Sign in

Dhamaal 4 Trailer: దెయ్యాలు, పులులు, మొసళ్లు, 2 డాల్ఫిన్ల మధ్య హీరో అజయ్ దేవగన్- నవ్వుల ఖజానాగా ధమాల్ 4 ట్రైలర్ అదుర్స్!

Dhamaal 4 Trailer Released: బాలీవుడ్ ఐకానిక్ కామెడీ ఫ్రాంచైజీ 'ధమాల్' నుంచి నాలుగో భాగం సిద్ధమైంది. అజయ్ దేవగన్, అర్షద్ వార్సి, రితేష్ దేశ్‌ముఖ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ధమాల్ 4 ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా నవ్విస్తోంది. సెల్ఫ్ ట్రోలింగ్‌తో అజయ్ దేవగన్ తన మార్క్ కామెడీ పండించాడు.

Published on: Jun 13, 2026, 09:24:09 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Dhamaal 4 Trailer Released: సినిమా ఏదైనా.. థియేటర్లలో నవ్వులు పూయించే అవుట్ అండ్ అవుట్ కామెడీ చిత్రాలకు తెలుగు ప్రేక్షకుల్లో ఎప్పుడూ ఉండే క్రేజ్ ప్రత్యేకమైనది. 'వెంకీ', 'ఢీ' లాంటి సినిమాలను మనవాళ్లు ఎలాగైతే ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారో.. బాలీవుడ్‌లో 'ధమాల్' సిరీస్‌కు కూడా ఇక్కడ భారీ ఫ్యాన్ బేస్ ఉంది.

దెయ్యాలు, పులులు, మొసళ్లు, 2 డాల్ఫిన్ల మధ్య హీరో అజయ్ దేవగన్- నవ్వుల ఖజానాగా ధమాల్ 4 ట్రైలర్ అదుర్స్!
దెయ్యాలు, పులులు, మొసళ్లు, 2 డాల్ఫిన్ల మధ్య హీరో అజయ్ దేవగన్- నవ్వుల ఖజానాగా ధమాల్ 4 ట్రైలర్ అదుర్స్!

ఐకానిక్ ఫ్రాంచైజీ

ఇన్నాళ్లుగా ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ ఐకానిక్ ఫ్రాంచైజీ నుంచి నాలుగో భాగం 'ధమాల్ 4' (Dhamaal 4) నవ్వించేందుకు రెడీ అయింది. తాజాగా చిత్ర మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన ధమాల్ 4 అల్టిమేట్ కామెడీ ట్రైలర్‌ను విడుదల చేశారు.

జూన్ 12న విడుదలైన ధమాల్ 4 ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇటీవల అక్షయ్ కుమార్ నటించిన 'వెల్‌కమ్ టు ది జంగిల్' ట్రైలర్ వచ్చిన కొద్దిరోజులకే ఈ మరో క్రేజీ కామెడీ ప్రాజెక్ట్ ప్రేక్షకుల ముందుకు రావడం విశేషం.

ధమాల్ 4 ట్రైలర్

గతంలో వచ్చిన 'ధమాల్', 'డబుల్ ధమాల్', 'టోటల్ ధమాల్' చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించడమే కాకుండా, బుల్లితెరపై, యూట్యూబ్‌లోనూ మిలియన్ల కొద్దీ వీక్షణలతో దూసుకుపోయాయి. ఇప్పుడు అదే క్రేజీ కాంబినేషన్‌ను దర్శకుడు ఇంద్ర కుమార్ మరింత భారీ స్థాయిలో వెండితెరకు ఎక్కించారు.

ఈసారి కథ మొత్తం ఒక రహస్యమైన లంకెబిందెలు లేదా బంగారు నిధి (Treasure Hunt) చుట్టూ తిరుగుతుందని ధమాల్ 4 ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. 'ఆర్ఆర్ఆర్' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన అజయ్ దేవగన్ ఈ చిత్రంలో తన మార్క్ కామెడీ టైమింగ్‌తో ఇరగదీశారు.

నిధి కోసం క్రేజీ వేట..

