టింగ్ కలిగించే అంశాలు.
అందుకే ఓ సుకుమారి టీజర్, ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే, పేపర్‌పై రాసుకున్నంత ఇంట్రెస్టింగ్‌గా సీన్లు ఇంకాస్తా క్యూరియాసిటీ తెప్పించేలా ఉంటే సినిమా మరో స్థాయిలో ఉండేది. దామినికి కరెంట్ షాక్ సమస్య, యాదగిరి ప్రేమ,పెళ్లి విషయాలు అన్ని ఆసక్తికరంగానే సాగుతాయి.
సరదాగా సాగే ఫస్టాఫ్
మొదటి భాగంలో ఊరి ప్రజలు దామిని నిజాన్ని దాచడానికి పడే తపన, పెళ్లి జరిగే వరకు సాగే కొన్ని డ్రామా సీన్లు సరదాగా సాగుతాయి. హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్లు కూడా బాగున్నాయి. ఇక ప్రథమార్ధంలో కొంతవరకు హాస్యంతో నడిపించినప్పటికీ, ద్వితీయార్థం మాత్రం చాలా నెమ్మదిగా, సాగదీతగా అనిపిస్తుంది.
సినిమాలోని రొటీన్ ఫ్యామిలీ డ్రామా, సర్పంచ్ ఎన్నికల చుట్టూ తిరిగే సన్నివేశాలు కాస్తా బోర్ తెప్పిస్తాయి. ఐశ్వర్య రాజేష్ కొన్ని సన్నివేశాలలో తెలంగాణ యాసలో మాట్లాడుతూ, పదే పదే 'ఉచ్చు' అనే పదాన్ని వాడటం వినే కొద్దీ కొంత చిరాకు కలిగిస్తుంది. హాస్యం కూడా చాలా సీన్లలో బలవంతంగా రుద్దినట్టుగా అనిపిస్తుంది. బలమైన ఎమోషన్స్ లేకపోవడం వల్ల క్లైమాక్స్ కూడా సాధారణంగా ముగిసిపోతుంది. కొన్ని విషయాల్లో క్లారిటీ ఇవ్వకపోవడం మైనస్ అనుకోవచ్చు.
సాంకేతిక విభాగం
దర్శకుడు భరత్ దర్శన్ రాసుకున్న కాన్సెప్ట్ బాగున్నా, బలహీనమైన స్క్రీన్‌ప్లే కారణంగా దానిని సరిగ్గా నిరూపించుకోలేకపోయారు. భరత్ మంచిరాజు అందించిన సంగీతం బాగుంది. పాటలు ఆకట్టుకున్నాయి. సిహెచ్ కుషేందర్ కెమెరా పనితనం బాగుంది. అయితే శ్రీ వరప్రసాద్ ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త కత్తిరింపులు చేసి ఉంటే సినిమా వేగం పెరిగేది. నిర్మాణ విలువలు మాత్రం సినిమాకు తగినట్లు రిచ్‌గా ఉన్నాయి.
ఐశ్వర్య, తిరువీర్ నటన
ఇక ఓ సుకుమారి సినిమాకు ప్రధాన ఆకర్షణ ఐశ్వర్య రాజేష్ నటన. కరెంట్ షాక్ ఇచ్చే వింత సమస్యతో బాధపడే దామిని పాత్రలో ఆమె చాలా చురుగ్గా, చాలా సహజంగా యాక్ట్ చేసి మెప్పించింది. ఫైటింగ్ సీన్లతో క్లాప్స్ కొట్టేంచేలా చేసింది ఐశ్వర్య రాజేష్. గుడిలో వచ్చే యాక్షన్ సీన్ సినిమాకు ప్లస్ అయింది.
తిరువీర్ పల్లెటూరి అమాయక యాదగిరి పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ముఖ్యంగా పెళ్లి తర్వాత శోభనం సీన్లలో ఆమెను ముట్టుకోగానే అతను ఎగిరి పడే దృశ్యాలు థియేటర్లలో నవ్వులు పూయిస్తాయి. సపోర్టింగ్ పాత్రలలో ఆమని, ఆనంద్, విష్ణు ఓయ్ తమ పరిధి మేరకు నటించి అలరించారు.
చివరిగా చెప్పాలంటే..
"ఒక మంచి వినూత్నమైన కథాంశం ఉన్నప్పటికీ, బలహీనమైన కథనం కారణంగా 'ఓ..! సుకుమారి' సాధారణ కామెడీ డ్రామాగా మిగిలిపోయిందనుకోవచ్చు. తిరువీర్, ఐశ్వర్య రాజేష్ నటన కోసం, అక్కడక్కడా వచ్చే కొన్ని కామెడీ సీన్ల కోసం ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లలో ఓ సుకుమారి సినిమాను ఫ్యామిలీ చూసేయొచ్చు.
రేటింగ్: 2.75/5
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


