Tirumala : తిరుమలలో ఘనంగా మాదిరి బ్రహ్మోత్సవ గరుడసేవ

Tirumala : తిరుమలలో ఘనంగా మాదిరి బ్రహ్మోత్సవ గరుడసేవ నిర్వహించారు. బ్రహ్మోత్సవ ఏర్పాట్లను సమీక్షించుకోవడంలో భాగంగా టీటీడీ దీనిని ఆనవాయితీ నిర్వహిస్తోంది.

Published on: Aug 29, 2026, 09:45:38 IST
By , Tirumala
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తిరుమలలో ఆగస్టు 28వ తేదీ శ్రావణ పౌర్ణమిరోజున‌ మాదిరి బ్రహ్మోత్సవ గరుడసేవను టీటీడీ ఘనంగా నిర్వహించింది. ఈ ఏడాది సెప్టంబ‌ర్ 15 నుండి 23వ‌ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం పౌర్ణమి సందర్భంగా టీటీడీ మాదిరి గరుడ సేవను నిర్వహించింది.

తిరుమలలో మాదిరి బ్రహ్మోత్సవ గరుడసేవ
తిరుమలలో మాదిరి బ్రహ్మోత్సవ గరుడసేవ

సాధారణంగా ప్రతి ఏడాదీ బ్రహ్మోత్సవ ఏర్పాట్లను సమీక్షించుకోవడంలో భాగంగా టీటీడీ ఈ మాదిరి బ్రహ్మోత్సవ గరుడసేవను నిర్వహించడం ఆనవాయితీ. రాత్రి 7 నుండి 9 గంటల నడుమ జరిగిన ఈ గరుడ సేవలో టీటీడీ ఈవో ముద్దాడ ర‌విచంద్ర, అదనపు ఈవో సి.హెచ్.వెంక‌య్య చౌదరి, తిరుప‌తి ఎస్పీ సుబ్బరాయుడుల‌తో కలిసి నాలుగు మాడవీధుల్లో భద్రత, తాగునీరు పంపిణీ, అన్నప్రసాద వితరణ, శ్రీవారి సేవకుల సేవలు, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, ఇతర ఇంజినీరింగ్‌ ఏర్పాట్లను పరిశీలించారు.

కాగా శ్రీవారి గరుడ వాహనం ముందు గజరాజులు ఠీవిగా నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తించారు. మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

సెప్టెంబరులో విశేష ఉత్సవాలు

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో సెప్టెంబరు నెలలో పలు విశేష ఉత్సవాలు, సేవలు ఆగమోక్తంగా నిర్వహించనున్నారు. కార్యక్రమాల వివరాలు ఇలా ఉన్నాయి. సెప్టెంబరు 4, 11, 18, 25వ తేదీల్లో శుక్రవారం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు శ్రీ పద్మావతి అమ్మవారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. సెప్టెంబరు 22న ఉత్తరాషాఢ నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6.45 గంటలకు శ్రీ పద్మావతి అమ్మవారు గజవాహనంపై విహరించి భక్తులను కటాక్షించనున్నారు.

శ్రీ బలరామకృష్ణస్వామి ఆలయంలో సెప్టెంబరు 4న రోహిణి నక్షత్రం సందర్భంగా రాత్రి 7 గంటలకు శ్రీ కృష్ణస్వామివారికి తిరుచ్చి ఉత్సవం నిర్వహించనున్నారు.

శ్రీ సుందరరాజస్వామి ఆలయంలో సెప్టెంబరు 27న ఉత్తరాభాద్ర నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు శ్రీ సుందరరాజస్వామివారు తిరుచ్చి వాహనంపై విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.

శ్రీ సూర్యనారాయణస్వామి ఆలయంలో సెప్టెంబరు 13న హస్తా నక్షత్రం సందర్భంగా సాయంత్రం 5 గంటలకు శ్రీ సూర్యనారాయణస్వామివారు తిరుచ్చి వాహనంపై విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.

తిరుచానూరు శ్రీనివాస ఆలయంలో సెప్టెంబరు 5, 12, 19, 26వ తేదీల్లో శ్రీ వేంకటేశ్వరస్వామివారి మూలవర్లకు విశేషంగా అభిషేకం నిర్వహించనున్నారు.

అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సెప్టెంబరు 1న ఉదయం 8 గంటలకు అష్టదళ పాదపద్మారాధన సేవ నిర్వహించనున్నారు.

సెప్టెంబరు 4, 11, 18, 25వ తేదీల్లో శుక్రవారం సందర్భంగా ఉదయం 7 గంటలకు వస్త్రాలంకరణ సేవ, అభిషేకం నిర్వహించనున్నారు. సెప్టెంబరు 9న ఉదయం 8 గంటలకు అష్టోత్తర శత కలశాభిషేకం నిర్వహించనున్నారు.

సెప్టెంబరు 23న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. సెప్టెంబరు 6, 13, 20, 27వ తేదీల్లో ఉదయం 8.15 గంటలకు శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామివారికి అభిషేకం నిర్వహించనున్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More