...
...
Next Story

AP Rajya Sabha Elections 2026 : టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు - లిస్టులో చింతకాయల విజయ్‌ పేరు

AP Rajya Sabha Elections 2026 : ఏపీ రాజ్యసభ ఎన్నికల అభ్యర్థులపై టీడీపీ కీలక ప్రకటన చేసింది. ముగ్గురు అభ్యర్థులను ప్రకటించింది. జనసేన తరఫున లింగమనేని రమేష్ నామినేషన్ వేశారు.

Published on: Jun 07, 2026 06:23 AM IST
Advertisement

AP Rajya Sabha Elections 2026 : రాజ్యసభ ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లను తమ అభ్యర్థులుగా టీడీపీ అధిష్ఠానం ఖరారు చేసింది. ఆంధ్రప్రదేశ్ లోని అధికార ఎన్డీయే కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈ కీలక ప్రకటన వెలువడింది. కూటమి ఒప్పందంలో భాగంగా మొత్తం నాలుగు స్థానాలకు గాను తెలుగుదేశం పార్టీ మూడు స్థానాల్లో, జనసేన పార్టీ ఒక స్థానంలో పోటీ చేయాలని నిర్ణయించారు.

టీడీపీ అభ్యర్థులు ఖరారు
టీడీపీ అభ్యర్థులు ఖరారు

ఈ ఎన్నికల్లో భాగంగా శనివారం జనసేన పార్టీ తరఫున ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. దీంతో ఏపీ నుంచి కూటమి తరఫున బరిలో నిలిచే నలుగురు అభ్యర్థులపై స్పష్టత వచ్చేసింది. అసెంబ్లీలో కూటమికి ఉన్న భారీ బలం దృష్ట్యా ఈ నలుగురి ఎన్నిక కేవలం ఏకగ్రీవ ప్రక్రియే కానుంది.

సామాజిక సమీకరణాలు, పార్టీ విధేయతలకు ప్రాధాన్యం ఇస్తూ అభ్యర్థులను ఎంపిక చేసింది. ముందునుంచి ప్రముఖంగా వినిపించిన చింతకాయల విజయ్ పేరు తుది జాబితాలో ఉంది. ఈయన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడి కుమారుడు. గత కొన్ని సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ డిజిటల్ విభాగాన్ని, సోషల్ మీడియా వ్యూహాలను విజయ్ వెనుకుండి నడిపించారు. గత కొన్ని ఎన్నికల నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ లభించకపోయినప్పటికీ…. పార్టీ పట్ల ఆయన చూపిన నిబద్ధత, సంస్థాగత సేవల దృష్ట్యా ఈసారి పెద్దల సభకు వెళ్లే అవకాశం దక్కిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఏపీలో రాజ్యసభ ఎన్నికలు - అభ్యర్థులు

  1. భాష్యం రామకృష్ణ - టీడీపీ
  2. సానా సతీశ్‌ - టీడీపీ
  3. చింతకాయల విజయ్‌ - టీడీపీ
  4. లింగమనేని రమేష్ - జనసేన

జూన్ 18వ తేదీన దేశంలోని 10 రాష్ట్రాల పరిధిలో ఉన్న 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు ఎగువ సభలో పార్టీల బలాబలాలను మార్చివేయనున్నాయి.

ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న 24 రాజ్యసభ స్థానాల్లో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల నుంచి నాలుగు చొప్పున స్థానాలు ఉన్నాయి. అలాగే రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి మూడు చొప్పున, జార్ఖండ్ నుంచి రెండు స్థానాలు ఉన్నాయి. వీటితో పాటు అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, మణిపూర్, మేఘాలయ రాష్ట్రాల నుంచి ఒక్కో స్థానానికి ఎన్నికలు నిర్వహిస్తున్నారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe