తిరుమల బ్రహ్మోత్సవాలు : సర్వభూపాల వాహనంపై స్వామివారి అభయం
Tirumala Brahmotsavams 2026 : తిరుమలలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం రాత్రి మలయప్పస్వామి సర్వభూపాల వాహనంపై అభయమిచ్చారు.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు శుక్రవారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు సర్వభూపాల వాహనంపై గజేంద్ర మోక్ష అలంకారంలో భక్తులకు అభయమిచ్చారు. మాడ వీధుల్లో అంగరంగ వైభవంగా సాగిన ఈ వాహనసేవలో వివిధ రాష్ట్రాల కళాబృందాలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు గజేంద్ర మోక్ష అలంకారంలో దర్శనమిచ్చిన శ్రీమలయప్పస్వామివారిని కనులారా దర్శించుకుని భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.
సర్వభూపాల అంటే అందరు రాజులు అని అర్థం. ఇందులో అష్టదిక్పాలకులు కూడా ఉంటారు. తూర్పున ఇంద్రుడు, ఆగ్నేయంలో అగ్ని, దక్షిణంలో యముడు, నైరుతిలో నిరృతి, పశ్చిమాన వరుణుడు, వాయువ్యంలో వాయువు, ఉత్తరాన కుబేరుడు, ఈశాన్యంలో పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా విరాజిల్లుతారు.
అష్టదిక్పాలకులంతా శ్రీమహావిష్ణువును తమ భుజస్కంధాలపై, హృదయంలో కొలువుంచి సేవిస్తారనే భావనకు సర్వభూపాల వాహనం ప్రతీకగా నిలుస్తుంది. శ్రీమలయప్పస్వామివారి అనుగ్రహంతో రాజ్యపాలన సుభిక్షంగా సాగి, ప్రజలు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఈ వాహనసేవ చాటిచెబుతుంది.
ఈ వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, పలువురు బోర్డు సభ్యులు, అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి, సీవీఎస్వో కే.వి. మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
కనులపండువగా సాంస్కృతిక ప్రదర్శనలు
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు శుక్రవారం రాత్రి సర్వభూపాల వాహన సేవలో దేశంలోని వివిధ ప్రాంతాల సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించేలా 9 రాష్ట్రాల నుంచి 20 కళాబృందాలకు చెందిన 527 మంది కళాకారులు పాల్గొన్నారు. గాన, వాద్య, నృత్య ప్రదర్శనలతో శ్రీవారిని కీర్తిస్తూ వాహన సేవకు మరింత శోభను చేకూర్చారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, కేరళ, పంజాబ్, ఒడిశా, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాలకు చెందిన కళాబృందాలు తమ సంప్రదాయ కళారూపాలను ప్రదర్శించాయి. సర్వభూపాల వాహన సేవలో భరతనాట్యం, కూచిపూడి, మోహినీయట్టం, ఒడిస్సీ, కథక్, పేరిణి శివతాండవం, మణిపురి తదితర శాస్త్రీయ నృత్యరూపాలు భక్తులను ఆకట్టుకున్నాయి. కళాకారులు తమ అద్భుతమైన నృత్యాభినయంతో భారతీయ శాస్త్రీయ కళా వైభవాన్ని ఆవిష్కరించారు.
భాంగ్రా, కోలాటం, లెజిమ్, నౌర్టా, బస్తర్ గిరిజన నృత్యం వంటి జానపద, గిరిజన కళారూపాలతో పాటు నవదుర్గ నృత్యం, దశావతార రూపకం, శ్రీకృష్ణ లీలలు తదితర ప్రదర్శనలు భక్తులను విశేషంగా అలరించాయి. మహారాష్ట్రకు చెందిన డ్రమ్స్, లెజిమ్ విన్యాసాలు, కేరళ డ్రమ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వివిధ వాయిద్యాల లయబద్ధమైన విన్యాసాలతో తిరుమాడ వీధులు మార్మోగాయి.
వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన కళాకారులు తమ ప్రాంతీయ సంప్రదాయాలు, జానపద కళలు, శాస్త్రీయ నృత్యాలను శ్రీవారి వాహన సేవలో ప్రదర్శించడంతో తిరుమలలో భారతీయ కళా, సాంస్కృతిక వైవిధ్యం ఆవిష్కృతమైంది. గాన, వాద్య, నృత్య కళారూపాల సమ్మేళనంతో సర్వభూపాల వాహన సేవ కనులపండువగా సాగింది. స్వామివారి దివ్యదర్శనంతో పాటు వివిధ రాష్ట్రాల కళా వైభవాన్ని వీక్షించిన భక్తులు ఆధ్యాత్మిక ఆనందాన్ని, సాంస్కృతిక అనుభూతిని ఏకకాలంలో పొందారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


