ఏపీఈపీడీసీఎల్‌లో మొత్తం 2,947 పోస్టులు ఖాళీ.. త్వరలో నోటిఫికేషన్ విడుదల

విద్యుత్ శాఖలో ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. విద్యుత్ శాఖలో కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

Published on: Feb 19, 2026 4:18 PM IST
By , Amaravati
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్(APEPDCL) పరిధిలో ఖాళీగా ఉన్న వివిధ కేటగిరీల పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రకటించారు. గురువారం అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ ఈ కీలక ప్రకటన చేశారు.

ఏపీఈపీడీసీఎల్‌ జాబ్స్
ఏపీఈపీడీసీఎల్‌ జాబ్స్

ఏపీఈపీడీసీఎల్ పరిధిలో మొత్తం 2,947 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటి వివరాలను మంత్రి సభకు వెల్లడించారు. ఎనర్జీ అసిస్టెంట్లు 581, జూనియర్ లైన్‌మెన్ 1,260, అసిస్టెంట్ లైన్‌మెన్ 1,084, లైన్‌మెన్ 22 పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 8,770 మంది అవుట్ సోర్సింగ్ సిబ్బందితో విధులను నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. విద్యుత్ శాఖలో ఏఈలు, లైన్ మెన్ల కొరత లేకుండా ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.

రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు లో-వోల్టేజ్ సమస్యలు లేకుండా, నాణ్యమైన విద్యుత్తును నిరంతరాయంగా అందించాలన్నదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధాన లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. ఆ లక్ష్యానికి అనుగుణంగానే ఇంధన శాఖ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పునరుద్ఘాటించారు. విద్యుత్ లోడ్ ఆధారంగా అవసరమైన చోట కొత్త సబ్ స్టేషన్లను మంజూరు చేస్తున్నామని, అదేవిధంగా ఎలక్ట్రికల్ డీఈ కార్యాలయాలను కూడా ఏర్పాటు చేస్తున్నామని శాసనసభలో సభ్యులకు మంత్రి గొట్టిపాటి వివరించారు.

22,30,730 ఉచిత వ్యవసాయ కనెక్షన్లు

రాష్ట్రవ్యాప్తంగా 22,30,703 ఉచిత వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అసెంబ్లీలో ప్రకటించారు. ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అడిగిన ప్రశ్నకు మంత్రి గొట్టిపాటి రవి కుమార్ సమాధానం ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న ఉచిత విద్యుత్ తో పాటు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లపై వివరాలు వెల్లడించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మూడు డిస్కంల పరిధిలో 1,02,538 కొత్త ఉచిత వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. అయితే మరో 46 వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు పెండింగ్ లో ఉన్నాయని తెలిపిన మంత్రి గొట్టిపాటి.. వచ్చే వ్యవసాయ సీజన్ నాటికి పెండింగ్‌లో ఉన్న కనెక్షన్లను కూడా మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

రైతులకు ఉచిత విద్యుత్ అందించేందుకు 2025-26 ఆర్థిక సంవత్సరంలో మూడు డిస్కంల పరిధిలో రూ.839.44 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు మంత్రి గొట్టిపాటి. పీఎం కుసుమ్ పథకం కింద రాష్ట్రంలో ఇప్పటివరకు 2,61,481 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. ఫీడర్ లెవల్ సోలార్ ప్రాజెక్టుల అమలుతో విద్యుత్ కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వానికి రూ.1059 కోట్లు ఆదా అవుతుందని పేర్కొన్నారు.

మే నుంచి సోలార్ ప్లాంట్ల నిర్మాణ

11 కేవీ లైన్ల దగ్గర సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని, దీని ద్వారా వినియోగదారులకు 25 సంవత్సరాల పాటు ఒకే విధమైన టారిఫ్‌తో విద్యుత్ అందించవచ్చని మంత్రి గొట్టిపాటి తెలిపారు. ఫీడర్ లెవల్ సోలార్ ప్రాజెక్టుల కోసం భూ సేకరణ జరుగుతోందని, 1035 మెగావాట్ల సామర్థ్యానికి టెండర్లు పిలిచినట్లు వెల్లడించారు. రాబోయే మే నెల నుంచి సోలార్ ప్లాంట్ల నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని మంత్రి స్పష్టం చేశారు.

'2028-30 నాటికి 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఫీడర్ లెవల్ సోలార్ ప్లాంట్లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే రైతులకు ఉదయం వేళల్లోనే 9 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించగలం. గృహ, పారిశ్రామిక, వ్యాపార వర్గాలతో పాటు రైతులకు కూడా నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ అందించడమే రాష్ట్ర విద్యుత్ శాఖ లక్ష్యం.'అని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More