టెట్రా ప్యాక్‌లు, సాషేలలో మద్యం విక్రయాలా? కేంద్రం, రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు
టెట్రా ప్యాకెట్లు, సాషేలలో మద్యం విక్రయాలను నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్‌పై నాలుగు వారాల్లోగా సమాధానం చెప్పాలని కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. పండ్ల రసాల మాదిరిగా కనిపించే ప్యాకింగ్‌ల వల్ల చిన్నపిల్లలు, యువత పొరబడే ప్రమాదముందని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
న్యూఢిల్లీ: టెట్రా ప్యాకెట్లు, ప్లాస్టిక్ సాషేలలో మద్యం విక్రయాలను నిషేధించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన పిటిషన్ (పిల్) పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంపై నాలుగు వారాల్లోగా తమ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వంతో పాటు వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది.

జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ ఆర్. మహాదేవన్, జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. ప్రతివాదుల కౌంటర్ దాఖలు చేసిన తర్వాత సమాధానం ఇచ్చేందుకు పిటిషనర్‌కు రెండు వారాల సమయం ఇచ్చిన న్యాయస్థానం, తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది.
పండ్ల రసాల్లా ప్యాకింగ్: ఎన్జీవో ఆందోళన
'కమ్యూనిటీ ఎగైనెస్ట్ డ్రంకన్ డ్రైవింగ్' (CADD) అనే స్వచ్ఛంద సంస్థ ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది. ఎన్జీవో తరఫున సీనియర్ అడ్వకేట్ విపిన్ నాయర్ వాదనలు వినిపిస్తూ.. దేశంలోని దాదాపు 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో టెట్రా ప్యాకెట్లలో మద్యం విక్రయిస్తున్నారని కోర్టుకు తెలిపారు. 'చిల్లీ మ్యాంగో వోడ్కా' వంటి పేర్లతో, ఆకర్షణీయమైన పండ్ల చిత్రాలతో ఈ ప్యాకెట్లు లభిస్తున్నాయని, ఇవి చూసేందుకు సాధారణ జ్యూస్ ప్యాకెట్లలాగే కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. మద్యం శాతాన్ని అతి చిన్న అక్షరాలతో ముద్రిస్తున్నారని, దీనివల్ల ప్రజలు ముఖ్యంగా యువత పొరబడి మద్యానికి బానిసలయ్యే ప్రమాదం ఉందన్నారు.
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తించేలా సమగ్ర ఎక్సైజ్ విధానాన్ని రూపొందించాలని పిటిషనర్ కోరారు. 'బాట్లింగ్' అనే పదానికి కేవలం గాజు సీసాలు లేదా స్పష్టంగా గుర్తించగలిగే పాత్రలకు మాత్రమే పరిమితమయ్యేలా ఎక్సైజ్ చట్టాలు, నిబంధనలను సవరించేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
పరిశ్రమ వాదన: 21 ఏళ్లుగా కొనసాగుతున్న వ్యాపారం
ఇదే సమయంలో, పేపర్ ఆధారిత కార్టన్ ప్యాకేజింగ్ పరిశ్రమకు ప్రాతినిధ్యం వహిస్తున్న 'యాక్షన్ అలయన్స్ ఫర్ రీసైక్లింగ్ బెవరేజ్ కార్టన్స్' (AARC) ఈ కేసులో తానూ భాగస్వామిగా చేరింది. ఈ సంస్థ తరఫున సీనియర్ అడ్వకేట్ అరవింద్ దాతార్ వాదనలు వినిపిస్తూ.. పిల్ పేరుతో కాగితపు కార్టన్ ప్యాకేజింగ్ పరిశ్రమను ప్రత్యక్షంగా లక్ష్యంగా చేసుకున్నారని తెలిపారు.
దేశంలో గత 21 ఏళ్లుగా అసెప్టిక్ పేపర్ కార్టన్లలో మద్యం విక్రయాలకు చట్టబద్ధమైన అనుమతి ఉందని AARC కోర్టుకు తెలిపింది. కర్ణాటకలో 2005 నుంచి, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో 2014 నుంచి ఈ పద్ధతి అమలులో ఉందని పేర్కొంది. ప్రస్తుతం భారతదేశంలో ఏడాదికి సుమారు 1,000 కోట్ల (10 బిలియన్) టెట్రా ప్యాకెట్ల మద్యం విక్రయాలు జరుగుతున్నాయని, ఈ పరిశ్రమపై వేలాదిమంది ఉపాధి, భారీ పెట్టుబడులు ఆధారపడి ఉన్నాయని ధర్మాసనానికి విన్నవించింది. సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న చట్టబద్ధమైన విధానాన్ని ఒక్కసారిగా రద్దు చేస్తే పారిశ్రామికంగా తీవ్ర నష్టం వాటిల్లుతుందని వాదించింది. AARC వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, వారిని ఈ కేసులో ప్రతివాదిగా చేర్చుకునేందుకు అనుమతించింది.
వయోపరిమితి తనిఖీ, హోమ్ డెలివరీపై నిబంధనలు
మద్యం విక్రయ కేంద్రాల వద్ద కస్టమర్ల వయస్సును తప్పనిసరిగా తనిఖీ చేసేందుకు కఠినమైన నిబంధనలు, ప్రోటోకాల్ రూపొందించాలని కోరుతూ సదరు ఎన్జీవో దాఖలు చేసిన మరో పిటిషన్‌పై కూడా కేంద్రం, రాష్ట్రాల స్పందనను సుప్రీంకోర్టు కోరింది. దీనిపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కార్యాలయానికి పిటిషన్ కాపీని అందజేయాలని సూచించింది.
చట్టప్రకారం నిర్ణీత వయస్సు కంటే తక్కువ ఉన్నవారికి మద్యం విక్రయించకూడదనే నిబంధన ఉన్నప్పటికీ, అమ్మకపు కేంద్రాల వద్ద వయస్సును తనిఖీ చేసే కచ్చితమైన వ్యవస్థ లేదని పిటిషనర్ ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే మద్యానికి సంబంధించి ఇంటి వద్దకే డెలివరీ (హోమ్ డెలివరీ) చేసే విధానాన్ని వ్యతిరేకించారు. దీనివల్ల చిన్నవయస్కులు సులభంగా తాగుడు బారినపడే అవకాశం ఉందన్నారు.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


