తిరుమలలో జూన్ 26 నుంచి 28వ తేదీ వరకు సాలకట్ల జ్యేష్టాభిషేకం.. ఆర్జిత సేవ‌లు ర‌ద్దు

తిరుమలలో జూన్ 26 నుంచి 28వ తేదీ వరకు జ్యేష్టాభిషేకం జరగనుంది. దీంతో తిరుమల తిరుపతిదేవస్థానం ఆర్జిత సేవ‌లు ర‌ద్దు చేసింది.

Published on: Jun 25, 2026, 17:57:01 IST
By , Tirumala
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

జూన్ 26 నుండి 28వ‌ తేదీ వరకు తిరుమల‌లోని శ్రీవారి ఆలయంలో సాలకట్ల జ్యేష్టాభిషేకం జ‌రగ‌నుంది. ప్రతి సంవత్సరం జ్యేష్టమాసంలో జ్యేష్టా నక్షత్రానికి ముగిసేట్లుగా మూడురోజుల‌పాటు తిరుమల‌ శ్రీవారికి జ్యేష్టాభిషేకం నిర్వహిస్తారు. సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణ మండపంలో నిర్వహించే ఈ క్రతువును ‘’అభిద్యేయక అభిషేకం’’ అని కూడా అంటారు. తరతరాలుగా అభిషేకాల‌తో అత్యంత ప్రాచీనములైన స్వామివారి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా పరిరక్షించేందుకు ఈ ఉత్సవాన్ని ఏర్పాటు చేశారు.

తిరుమల తిరుపతి దేవస్థానం
తిరుమల తిరుపతి దేవస్థానం

మొదటిరోజు శ్రీ మలయప్పస్వామివారికి ఉన్న బంగారు కవచాన్ని తీసివేసి, హోమాలు, అభిషేకాలు పంచామృత స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఆ తర్వాత శ్రీ స్వామివారికి వజ్రకవచం అలంకరిస్తారు. రెండో రోజు ముత్యాల‌ కవచం సమర్పిస్తారు. మూడో రోజు తిరుమంజనాదులు పూర్తిచేసి, బంగారు కవచాన్ని పునః సమర్పిస్తారు. ఈ బంగారు కవచాన్ని మళ్లీ వచ్చే ఏడాది జ్యేష్టాభిషేకం సమయంలోనే తీస్తారు. అంతవరకు సంవత్సరం పొడవునా శ్రీవారు బంగారు కవచంతోనే వివిధ ఉత్సవాల్లో పాల్గొంటారు.

జ్యేష్టాభిషేకాన్ని పుర‌స్కరించుకుని జూన్ 28వ తేదిన కళ్యాణోత్సవం, ఊంజ‌ల్ సేవ‌, ఆర్జిత బ్రహ్మోత్సవ సేవ‌ల‌ను టీటీడీ ర‌ద్దు చేసింది.

పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక తెప్పోత్సవాలు జూన్ 25 నుండి 29వ తేదీ వరకు ఐదు రోజులపాటు అత్యంత వైభవంగా జరుగుతాయి. ప్రతిరోజూ సాయంత్రం 6.30 గంటల నుండి రాత్రి 7.30 గంటల వరకు పద్మసరోవరంలో సుందరంగా అలంకరించిన తెప్పలపై విహరిస్తూ శ్రీ పద్మావతి అమ్మవారు భక్తులకు దివ్య దర్శనమివ్వనున్నారు.

జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు జరిగే ఈ పవిత్ర తెప్పోత్సవాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకుంటే భక్తుల కష్టాలు తొలగి, దైవానుగ్రహంతో సుఖశాంతులు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.

భక్తులను కాపాడే పద్మావతి అమ్మవారు

పద్మసరోవరంలోని బంగారు పద్మం నుండి అవతరించిన శ్రీ పద్మావతి అమ్మవారు జగజ్జననిగా భక్తులను అన్ని కష్టాల నుండి కాపాడి, సుఖశాంతులు ప్రసాదిస్తారనే ఆధ్యాత్మిక సందేశాన్ని తెప్పోత్సవాలు తెలియజేస్తాయి. పద్మసరోవరంలో అమ్మవారి తెప్ప విహారం దర్శించుకోవడం భక్తులకు అపూర్వమైన దివ్యానుభూతిని కలిగిస్తుంది.

తెప్పోత్సవాల సందర్భంగా ఐదు రోజుల పాటు నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్‌సేవలను, అలాగే జూన్ 26న నిర్వహించే లక్ష్మీపూజ కూడా టీటీడీ రద్దు చేసింది. శ్రీ పద్మావతి అమ్మవారి దివ్య కటాక్షం పొందేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ వార్షిక తెప్పోత్సవాలను విజయవంతం చేయాలని టీటీడీ కోరుతోంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More