భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద మృతి.. మిస్టరీగా మారిన ఘటన!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది.

Updated on: Sep 24, 2026, 09:58:53 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులూరుపాడు మండలం వెంగన్నపాలెంలో 18 ఏళ్ల బీఎస్సీ (నర్సింగ్) మొదటి సంవత్సరం విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఖమ్మం సమీపంలోని కొణిజర్ల దగ్గర ఉన్న ఒక ప్రైవేట్ నర్సింగ్ కళాశాల హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్న ఆ యువతి, ఇటీవల ఒక బంధువు అంత్యక్రియలకు హాజరయ్యేందుకు సొంతూరుకు వచ్చింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

చదువులో ఎంతో చురుగ్గా ఉంటూ, భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో అడుగులు వేస్తున్న ఆ యువతి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఈ ఘోరం జరిగింది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఆమె తల్లి పనిమీద బయటకు వెళ్లగా, ఇంట్లో ఎవరూ లేరు. సాయంత్రం తల్లి తిరిగి వచ్చేసరికి ఇంట్లో కూతురు కనిపించలేదు. ఆందోళనకు గురైన ఆమె చుట్టుపక్కల వారితో కలిసి వెతకగా.. ఇంటి వెనక వైపు ఉన్న బాత్రూమ్ వద్ద ఆ విద్యార్థిని మృతదేహం లభ్యమైంది.

సంఘటనా స్థలాన్ని పరిశీలించిన వారికి అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. మృతురాలి ముక్కు నుంచి రక్తం కారడం, మెడ భాగంలో స్పష్టమైన గాయాల గుర్తులు ఉండటంతో పాటు, ఆమెను చున్నీతో దాదాపు మీటరు దూరం వరకు నేలపై ఈడ్చుకెళ్లిన ఆనవాళ్లు కనిపించడం హత్య కోణంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి.

ఈ విషాద ఘటన వెనక ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేసిన ఒక యువకుడి హస్తం ఉందనే బలమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం, పక్కింట్లోనే నివాసముంటుండే ఒక యువకుడు గత మూడేళ్లుగా ఆ అమ్మాయిని ప్రేమించాలంటూ తీవ్రంగా వేధిస్తున్నాడు. తన లక్ష్యం చదువు మాత్రమేనని స్పష్టం చేస్తూ ఆ యువతి అతని ప్రతిపాదనను పలుమార్లు తిరస్కరించింది.

వేధింపులు ఎక్కువ కావడంతో గతంలో తల్లి ఊరి పెద్దలను ఆశ్రయించింది. ఊరి పెద్దలు సదరు యువకుడిని పిలిచి గట్టిగా హెచ్చరించినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. పెద్దల హెచ్చరికలను పెడచెవిన పెట్టి ఈ ఘాతుకానికి ఒడిగట్టాడనే అనుమానంతో బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంఘటనా స్థలానికి చేరుకున్న జులూరుపాడు సర్కిల్ ఇన్ స్పెక్టర్ పి. శ్రీలక్ష్మి నేతృత్వంలోని పోలీస్ బృందం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం కొత్తగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించింది. 'కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో సమగ్ర విచారణ జరుపుతున్నాం. శాస్త్రీయ ఆధారాల కోసం క్లూస్ టీమ్ వేలిముద్రలను సేకరించింది. మరణానికి గల కచ్చితమైన కారణాలు పోస్టుమార్టం నివేదిక వచ్చాకే స్పష్టమవుతాయి.' అని ఎస్సై పి. శ్రీలక్ష్మి తెలిపారు.

అనుమానితుడైన యువకుడిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకుని తీవ్రంగా విచారిస్తున్నట్లు సమాచారం. తన బిడ్డను అత్యంత దారుణంగా పొట్టనబెట్టుకున్న దోషులను కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More