పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 21న వరలక్ష్మీ వ్రతం.. 13వ తేదీన టికెట్లు విడుదల

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 21న వరలక్ష్మీ వ్రతం జరగనుంది. ఇందుకు సంబంధించి.. ఆగస్టు 13న ఆన్‌‌లైన్‌లో టికెట్ల విడుదల చేయనున్నారు.

Published on: Aug 13, 2026, 17:53:43 IST
By , Tirupati
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 21న నిర్వహించనున్న వరలక్ష్మీ వ్రతాన్ని వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేపట్టాలని టీటీడీ జేఈవో డా. ఎ.శరత్ అధికారులను ఆదేశించారు. తిరుచానూరులోని ఆస్థానమండపంలో చంద్రగిరి ఎమ్మెల్యే శ్రీ పులివర్తి నానితో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు.

టీటీడీ
టీటీడీ

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దర్శనం, క్యూలైన్లు, తాగునీరు, మజ్జిగ, అన్నప్రసాదం, పారిశుద్ధ్యం, భద్రత తదితర ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని జేఈవో సూచించారు. గత అనుభవాలను సమీక్షించి, లోపాలను సరిదిద్దుతూ భక్తులకు మరింత సౌకర్యవంతమైన ఆధ్యాత్మిక అనుభూతి కల్పించాలని ఆదేశించారు.

ఆగస్టు 21న శుక్రవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆస్థానమండపంలో వరలక్ష్మీ వ్రతం ఆగమోక్తంగా నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటలకు శ్రీ పద్మావతి అమ్మవారు స్వర్ణరథంపై నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. వ్రతం సందర్భంగా అభిషేకం, అభిషేకానంతర దర్శనం, లక్ష్మీపూజ, కల్యాణోత్సవం, బ్రేక్ దర్శనం, ఊంజల్‌సేవలను రద్దు చేసినట్లు తెలిపారు.

మహిళా భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున క్యూలైన్లు, పెండాళ్లు, సూచిక బోర్డులు, ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయాలని జేఈవో ఆదేశించారు. తాగునీరు, మజ్జిగ, అన్నప్రసాదం విస్తృతంగా అందించడంతో పాటు కుంకుమ ప్యాకెట్లు, కంకణాలు, గాజులు సిద్ధంగా ఉంచాలన్నారు.

భక్తుల్లో ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించేలా భజన బృందాలను ఏర్పాటు చేయాలని, ఆలయం, ఆస్థానమండపం పరిసరాలను పుష్పాలు, విద్యుద్దీపాలతో ఆకర్షణీయంగా అలంకరించాలని సూచించారు. అవసరమైన శ్రీవారి సేవకులు, పారిశుద్ధ్య, భద్రతా సిబ్బందిని సమకూర్చుకోవాలని, ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా పోలీసు, పంచాయతీ అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. వరలక్ష్మీ వ్రతాన్ని ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ, వరలక్ష్మీ వ్రతానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని అధికారులకు సూచించారు. రద్దీకి అనుగుణంగా తాగునీరు, మజ్జిగ, పెండాళ్లు, పార్కింగ్ సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. భక్తులకు సమాచారం అందించేందుకు హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేయాలని సూచించారు. శ్రీ పద్మావతి అమ్మవారి కృపాకటాక్షాలతో చంద్రగిరి నియోజకవర్గంతో పాటు జిల్లా, రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

13న ఆన్ లైన్ లో టికెట్ల విడుదల

వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఈ నెల 13వ తేదీన ఉదయం 10 గం.లకు ఆన్ లైన్ లో టికెట్లను విడుదల చేయనున్నారు. ఆఫ్ లైన్ టికెట్లను ఒక రోజు ముందు ఆలయ ముందు ఉన్న కౌంటర్ లో విడుదల చేయనున్నారు. స్కంద, భవిష్యోత్తర పురాణాల ప్రకారం పరమశివుడు పార్వతీదేవికి వరలక్ష్మీ వ్రత విశిష్టతను, ఆచరించే విధానాన్ని వివరించినట్లు అర్చకులు తెలిపారు. శ్రీ మహాలక్ష్మీ అవతరించిన దివ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన తిరుచానూరులో వరలక్ష్మీ వ్రతానికి విశేష ప్రాశస్త్యం ఉంది.

శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఈ వ్రతాన్ని ఆచరించడం ఆనవాయితీ. భక్తిశ్రద్ధలతో వ్రతాన్ని ఆచరించే మహిళలకు సత్సంతానం, దీర్ఘ సుమంగళీ సౌభాగ్యం, ఐశ్వర్యం, ఆరోగ్యం, కుటుంబ సౌఖ్యం కలుగుతాయని పురాణాలు తెలియజేస్తున్నాయని అర్చకులు తెలిపారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More