తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగింపు - వైభవోపేతంగా చక్రధారుడి చక్రస్నానం

Tirumala Srivari Brahmotsavam 2026 : తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు చక్రస్నాన మహోత్సవంతో అంగరంగ వైభవంగా ముగిశాయి. శ్రీవారి పుష్కరిణిలో సుదర్శన చక్రత్తాళ్వార్లకు అవభృథస్నానం నిర్వహించగా, వేలాదిమంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు.

Published on: Sep 23, 2026, 13:27:37 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Tirumala Srivari Brahmotsavam 2026 : కలియుగ ప్రత్యక్ష దైవం, ఏడుకొండలవాడైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు బుధవారం అత్యంత భక్తిశ్రద్ధల నడుమ, వైభవంగా ముగిశాయి. గత తొమ్మిది రోజులుగా తిరుగిరులను ఆధ్యాత్మిక శోభతో ముంచెత్తిన ఈ ఉత్సవాలకు ముగింపు ఘట్టంగా చివరి రోజు ఉదయం శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం (అవభృథం) మహోత్సవాన్ని కన్నులపండువగా నిర్వహించారు. ఈ పవిత్ర వేడుకను కళ్లారా వీక్షించి, పుష్కరిణి జలాల్లో పుణ్యస్నానాలు ఆచరించేందుకు దేశం నలుమూలల నుంచి విశేష సంఖ్యలో భక్తజనం తిరుమలకు పోటెత్తారు.

చక్రస్నానం
చక్రస్నానం

శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం

చక్రస్నానానికి ముందుగా తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటల వరకు స్వామివారికి సర్వభూపాలకమైన పల్లకీ ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం ఉదయం 6 నుంచి 9 గంటల మధ్య శ్రీ భూవరాహస్వామివారి ఆలయ ముఖమండపం ప్రాంగణంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారితో పాటు శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపన తిరుమంజన ఘట్టాన్ని వైఖానస ఆగమోక్తంగా పూర్తి చేశారు.

ఈ వేడుకలో భాగంగా అర్చకులు విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, ముఖప్రక్షాళన, ధూపదీప నైవేద్యం, ఛత్రచామరాది రాజోపచారాలను శాస్త్రోక్తంగా సమర్పించారు. అనంతరం పాలు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధం తదితర సుగంధ ద్రవ్యాలతో శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభధారణల ద్వారా స్వామి అమ్మవార్లకు, సుదర్శన చక్రత్తాళ్వార్లకు మంత్రపూర్వకంగా దివ్యాభిషేకం చేశారు.

వేద మంత్ర ఘోషతో ఆధ్యాత్మిక పరిమళం…..

స్నపన తిరుమంజనం జరుగుతున్న సమయమంతా తిరుమల గిరులు వేద మంత్రోచ్చారణలతో ప్రతిధ్వనించాయి. టీటీడీ వేదపారాయణదారులు అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపనిషత్తు, దశశాంతి, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, విష్ణుసూక్తం తదితర పంచసూక్తాలను లయబద్ధంగా పారాయణం చేశారు. అభిషేకం పూర్తయిన తర్వాత శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి సమక్షంలో దివ్య ప్రబంధ పాశురాల పఠనం సాగింది.

తొమ్మిది రోజుల పాటు సాగిన బ్రహ్మోత్సవాల మహాక్రతువులో నిర్వహించిన సమస్త వాహన సేవలు, కైంకర్యాలు సఫలమై, లోకక్షేమం, భక్తుల సుఖశాంతులు కలగాలని చక్రస్నానం నిర్వహించడం అనవాయితీగా వస్తోంది. ఆగమ శాస్త్రం ప్రకారం బ్రహ్మోత్సవాలు ఒక మహా యజ్ఞస్వరూపం. ఈ యజ్ఞం ముగింపులో నిర్వహించే అవభృథస్నానం ద్వారా ఉత్సవ నిర్వహణలో ఏవైనా తెలిసీ తెలియక జరిగిన లోపాలు, దోషాలు ఉంటే అవి తొలగిపోయి, క్రతువుకు సంపూర్ణ ఫలం చేకూరుతుందని పండితులు వివరించారు.

స్నపన తిరుమంజన కార్యక్రమం ముగిసిన వెంటనే శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లను అర్చకులు వేదమంత్రాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి పుష్కరిణికి తీసుకువచ్చి పవిత్ర జలాల్లో మునక వేయించారు. సుదర్శన చక్రత్తాళ్వార్ల దివ్య స్పర్శతో పుష్కరిణి జలాలు అత్యంత పావనమయ్యాయని విశ్వసిస్తూ, సరిగ్గా అదే శుభముహూర్తంలో తీరంలో వేచి ఉన్న వేలాది మంది భక్తులు "గోవిందా.. గోవిందా.." అంటూ స్మరిస్తూ భక్తిపారవశ్యంతో పుణ్యస్నానాలు ఆచరించారు.

ఈ చక్రస్నాన మహోత్సవాన్ని దర్శించిన, నిర్వహించిన మరియు ఉత్సవాల విజయవంతానికి సహకరించిన భక్తులందరికీ ఆ శ్రీ వేంకటేశ్వరస్వామివారి సంపూర్ణ బ్రహ్మోత్సవ యజ్ఞఫలం లభించాలని వైఖానస పండితులు ప్రార్థించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More