TTD Budget 2026 : రూ. 5,456 కోట్లతో టీటీడీ బడ్జెట్ - శ్రీవారి ముడుపు పత్రం పథకం అమలు, కీలక నిర్ణయాలివే
రూ.5,456 కోట్ల టీటీడీ వార్షిక బడ్జెట్‌కు ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది. తిరుపతిలోని వకుళమాత ఆలయంలో గోవింద అక్షరమాల కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. శ్రీవారి ముడుపు పత్రం పథకాన్ని ప్రారంభించనున్నారు.
టీటీడీ 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.5,456.26 కోట్ల బడ్జెట్‌కు ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ బడ్జెట్‌కు ఆమోదముద్ర వేసింది.

తిరుమల అన్నమయ్య భవనంలో ఈవో రవిచంద్రతో కలిసి టీటీడీ ఛైర్మన్ శనివారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. బడ్దెట్ కు సంబంధించిన వివరాలను వెల్లడించారు. టీటీడీ విద్యా సంస్థల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థినీ, విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో మెరుగైన విద్యను అందించేందుకు గాను రూ.118.89 కోట్లు కేటాయింపులు చేసినట్లు వెల్లడించారు. డిజిటల్ క్లాస్ రూములు, అదనపు హాస్టల్ బ్లాకులు, వంట గదుల ఆధునీకరణ, ఇతర మౌళిక సదుపాయాలు వంటి సమూలమైన మార్పులను తీసుకొచ్చేందుకు ఆమోదముద్ర వేసినట్లు పేర్కొన్నారు.
శ్రీవారి ముడుపు పత్రం పథకం…
భక్తుల విజ్ఞప్తి మేరకు శ్రీవారికి ముడుపులు అందించే దాతల సౌకర్యార్థం “శ్రీవారి ముడుపు పత్రం పథకం” ను ప్రయోగాత్మకంగా ప్రారంభించాలనే నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం భక్తులు మొక్కుల రూపంలో శ్రీవారి హుండీలో కానుకలు వేస్తున్నారు. ఇందుకు బదులుగా భక్తులు తిరుమలలో ఏర్పాటు చేసే కౌంటర్లలో UPI ద్వారా చెల్లింపులు చేస్తే అందుకు తగిన ముడుపు పత్రాలు అందజేస్తారు. వాటిని నేరుగా శ్రీవారి హుండీలో వేయవచ్చు. తద్వారా భక్తులు నగదు, నాణేలు తీసుకువచ్చేందుకు ఉన్న ఇబ్బందులు తొలగుతాయి.
బడ్జెట్ కు టీటీడీ ఆమోదం - కీలక నిర్ణయాలివే:
- తిరుమలలో భక్తుల సౌకర్యార్థం అదనంగా మరో అన్న ప్రసాద భవనం, ఆధునిక వంటశాలను అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించేందుకు రిలయన్స్ సంస్థ రూ.100 కోట్ల నుండి రూ.120 కోట్లు విరాళం అందించేందుకు ముందుకు రావడంతో పనులు ప్రారంభించేందుకు ఆమోదం.
- ఆలయాలు, ప్రాకారాలు, రాజ గోపురాలు తదితర నిర్మాణాలకు అయ్యే ఖర్చును దృష్టిలో ఉంచుకుని తదనుగుణంగా శ్రీవాణి ట్రస్టు మార్గదర్శకాలను మార్పు చేసేందుకు ఆమోదం.
- ఒంటిమిట్టలో 108 అడుగుల జాంబవంతుడి విగ్రహం ఏర్పాటుకుగాను డ్రై ఐల్యాండ్ నిర్మించేందుకు నిర్ణయం. అందుకుగాను రూ.20.17 కోట్లతో పనులకు ఆమోదం.
- కోయంబత్తూర్, గువహటి, బెలగావి, అదేవిధంగా పాట్నా వద్ద మోకామ నగరంలో శ్రీవారి ఆలయాల నిర్మాణాలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు టీటీడీకి కేటాయించిన భూమిని తీసుకునేందుకు గ్రీన్ సిగ్నల్.
- వకుళమాత ఆలయంలో అక్షర గోవిందం పేరుతో అక్షరాభాస్య కార్యక్రమం ప్రారంభించాలని నిర్ణయం.
- ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 1వ తేదీన జరగనున్న శ్రీ సీతారాముల కల్యాణానికి విచ్చేసే దాదాపు 70 వేల మంది భక్తులకు ఈ ఏడాది అదనంగా రూ.50 విలువ చేసే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని ఉచితంగా అందించాలని నిర్ణయించారు. గత ఏడాది తలంబ్రాల ప్యాకెట్ కిట్‌ను అందించిన విషయం తెలిసిందే.
- ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భక్తులను ఆకట్టుకునేలా రూ. 4.25 కోట్లతో విద్యుత్ అలంకరణలు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, ఎల్ఈడి బోర్డులు ఏర్పాటు చేయాలని నిర్ణయం.
- ఆర్మీ వెల్ఫేర్ ప్లేస్ మెంట్ ఆర్గనైజేషన్ ద్వారా తిరుపతిలో 356 మంది, తిరుమలలో 371 మంది భద్రత సిబ్బంది నియామకానికి ఆమోదం.
- అలిపిరి తనిఖీ కేంద్రంలో రూ.8 కోట్లతో ఎక్స్ రే బ్యాగేజ్ స్కానర్లు, డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లు ఏర్పాటుకు ఆమోదం.
- తిరుమల, తిరుపతిలోని టీటీడీ గోశాలలు, పలమనేరులోని శ్రీవేంకటేశ్వర ఇంక్యూబేషన్ సెంటర్ లలో రూ.11.28 కోట్లతో అభివృద్ధి పనులకు ఆమోదం.
- టీటీడీ ఆలయాల్లో పరిచారకులుగా పని చేస్తున్న 51 మందికి అర్చకులుగా పదోన్నతి కల్పించేందుకు గాను ప్రభుత్వానికి నివేదించాలని నిర్ణయం.
- పార్వతీపురం మన్యం జిల్లాలో శ్రీ వేంకటేశ్వర దివ్య క్షేత్రం నిర్మాణానికి రూ.14.25 కోట్లు కేటాయింపు.
- తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయం చుట్టూ సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ తదితర అభివృద్ధి పనులకు ఆమోదం.
- దేశవ్యాప్తంగా ఉన్న టీటీడీ ఆలయాలు, సత్రాలు, విశ్రాంతి భవనాలు, యాత్రికుల వసతి సముదాయాలు, విద్యా సంస్థలు, ఆసుపత్రులు, కల్యాణ మండపాల భద్రతను పర్యవేక్షించేందుకు తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో రూ.10.75 కోట్లతో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుకు ఆమోదం.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

