ఆ వీడియోల్లో ఉన్నది నేను కాదు.. వైరల్ క్లిప్పింగ్స్‌పై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు క్లారిటీ

టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చారు.

Updated on: Mar 1, 2026, 14:28:13 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలపై తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ బి.ఆర్.నాయుడు స్పందించారు. బీఆర్ నాయుడు ఆ దృశ్యాలను కల్పితంగా కొట్టిపారేశారు. తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్‌లో పోస్ట్ చేసిన ఒక బహిరంగ ప్రకటనలో, ఆ వీడియోలు ఏఐ టెక్నాలజీ ఉపయోగించి రూపొందించినట్టుగా వెల్లడించారు. తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేందుకు, తిరుమల తిరుపతి దేవస్థానాల ప్రతిష్టను దెబ్బతీసేందుకు తయారు చేసి వైరల్ చేస్తున్నారని మండిపడ్డారు.

టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు
టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు.. డీప్ పేక్ అని, కొంతమంది తనను అప్రతిష్టపాలు చేయడానికి లక్ష్యంగా చేసుకున్న ప్రచారాన్ని చేస్తున్నారని బీఆర్ నాయుడు ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు వైరల్ చేయడం వెనక ఉన్నారని ప్రత్యేకంగా ఆరోపించారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు.. మహిళలతో ఉన్నట్టుగా వీడియో క్లిప్‌లు ఆన్‌లైన్‌లో కనిపించడంతో వివాదం చెలరేగింది. ఈ వీడియోలు వేగంగా వైరల్ అయ్యాయి. రాజకీయ విమర్శలు మెుదలయ్యాయి. అంతేకాదు జనాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.

ఈ డీప్‌ఫేక్ కంటెంట్ వెనుక ఉన్న ఉద్దేశ్యం తనను వ్యక్తిగతంగా కించపరచడమే కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రత, విశ్వసనీయతను దెబ్బతీయడమేనని బీఆర్ నాయుడు అన్నారు. ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రయత్నంగా ఆయన అభివర్ణించారు.

సైబర్ క్రైమ్ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేసినట్లు టీటీడీ ఛైర్మన్ ధృవీకరించారు. ఈ వీడియోలపై సమగ్ర దర్యాప్తు జరపాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తన ఇమేజ్, టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు చూస్తున్నవారిని చట్టబద్ధంగా ఎదుర్కొంటానని చెప్పారు. ఈ విషయంపై మౌనంగా ఉండనని స్పష్టం చేశారు.

'నకిలీ డీప్ ఫేక్ వీడియోలతో కొందరు సోషల్ మీడియాలో నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. వ్యక్తిగతంగా నన్ను అప్రతిష్ట పాలు చేసేందుకు, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దిగజార్చేందుకు కుట్రలు చేస్తున్నారు. AI సాంకేతికతను వాడుకుని నా రూపం అనుకరించే విధంగా వీడియోలు తయారు చేసి ప్రచారం చేస్తున్నారు. ఈ కంటెంట్ మొత్తం అసత్యమైనది, వక్రీకరించినది.. ఇది టీటీడీ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు పన్నిన పథకం. దీని వెనుక రాజకీయ దురుద్దేశం ఉంది. వైసీపీకి చెందిన కొందరు ఈ తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు. దీనిపై నేను చట్ట ప్రకారం ముందుకెళ్తాను.. నాపై సోషల్ మీడియాలో సాగుతున్న దుష్ప్రచారం వెనుక ఉన్న కుట్ర ను తేల్చాలని సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాను. నా వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ టీటీడీ ప్రతిష్టను దెబ్బతీస్తున్న వ్యక్తులను, దుష్ట శక్తులను వదిలేది లేదు.' అని బీఆర్ నాయుడు అన్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More