...
...
Next Story

మహిళల కోసం ప్రత్యేక టెక్ పార్క్.. ఉచితంగా భూమి, ప్రోత్సాహకాలు

మహిళల రాజకీయ, ఆర్థిక భాగస్వామ్యం మరింత పెరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మహిళా సాధికారతకు ప్రత్యేక టెక్ పార్క్, ఉచిత భూమి, ప్రోత్సాహకాలు అందించనున్నట్టుగా చెప్పారు.

Published on: Nov 12, 2026, 20:42:46 IST
By , Visakhapatnam
Prefer HTon Google
Advertisement

మహిళలు రాజకీయంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లోనూ సమాన భాగస్వాములుగా ఎదిగినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మహిళల భాగస్వామ్యం రాజకీయ, ఆర్థిక రంగాల్లో 50 శాతానికి మించినప్పుడే తనకు సంపూర్ణ సంతృప్తి కలుగుతుందని అన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా టెక్ పార్క్ ఏర్పాటు చేసి, ఉచితంగా భూమితో పాటు అవసరమైన ప్రోత్సాహకాలు అందిస్తామని ప్రకటించారు. విశాఖపట్నంలో సీఐఐ భాగస్వామ్య సదస్సులో భాగంగా నిర్వహించిన ‘ఉమెన్ అండ్ గ్రోత్ సమ్మిట్’లో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు.

విశాఖపట్నం సీఐఐ సమ్మిట్
విశాఖపట్నం సీఐఐ సమ్మిట్

‘ది ఉమెన్ హూ విల్ షేప్ ది నెక్స్ట్ ఎకానమీ: లీడర్‌షిప్, క్యాపిటల్, అంబిషన్’ అనే థీమ్‌తో జరిగిన ఈ సదస్సులో కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ, సీఐఐ ప్రతినిధులు, అలయన్స్ ఫర్ గ్లోబల్ గుడ్ సభ్యులు, పారిశ్రామికవేత్తలు, మహిళా నాయకులు పాల్గొన్నారు.

దేశ ఆర్థిక వ్యవస్థను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్థంగా నడిపించడం మహిళా సామర్థ్యానికి నిదర్శనమన్నారు చంద్రబాబు. స్థానిక సంస్థల్లో 50 శాతం మహిళలకు ప్రాతినిధ్యం కల్పించామని, అత్యంత విద్యావంతులైన మహిళలకు మేయర్లు, చైర్‌పర్సన్లు, జెడ్పీ చైర్‌పర్సన్లుగా అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో ఐదు స్థానాలు మహిళలకు లభించినప్పటికీ, తాము ఎనిమిది మంది మహిళలకు మేయర్లుగా అవకాశం కల్పించామని చెప్పారు. విశాఖ మేయర్ కూడా మహిళేనని గుర్తుచేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో మహిళా స్వయం సహాయక సంఘాలు సాధించిన విజయాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రంలో 1.13 కోట్ల మంది మహిళలు స్వయం సహాయక సంఘాల సభ్యులుగా ఉన్నారని, ఈ సంఘాల వద్ద రూ.30 వేల కోట్ల కార్పస్ ఫండ్ ఉందని తెలిపారు. ప్రస్తుతం ఈ సంఘాలు దాదాపు రూ.లక్ష కోట్ల టర్నోవర్ సాధిస్తున్నాయని వెల్లడించారు. డ్వాక్రా మహిళలు తాము తీసుకున్న రుణాల్లో 99.6 శాతం తిరిగి చెల్లిస్తున్నారని, మహిళలకు ఆర్థిక క్రమశిక్షణ, వ్యాపార నిర్వహణ సామర్థ్యం ఎంతగా ఉన్నాయో ఇది తెలియజేస్తోందన్నారు.

మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు అందిస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. వచ్చే దావోస్ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఐదుగురు మహిళా పారిశ్రామికవేత్తలు హాజరయ్యేలా ప్రభుత్వం సహకరిస్తుందని ప్రకటించారు. రాష్ట్రంలో 54 చేనేత క్లస్టర్లు ఉన్నాయని, వీటిలో అనేక క్లస్టర్లు మహిళా సంఘాల నేతృత్వంలో పనిచేస్తున్నాయని చెప్పారు. మహిళా పారిశ్రామికవేత్తలు మరింతగా ఎదిగేందుకు అవసరమైన అన్ని విధాలా ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అటు ప్రకృతి వ్యవసాయంలోనూ మహిళలు అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నారని ముఖ్యమంత్రి అన్నారు. రైతులకు శిక్షణ ఇవ్వడం నుంచి ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించడం వరకు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు.

మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని మహిళలు అన్ని రంగాల్లోనూ ముందుకు రావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. గతంలో ఐటీ గురించి ఎక్కువగా మాట్లాడేవాడినని, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఎక్కువగా ప్రస్తావిస్తున్నానని చెప్పారు. డేటా సెంటర్లు, క్వాంటం టెక్నాలజీ, స్పేస్, డ్రోన్లు, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ల రంగాల్లో ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన పురోగతి సాధించే దిశగా అడుగులు వేస్తోందన్నారు. తిరుపతిని సెమీకండక్టర్ల తయారీ కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామని, గ్లోబల్ డిజైన్ క్యాపిటల్‌గా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు.

సదస్సులో మాట్లాడిన సీఐఐ ప్రెసిడెంట్ సుచిత్రా ఎల్లా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వాన్ని ప్రశంసించారు. హైదరాబాద్‌కు ఐటీ రంగాన్ని తీసుకురావడంలో, ఆంధ్రప్రదేశ్‌ను బయోటెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ రంగాల్లో ముందంజలో నిలపడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారని అన్నారు. 1996లో హైదరాబాద్‌లో భారత్ బయోటెక్ సంస్థను స్థాపించడానికి చంద్రబాబు అందించిన మార్గదర్శకత్వం, ప్రోత్సాహం ఎంతో ఉపయోగపడ్డాయని గుర్తుచేశారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks