...
...
Next Story

తిరుమల : సింహ వాహనసేవలో కళా వైభవం.. 8 రాష్ట్రాల నుంచి 19 కళాబృందాలు

తిరుమల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పలు రాష్ట్రాలకు చెందిన కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయి.

Published on: Sep 17, 2026, 14:27:48 IST
Advertisement

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం వైభవంగా జరిగిన సింహ వాహనసేవలో వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు తమ సంప్రదాయ, జానపద కళారూపాలను ప్రదర్శించి భక్తులను విశేషంగా అలరించారు. స్వామివారి వాహనసేవకు కళాకారుల ప్రదర్శనలు భక్తిభావాన్ని, సాంస్కృతిక వైభవాన్ని మరింత ఇనుమడింపజేశాయి.

తిరుమల బ్రహ్మోత్సవాలు
తిరుమల బ్రహ్మోత్సవాలు

టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కళాబృందాలు పాల్గొన్నాయి. మొత్తం 19 కళాబృందాలకు చెందిన 494 మంది కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించారు.

శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల కళాకారులు దశావతారాలు, భరతనాట్యం, కథక్, కూచిపూడి వంటి శాస్త్రీయ నృత్య ప్రదర్శనలతో భక్తులను ఆకట్టుకున్నారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో గౌరసూర్ బోద్/చౌ, జానపద నృత్యాలు, డ్రమ్స్, కోలాటం తదితర సంప్రదాయ కళారూపాలను ప్రదర్శించారు. అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో చౌలియా, మేవశిరాస్, జానపద నృత్యం, గోందల్ నృత్యం వంటి వైవిధ్యభరిత సంప్రదాయ కళారూపాలు కనువిందు చేశాయి.

దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో తాళములతో జానపద నృత్యం, డ్రమ్స్, నవదుర్గలు, శ్రీరామ చరితం, కోలాటం తదితర కళారూపాలను కళాకారులు ప్రదర్శించారు.

శ్రీవారి సింహ వాహనసేవలో 19 కళాబృందాలకు చెందిన 494 మంది కళాకారులు పాల్గొని తమ అద్భుతమైన కళా ప్రదర్శనలతో భక్తులను ఆకట్టుకున్నారు. వివిధ రాష్ట్రాల సంప్రదాయ కళారూపాలు తిరుమలలో భక్తి, కళ, భారతీయ సంస్కృతుల సమ్మేళనాన్ని ఆవిష్కరించాయి.

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల సందర్భంగా భక్తులను అలరిస్తూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన కళాకారులను గుర్తించి, ప్రతిరోజూ ఉత్తమ ప్రదర్శన ఇచ్చిన కళా బృందాలకు సన్మానం చేయాలని టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా గురువారం సింహ వాహనసేవ సందర్భంగా శ్రీవారి ఆలయ మాడ వీధుల్లో వివిధ రాష్ట్రాల కళాకారులు ప్రదర్శించిన సంప్రదాయ, జానపద కళారూపాలను ఈవో తిలకించారు.

కళాకారుల ప్రతిభను పరిశీలించి హిందూ ధర్మ ప్రచార పరిషత్, శ్రీ అన్నమాచార్య ప్రాజెక్టు, దాస సాహిత్య ప్రాజెక్టు, ఎస్.వి. కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డాన్స్ నుంచి ఉత్తమ ప్రదర్శన ఇచ్చిన నాలుగు కళా బృందాల ప్రతినిధులను అభినందించి సన్మానించారు.

ఈ సందర్భంగా ఈవో ముద్దాడ రవిచంద్ర మాట్లాడుతూ, శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సంప్రదాయ, జానపద కళారూపాలను ప్రదర్శించేందుకు కళాకారులకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. కళాకారుల ప్రదర్శనలు భక్తుల్లో భక్తిభావాన్ని పెంపొందించడంతో పాటు, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, కళా వైభవంపై అవగాహన కల్పిస్తున్నాయని చెప్పారు.

వాహన సేవల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన కళా బృందాలను గుర్తించి తగిన గౌరవం కల్పించడం ద్వారా రాబోయే బ్రహ్మోత్సవాల్లో కళాకారులు మరింత నాణ్యమైన, వైవిధ్యభరితమైన, ఆకట్టుకునే ప్రదర్శనలు అందించేందుకు ప్రోత్సాహం లభిస్తుందని ఈవో తెలిపారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల ఆధ్యాత్మిక అనుభూతిని మరింత పెంచేలా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఈవో తెలిపారు. దేశంలోని వివిధ రాష్ట్రాల కళారూపాలకు తిరుమలలో వేదిక కల్పించడం ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల వైభవాన్ని భక్తులకు పరిచయం చేస్తున్నామని చెప్పారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks