...
...
Next Story

TTD Pilgrim Insurance : శ్రీవారి భక్తులకు 'యాత్ర సురక్ష' భరోసా - బీమా సొమ్ము అందజేత, దేశంలోనే తొలిసారిగా...

తిరుమల యాత్రలో మరణించిన భక్తుల కుటుంబాలకు 'శ్రీవారి యాత్ర సురక్ష' పథకం కింద టీటీడీ, ఎల్ఐసీ సంయుక్తంగా రూ.2 లక్షల చొప్పున బీమా పరిహారం అందజేశాయి. మిగిలిన కుటుంబాలకు త్వరలోనే సాయం అందిస్తామని ఈవో ముద్దాడ రవిచంద్ర తెలిపారు.

Published on: Nov 24, 2026, 17:17:50 IST
Advertisement

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి వచ్చే భక్తుల భద్రత, వారి కుటుంబాల ఆర్థిక భరోసా కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రవేశపెట్టిన 'శ్రీవారి యాత్ర సురక్ష' పథకం సత్ఫలితాలను ఇస్తోంది. దేశంలోనే తొలిసారిగా భక్తుల కోసం తీసుకొచ్చిన ఈ వినూత్న బీమా పథకం కింద….. గత రెండు నెలల్లో తిరుమల యాత్రకు వచ్చి సహజంగా మరణించిన ఏడుగురు భక్తుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారాన్ని అందజేశారు.

బీమా పరిహారం అందజేత
బీమా పరిహారం అందజేత

మంగళవారం తిరుమలలో జరిగిన కార్యక్రమంలో టీటీడీ సాధికారిక మండలి చైర్మన్, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి, ఎల్ఐసీ ఆఫ్ ఇండియా సీఈవో, ఎండీ ఆర్. దొరైస్వామి కలిసి బాధిత కుటుంబ సభ్యులకు ఈ చెక్కులను పంపిణీ చేశారు.

సహజ మరణానికి రూ.2 లక్షలు..

కార్యక్రమం అనంతరం టీటీడీ సాధికారిక మండలి చైర్మన్, ఈవో ముద్దాడ రవిచంద్ర మీడియాతో మాట్లాడుతూ పథకం వివరాలను వెల్లడించారు.

"సెప్టెంబర్ 9వ తేదీన ఈ పథకాన్ని ప్రారంభించాము. దేశానికే ఆదర్శంగా నిలిచేలా శ్రీవారి యాత్ర సురక్ష పథకాన్ని రూపొందించాము. ఈ పథకం కింద తిరుమల యాత్రలో సహజ మరణం పొందిన భక్తుడి కుటుంబానికి రూ.2 లక్షలు, ప్రమాదవశాత్తు మరణించిన వారికి రూ.10 లక్షల బీమా పరిహారం అందిస్తున్నాము. గత రెండు నెలల కాలంలో తిరుమలలో 17 మంది భక్తులు మరణించారు. వారిలో ఏడుగురి కుటుంబ సభ్యులకు ఈరోజు బీమా పరిహారం అందజేశాము. మిగిలిన కుటుంబాలకు కూడా ధృవపత్రాల పరిశీలన పూర్తి కాగానే త్వరలోనే పరిహారం అందిస్తాము" అని ముద్దాడ రవిచంద్ర స్పష్టం చేశారు.

టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి మాట్లాడుతూ…. ఈ పథకం రూపకల్పన వెనుక ఉన్న కృషిని వివరించారు. "ఒకటిన్నర సంవత్సరాల పాటు ఎంతో కష్టపడి దేశానికే ఆదర్శవంతంగా ఈ బీమా పథకాన్ని తీసుకొచ్చాము. టీటీడీ భక్తుల కోసం ప్రత్యేకంగా శ్రీవారి యాత్ర సురక్ష బీమా పథకాన్ని రూపొందించడంలో సహకరించిన ఎల్ఐసీ అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. భవిష్యత్తులో భక్తులకు అందించే ఈ బీమా పరిహార మొత్తాన్ని మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటాము," అని వెంకయ్య చౌదరి పేర్కొన్నారు.

మార్గదర్శకంగా టీటీడీ - దొరైస్వామి

"శ్రీవారి యాత్ర సురక్ష పథకం ద్వారా తిరుమల యాత్ర సమయంలో దురదృష్టవశాత్తు మరణించిన భక్తుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం అందిస్తున్నాము. మరణ ధృవీకరణ పత్రం, నామినీ బ్యాంకు వివరాలు అందిన వెంటనే ఏమాత్రం జాప్యం లేకుండా పరిహారం చెల్లించేలా పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేశాము. టీటీడీ అమలు చేస్తున్న ఈ పథకాన్ని చూసి, తాము కూడా తమ భక్తుల కోసం ఇలాంటి పథకాన్ని ప్రవేశపెట్టేందుకు శబరిమలలోని ట్రావెన్‌కోర్ దేవస్థానం, జమ్మూలోని వైష్ణోదేవి ఆలయ అధికారులు మమ్మల్ని సంప్రదించారు," అని దొరైస్వామి వెల్లడించారు.

పరిహారం అందుకున్న ఏడుగురు మృతుల కుటుంబ సభ్యులు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కష్టకాలంలో తమకు అండగా నిలిచిన టీటీడీ, ఎల్ఐసీ అధికారులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.

 

ABOUT THE AUTHOR

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks