Tirumala Brahmotsavam 2026 : ఈసారి తిరుమలలో రెండు బ్రహ్మోత్సవాలు - ఏర్పాట్లపై టీటీడీ ఫోకస్! సిద్ధమవుతున్న రూట్ మ్యాప్

Tirumala Brahmotsavam 2026 Updates : ఈ ఏడాది అధిక మాసం రావడంతో తిరుమలలో రెండు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత, 10 లక్షల లడ్డూల బఫర్ స్టాక్‌తో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ ఈఓ తెలిపారు.

Published on: Aug 20, 2026, 17:56:56 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Tirumala Brahmotsavam 2026 Updates : ఈ ఏడాది అధిక మాసం రావడంతో తిరుమల శ్రీవారికి రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సర్వం సిద్ధం చేస్తోంది. ఈ అరుదైన సందర్భాన్ని పురస్కరించుకుని జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖ, టీటీడీ అధికారులు పూర్తి సమన్వయంతో పనిచేసి కట్టుదిట్టమైన ప్రణాళికలతో బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని టీటీడీ ఈఓ ముద్దాడ రవిచంద్ర ఆదేశించారు.

బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై టీటీడీ ఫోకస్
బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై టీటీడీ ఫోకస్

గురువారం తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈఓ సి.హెచ్.వెంకయ్య చౌదరి, తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వేంకటేశ్వర్, జిల్లా ఎస్పీ సుబ్బారాయుడులతో కలిసి ఈఓ ఉన్నతస్థాయి సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఈఓ బ్రహ్మోత్సవాల ముందస్తు ఏర్పాట్లను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అధికారులకు వివరించారు.

10 లక్షల లడ్డూల బఫర్ స్టాక్…..

సమావేశంలో ఈఓ ముద్దాడ రవిచంద్ర మాట్లాడుతూ….. తిరుమలకు విచ్చేసే సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.

"నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండా భక్తులందరికీ రుచికరమైన అన్నప్రసాదాలను నిరంతరాయంగా పంపిణీ చేయాలి," అని అధికారులను పురమాయించారు. తిరుమల కొండపై భక్తుల రద్దీ తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నందున, వారి భద్రతకు ఎలాంటి భంగం కలగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

శ్రీవారి ప్రసాదం కొరత రాకుండా ఈసారి బ్రహ్మోత్సవాల కోసం ప్రత్యేకంగా 10 లక్షల లడ్డూలను బఫర్ స్టాక్‌గా ఉంచుకోవాలని అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాల్లో అత్యంత ముఖ్యమైన గరుడ వాహన సేవ రోజున లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున, ఎక్కువ మందికి శ్రీవారి దర్శనం కల్పించేలా ప్రత్యేక క్యూలైన్లు, కారిడార్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భక్తుల రాకపోకలకు వీలుగా ఆర్టీసీ బస్సులను నిరంతరాయంగా నడిపేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. శ్రీవారికి నిస్వార్థంగా సేవలందించే నిజమైన శ్రీవారి సేవకులను గుర్తించి, వారి సేవలను బ్రహ్మోత్సవాల నిర్వహణలో విస్తృతంగా వినియోగించుకోవాలని తెలిపారు.

సమావేశం ముగిసిన అనంతరం ఈఓ అధికారుల బృందంతో కలిసి శ్రీవారి ఆలయ నాలుగు మాడ వీధుల్లో స్వయంగా తనిఖీలు చేపట్టారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల పనులను పరిశీలించి అధికారులకు పలు కీలక సూచనలు అందించారు.

సెప్టెంబరులో సాలకట్ల.. అక్టోబరులో నవరాత్రి బ్రహ్మోత్సవాలు

మాడ వీధుల తనిఖీ అనంతరం టీటీడీ అదనపు ఈఓ సి.హెచ్. వెంకయ్య చౌదరి, జిల్లా కలెక్టర్, ఎస్పీ, సీవీఎస్వో మురళీకృష్ణలతో కలిసి మీడియాతో మాట్లాడారు. అధిక మాసం కారణంగా ఈ ఏడాది సెప్టెంబరు నెలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబరు నెలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. దీనికోసం జిల్లా యంత్రాంగం, పోలీసు, టీటీడీ విభాగాలు ఒకే బృందంగా సమగ్ర ప్రణాళికను రూపొందించాయని తెలిపారు. బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఇప్పటివరకు పూర్తయిన పనులను సమీక్షించామని, పెండింగ్‌లో ఉన్న మిగిలిన పనులన్నింటినీ సెప్టెంబర్ 14వ తేదీలోగా పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని వివరించారు.

తిరుమలకు ఏటా పెరుగుతున్న భక్తుల సంఖ్యను, ఇటీవల రథసప్తమి నాడు తిరుమలకు ఒకే రోజు సుమారు 3.75 లక్షల మంది భక్తులు, 15 వేల వాహనాలు వచ్చిన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ముందస్తుగా రద్దీ అంచనాలు వేసినట్లు చెప్పారు. తిరుమల, తిరుపతి నగరాల్లో ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, ఆరోగ్యం, పారిశుద్ధ్యం, అన్నప్రసాదం, ఘాట్ రోడ్ల నిర్వహణతో పాటు అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించామన్నారు.

ముఖ్యంగా గరుడ సేవ రోజున భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుమలతో పాటు తిరుపతిలోనూ రద్దీ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. "గత బ్రహ్మోత్సవాల్లో గరుడసేవ రోజున సుమారు 20 లక్షల ఫుడ్ పోర్షన్లు, వివిధ రకాల పానీయాలు, 15 రకాల మెనూలను భక్తులకు అందించాం," అని వెంకయ్య చౌదరి గుర్తుచేశారు. ఈసారి అంతకుమించి భక్తులు వచ్చినా తట్టుకునేలా అదనపు వంటశాలల ఏర్పాటు…. నిత్యావసర సరుకుల రవాణా పక్కాగా ప్లాన్ చేశామని చెప్పారు.

విపత్తు నిర్వహణ కోసం ఎన్‌డీఆర్‌ఎఫ్ , అత్యవసర రెస్పాన్స్ టీమ్‌లను రంగంలోకి దించుతున్నామని…. పోలీసు, టీటీడీ విజిల్స్ సిబ్బంది సమన్వయంతో భద్రతను పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు. ఇక బ్రహ్మోత్సవాల్లో ఆధ్యాత్మిక, సాంస్కృతిక శోభను పెంపొందించేందుకు దేశంలోని 25 రాష్ట్రాల నుంచి 27 కళాబృందాలతో పాటు రెండు విదేశీ కళాబృందాలు కూడా సాంస్కృతిక ప్రదర్శనలు ఇవ్వనున్నాయని వెల్లడించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More