Tirumala Brahmotsavam 2026 : తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల షెడ్యూల్ విడుదల - ముఖ్య తేదీలు
Tirumala Brahmotsavam 2026 : అధికమాసం కారణంగా ఈ ఏడాది తిరుమలలో రెండు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వీఐపీ బ్రేక్ దర్శనాలతో పాటు ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఏర్పాట్లపై అదనపు ఈవో సమీక్ష నిర్వహించారు.
Tirumala Brahmotsavam 2026 : కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రంలో ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించబోయే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఈ ఏడాది అధికమాసం రావడం వల్ల తిరుమల కొండపై రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు.

ఈ నేపథ్యంలో, నిర్దేశిత సమయంలోపు అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేయాలని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు. తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో ఉన్న సుధర్మ సమావేశ మందిరంలో గురువారం ఆయన జేఈవో డాక్టర్ ఏ. శరత్, సీవీఎస్వో మురళీకృష్ణలతో కలిసి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విభాగాల వారీగా చేపట్టాల్సిన పనులపై దిశానిర్దేశం చేశారు.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు - ముఖ్య తేదీలు
ఈ ఏడాది జరిగే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సంబంధించిన కీలక తేదీల షెడ్యూల్‌ను టీటీడీ అధికారికంగా ప్రకటించింది.
- 08-09-2026 : కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
- 14-09-2026 : శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
- 15-09-2026 : ధ్వజారోహణం
- 19-09-2026 : అత్యంత ప్రతిష్టాత్మకమైన గరుడ వాహన సేవ
- 22-09-2026 : రథోత్సవం
- 23-09-2026 : చక్రస్నానం
బ్రహ్మోత్సవాల సమయంలో ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు, మళ్లీ సాయంత్రం 7 గంటల నుండి 9 గంటల వరకు వాహన సేవలు వేడుకగా సాగుతాయి.
సామాన్య భక్తులకే పెద్దపీట… దర్శనాల రద్దు
బ్రహ్మోత్సవ రోజుల్లో తిరుమలకు పోటెత్తే సామాన్య భక్తులకు సర్వదర్శనం వేగంగా కల్పించేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రొటోకాల్ ప్రముఖులకు మినహా మిగిలిన వారందరికీ వీఐపీ బ్రేక్ దర్శనాలను పూర్తిగా రద్దు చేశారు. దీనితో పాటు వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లిదండ్రులు, ఎన్ఆర్ఐలు,దాతలకు కేటాయించే ప్రత్యేక దర్శన ప్రివిలేజ్‌లను కూడా బ్రహ్మోత్సవాల కాలంలో తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అదనపు ఈవో స్పష్టం చేశారు. సామాన్య భక్తుల రక్షణ, సౌకర్యార్థం విజిలెన్స్, పోలీస్ విభాగాలు సమన్వయంతో పనిచేసి పటిష్ట భద్రతను ఏర్పాటు చేయాలని సూచించారు.
గరుడ సేవకు ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు
బ్రహ్మోత్సవాలలోనే అత్యంత ముఖ్యమైన గరుడ సేవను వీక్షించేందుకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఘాట్ రోడ్లలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా రవాణా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందులో భాగంగా 18-09-2026 రాత్రి 9 గంటల నుండి 20-09-2026 ఉదయం 6 గంటల వరకు తిరుమల ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలను పూర్తిగా నిరాకరించారు. భక్తుల వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక రోడ్ మ్యాప్‌లు, పార్కింగ్ స్థలాలను సిద్ధం చేయాలని రవాణా విభాగాన్ని ఆదేశించారు.
భక్తులకు వసతులు, అన్నప్రసాద వితరణ
మాడ వీధుల్లోని గ్యాలరీల్లో గంటల తరబడి వేచి ఉండే భక్తుల కోసం నిరంతరాయంగా అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గ్యాలరీల్లోని మరుగుదొడ్లను నిరంతరం శుభ్రంగా ఉంచేందుకు అదనపు పారిశుధ్య సిబ్బందిని నియమించనున్నారు. అలాగే, స్వామివారి ప్రసాదమైన లడ్డూల కొరత రాకుండా భక్తుల రద్దీకి అనుగుణంగా బఫర్ స్టాక్ నిల్వలను ఉంచాలని సరఫరా విభాగానికి సూచించారు.
తిరుమలకు విచ్చేసే యువతీ యువకులను శ్రీవారి సేవకులుగా ఆహ్వానించి… వారి ద్వారా భక్తులకు మెరుగైన సేవలు అందించాలని నిర్ణయించారు. తిరుమల పరిసరాలను భక్తులను ఆకట్టుకునేలా విద్యుత్ దీపాల అలంకరణలతో పాటు, ఫల పుష్ప ప్రదర్శనలను అద్భుతంగా తీర్చిదిద్దాలని ఇంజనీరింగ్, తోటల విభాగాన్ని ఆదేశించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