ధమాల్ 4 ట్రైలర్ ప్రారంభంలోనే అజయ్ దేవగన్, అర్షద్ వార్సి ఒక దెయ్యాల ఇంట్లోకి అడుగుపెట్టడం, అక్కడ కాలింగ్ బెల్ నొక్కగానే కరెంట్ షాక్ కొట్టే సీన్‌తోనే నవ్వులు మొదలవుతాయి. ఆ తర్వాత అజయ్, రితేష్ దేశ్‌ముఖ్, జావేద్ జాఫ్రీ, అర్షద్ వార్సి అంతా కలిసి ఒక హ్యూమన్ చైన్‌లా మారి, చెట్టుకు వేలాడుతున్న ఉపేంద్ర లిమాయే అనే క్యారెక్టర్‌ను నిధి ఎక్కడుందో చెప్పమని అడుగుతారు.

అయితే అతను పూర్తి వివరాలు చెప్పకుండానే లోయలో పడిపోవడంతో, అసలు గందరగోళం మొదలవుతుంది. ఆ బంగారు కొండను దక్కించుకోవడానికి ఈ గ్యాంగ్ చేసే విన్యాసాలు థియేటర్లలో నవ్వుల పండగ తెచ్చేలా ఉన్నాయి.

'జాక్ స్పారో'గా రవి కిషన్!

ఈ నిధి వేటలో భాగంగా సముద్ర ప్రయాణాలు, పైరేట్ షిప్ హంగామా వంటి సీన్లు ఆకట్టుకుంటున్నాయి. తెలుగులో 'రేసుగుర్రం' సినిమాలో మద్దాలి శివారెడ్డిగా అలరించిన స్టార్ నటుడు రవి కిషన్, ఈ చిత్రంలో హాలీవుడ్ ప్రసిద్ధ క్యారెక్టర్ 'జాక్ స్పారో' గెటప్‌లో కనిపించి సర్‌ప్రైజ్ చేశారు.

మొసళ్లతో ఫైట్ చేయడం, సముద్రపు తుఫానులను తట్టుకోవడం, దెయ్యాల బంగ్లాలో ఇరుక్కోవడం, పులులు వేటాడం వంటి ఎన్నో ఫాంటసీ సన్నివేశాలను మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో విజువల్ వండర్‌గా స్క్రీన్‌పై చూపించనున్నారు.

ఓల్డ్ ఈజ్ గోల్డ్.. సెల్ఫ్ ట్రోలింగ్‌తో అజయ్ దేవగన్

ట్రైలర్ చివర్లో అజయ్ దేవగన్ తన పాత సినిమాలపైనే సెల్ఫ్ ట్రోలింగ్ వేసుకోవడం హైలైట్‌గా నిలిచింది. తన డెబ్యూ సినిమా 'ఫూల్ ఔర్ కాంటే'లో రెండు బైక్‌లపై కాళ్లు పెట్టి నిలబడే ఐకానిక్ స్టంట్‌ను, ఈ సినిమాలో రెండు డాల్ఫిన్ చేపలపై చేసి చూపించారు. కానీ ఆ స్టంట్ కాస్త వికటించి ఆయనకు దెబ్బలు తగలడంతో ట్రైలర్ ముగుస్తుంది.

ఈ సినిమాలో అజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ ఈషా గుప్తా నటిస్తుండగా, ఆమె ఇద్దరు పిల్లల తల్లిగా కనిపించనుంది. సంజయ్ మిశ్రా, సంజీదా షేక్, అంజలి దినేష్ ఆనంద్ ఇతర కీలక పాత్రలు పోషించారు.

మేము వండిన కామెడీ

"దాదాపు రెండు దశాబ్దాలుగా ప్రేక్షకులు ధమాల్ సిరీస్‌పై చూపిస్తున్న ప్రేమ అపూర్వమైనది. ఈ నాలుగో భాగంలో మేము వండిన కామెడీ అంతకు మించి ఉంటుంది" అని రితేష్ దేశ్‌ముఖ్ సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని పంచుకున్నారు.

బాక్సాఫీస్ వద్ద భారీ క్లాష్‌లను తట్టుకుని నిలబడేందుకు వీలుగా 'ధమాల్ 4' విడుదలను జూలై 10, 2026కి ఖరారు చేశారు. ఈ క్రేజీ కామెడీ ఎంటర్‌టైనర్‌ను టి-సిరీస్, దేవగన్ ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More