Tirumala Pushpayagam 2026 : కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబరు 16వ తేదీన పుష్పయాగ మహోత్సవాన్ని అత్యంత శాస్త్రోక్తంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ఏర్పాట్లు చేస్తోంది.
ఈనెల 15న అంకురార్పణ…

స్వామివారికి జరిగే సేవల్లో తెలిసీ తెలియక జరిగే లోపాలకు ప్రాయశ్చిత్తంగా ప్రతీ ఏడాదీ శ్రీవారి బ్రహ్మోత్సవాలు పూర్తయిన తర్వాత కార్తీక మాసంలో ఈ పుష్పయాగాన్ని నిర్వహించడం ఒక ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా నవంబరు 15వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు పుష్పయాగానికి వైభవంగా అంకురార్పణ ఘట్టాన్ని పూర్తి చేయనున్నారు.
మరుసటి రోజు…. అంటే నవంబర్ 16న పుష్పయాగం రోజున ఉదయం శ్రీవారి ఆలయంలో నిత్యం నిర్వహించే రెండవ అర్చన, రెండవ గంట, నైవేద్యం కార్యక్రమాలను ముందుగా పూర్తి చేస్తారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి ఉత్సవమూర్తులను సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణమండపానికి వేంచేపు చేస్తారు.
అక్కడ ఉత్సవమూర్తులకు పవిత్ర స్నపన తిరుమంజనం వేడుకగా జరుగుతుంది. ఈ విశేష అభిషేకంలో భాగంగా స్వామి అమ్మవార్లకు పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు మొదలైన సుగంధద్రవ్యాలతో అర్చకులు పరమ పవిత్రంగా తిరుమంజనం నిర్వహిస్తారు.
ఆ తర్వాత మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 5 గంటల వరకు కన్నుల పండువగా వివిధ రకాల సుగంధ పుష్పాలు, పత్రాలతో మలయప్పస్వామివారికి పుష్పయాగాన్ని నిర్వహిస్తారు. వివిధ ప్రాంతాల నుంచి తెప్పించిన టన్నుల కొద్దీ వికసించిన పువ్వులతో స్వామివారిని అలంకరించే ఈ దృశ్యం భక్తులకు ఆధ్యాత్మిక పరవశాన్ని కలిగిస్తుంది. ఆపై సాయంత్రం వేళ సహస్రదీపాలంకార సేవ పూర్తయిన తర్వాత శ్రీ మలయప్పస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దివ్య దర్శనమిస్తారు.
పలు సేవలు రద్దు….
పుష్పయాగ మహోత్సవం సందర్భంగా నవంబర్ 16వ తేదీన ఆలయంలో జరిగే కొన్ని నిత్య ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. ఆ రోజున కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం వంటి ఆర్జిత సేవలు జరగవు. శ్రీవారి పుష్పయాగ వేడుకలను పురస్కరించుకుని భక్తులు ఈ మార్పులను గమనించి తమ తిరుమల ప్రయాణ ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని దేవస్థానం అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.