Weather Alert : మార్చి మెుదట్లోనే భానుడి భగభగలు.. 40 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు!

Weather Alert : తెలుగు రాష్ట్రాల్లో మార్చి మెుదటి వారంలోనే ఎండలు దంచికొడుతున్నాయి. 11 దాటితే బయటకు వెళ్తే చుక్కలు కనిపిస్తున్నాయి. 40 డిగ్రీల చేరువకు ఉష్ణోగ్రతలు వస్తున్నాయి.

Published on: Mar 05, 2026 8:54 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మార్చి నుంచి ఆంధ్రప్రదేశ్‌లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఏప్రిల్, మే నెలల్లో దీని తీవ్రత ఎప్పటిలాగే గరిష్ట స్థాయికి చేరుకుంటుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ(APSDMA) హెచ్చరించింది. మార్చి ప్రారంభం నుండి వేడి పరిస్థితులు తీవ్రం కావడం ప్రారంభించాయని APSDMA మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖార్ జైన్ అన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

'రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఏప్రిల్, మే నెలలు తీవ్రంగా ఉండవచ్చు. వేడిగాలులు వచ్చే అవకాశం ఉంది.' అని ప్రఖార్ జైన్ వెల్లడించారు.

శ్రీకాకుళం, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో మార్చిలో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా. గుంటూరు, బాపట్ల, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన వేడిగాలులు వీచే అవకాశం ఉంది. అధికారులు పరిస్థితిని 24 గంటలూ పర్యవేక్షిస్తున్నారు. జిల్లా యంత్రాంగాలను రెండు రోజుల ముందుగానే వడగాలుల పరిస్థితుల గురించి అప్రమత్తం చేస్తున్నారు. ప్రాణనష్టం జరగకుండా చూసుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.

వేడి సంబంధిత సమాచారం, సహాయం కోసం ప్రజలు రాష్ట్ర కంట్రోల్ రూమ్ నంబర్లు - 112, 1070, 18004250101లను సంప్రదించాలని అధికారులు సూచించారు. APSDMA కాలానుగుణంగా వేడిగాలుల హెచ్చరికలను జారీ చేస్తుంది. మధ్యాహ్నం సమయంలో వేడిగాలులకు గురికాకుండా ఉండాలని, తేలికపాటి కాటన్ దుస్తులను ధరించాలని, గొడుగులు తీసుకెళ్లాలని, నీరు, ఓఆర్ఎస్, మజ్జిగ లేదా కొబ్బరి నీటితో హైడ్రేటెడ్ గా ఉండాలని పౌరులను కోరింది. గర్భిణులు, శిశువులు, పిల్లలు, వృద్ధులు వీలైనంత వరకు ఇంటి లోపల ఉండాలని అధికారులు సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లోని చాలా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40కి చేరువయ్యాయి.

తెలంగాణలోనూ ఎండలు

తెలంగాణలోనూ ఎండలు మార్చి మెుదట్లోనే భయపెడుతున్నాయి. సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం 25 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 37 డిగ్రీలకు పైగా నమోదు అయ్యాయి. హైదరాబాద్‌- 36.6 డిగ్రీలు, అత్యధికంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో 37.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇక రెండుమూడు రోజుల్లో 40 డిగ్రీలను ఉష్ణోగ్రతలు తాకే అవకాశం ఉంది. ఏప్రిల్, మే నెలలో ఎండల తీవ్రత సాధారణంగా పెరుగుతుంది. అయితే ఈసారి మార్చి నెలలోనే ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు కానున్నాయి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More