గొర్రెలు కాస్తున్న బాలుడి కన్నీటి గాథ.. వీడియోపై స్పందించిన మంత్రి నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్‌లో గొర్రెలు కాస్తున్న బాలుడికి సంబంధించిన వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. దీనిపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు.

Published on: Oct 1, 2026, 15:43:28 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

పసి వయసులో బడికెళ్లి అక్షరాలు దిద్దాల్సిన ఓ చిన్నారి, చేతిలో కర్ర పట్టుకుని ఆకలితో అడవి బాటపట్టాడు. "నన్ను ఇంటికి తీసుకెళ్లండి.. అమ్మా నన్ను కాపాడు" అంటూ ఆ పసివాడు కార్చిన కన్నీళ్లు సోషల్ మీడియాను కుదిపేశాయి. ప్రకాశం జిల్లాలో గొర్రెల కాపరిగా నరకం అనుభవిస్తున్న ఎనిమిదేళ్ల రామయ్య అనే బాలుడి దీనస్థితిపై తీసిన వీడియో వైరల్ అయింది. దీనిపై మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందించారు. బాలుడిని సురక్షితంగా కాపాడి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

బాలుడి వీడియో వైరల్
బాలుడి వీడియో వైరల్

ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం రచవారిపాలెం సమీపంలో గొర్రెలు కాస్తూ ఎనిమిది సంవత్సరాల రామయ్య అనే బాలుడు కనిపించాడు. ఎండలో నడుస్తూ, తీవ్ర ఆకలితో రోదిస్తున్న ఆ చిన్నారిని చూసి స్థానికులు విచారించగా గుండెతరుక్కుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

తనకు సరిగ్గా తిండి పెట్టడం లేదని, దెబ్బలు కొడుతున్నారని ఆ బాలుడు ఏడుస్తూ చెప్పాడు.తాను శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నర్రావాడ గ్రామానికి చెందినవాడనని ఆ చిన్నారి తెలిపాడు. 'మా అమ్మకు ఫోన్ చేసి చెప్పండి.. నన్ను ఇక్కడి నుంచి మా ఇంటికి తీసుకెళ్లండి.' అంటూ ఆ పసివాడు అభ్యర్థించిన తీరు ప్రతి ఒక్కరినీ తీవ్రంగా చలించిపోయేలా చేసింది.

ఈ దృశ్యాలను కొందరు వీడియో తీసి, సోషల్ మీడియా వేదికగా మంత్రి నారా లోకేష్‌కు ట్యాగ్ చేస్తూ సహాయం చేయాలని కోరారు. సోషల్ మీడియా ద్వారా ఈ వీడియో మంత్రి నారా లోకేష్ దృష్టికి రాగానే ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పసిపిల్లలతో బాలకార్మిక వ్యవస్థను ప్రోత్సహించడం, వారిని వేధించడం తీవ్ర నేరమని పేర్కొన్నారు.

మంత్రి వెంటనే నెల్లూరు జిల్లా కలెక్టర్‌తో పాటు ప్రకాశం జిల్లా అధికారులను ఆదేశించారు. బాలుడు ఉన్న ప్రాంతాన్ని వెంటనే గుర్తించి, అతడిని సురక్షితంగా రక్షించాలన్నారు. చిన్నారికి తక్షణమే మంచి ఆహారం, వైద్య పరీక్షలు అందించి, సంరక్షణ కేంద్రంలో రక్షణ కల్పించాలని చెప్పారు.

చిన్నారిని బలవంతంగా మేకల కాపరిగా మార్చడం వెనుక ఉన్న బాధ్యులు ఎంతటివారైనా సరే వారిపై బాలకార్మిక నిరోధక చట్టం మరియు బాలల సంరక్షణ చట్టాల కింద కఠిన కేసులు నమోదు చేయాలని నారా లోకేశ్ అన్నారు. ఈ ఘటన బాలకార్మిక వ్యవస్థ పట్ల ఆందోళన కలిగిస్తోంది. చిన్నతనంలోనే పేదరికం, కుటుంబ పరిస్థితులు లేదా దళారుల మాయమాటల వల్ల అనేకమంది పిల్లలు ఇలాంటి నరకాన్ని అనుభవిస్తున్నారు. చిన్నారి రామయ్య ఉదంతంలో ప్రభుత్వం వేగంగా స్పందించడం పట్ల సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More